Breaking News

జనసేనలోకి విశాఖ వైసీపీ కార్పొరేటర్లు

-పార్టీలోకి ఆహ్వానించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ కి చెందిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కండువాలు కప్పి వీరందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జీవీఎంసీ 59వ వార్డు కార్పొరేటర్ పుర్రె పూర్ణశ్రీ, 43వ వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ, 47వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి కంటిపాము కామేశ్వరి, 77వ వార్డు కార్పొరేటర్ భట్టు సూర్యకుమారి, 42వ వార్డు కార్పొరేటర్ ఆళ్ల లీలావతి భర్త శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు కొవగాపు సుశీల, బొడులపాటి ఉమామహేశ్వరరావు, కనకమహాలక్ష్మి ఆలయ మాజీ ఛైర్మన్ జెర్రిపోతుల ప్రసాద్, లోక్ సత్తా జోనల్ మాజీ నాయకులు మంచిపల్లి సత్యనారాయణ, వైసీపీ సీనియర్ నాయకులు పాపిరెడ్డి మహేశ్వరరెడ్డి తదితరులు మంగళవారం పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. విశాఖ దక్షిణ శాసన సభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో వీరంతా జనసేనలో చేరారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఎన్నికల తరవాత మొట్టమొదటి రాజకీయపరమైన చేరికలు ఇవి. నాకు ఎంతో ఇష్టమైన విశాఖ నుంచి మొదలు కావడం ఆనందంగా ఉంది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. పార్టీలో కొత్తగా చేరిన నాయకులంతా రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నాను. పార్టీ కోసం కష్టపడిన జన సైనికులు, వీర మహిళలతో మమేకమై ముందుకు వెళ్లాలి. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి తరఫున బలంగా విజయం సాధించే విధంగా అంతా కృషి చేయాలి.

విశాఖలో పొల్యూషన్ ఆడిట్ నిర్వహిస్తాం
విశాఖలో కాలుష్య సమస్య చాలా ఎక్కువగా ఉంది. దేశంలోనే వాయు, జల కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరంగా ఉంది. కార్పొరేటర్లుగా మీ అందరిపై కాలుష్య నియంత్రణ బాధ్యత ఉంది. పర్యావరణశాఖ మంత్రిగా కాలుష్య నియంత్రణ మండలి నా పరిధిలోనే ఉంది. ఎక్కడైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి. విశాఖలో పొల్యూషన్ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. విశాఖలో రియల్ ఎస్టేట్ సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అన్నింటినీ పరిశీలించి ప్రజలకు న్యాయం చేద్దాం” అన్నారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం జనసేన ఇంఛార్జ్ పంచకర్ల సందీప్, రాష్ట్ర కార్యదర్శి అంగ దుర్గా ప్రశాంతి, జీవీఎంసీ కార్పొరేటర్లు భీశెట్టి వసంత లక్ష్మి, దల్లి గోవిందరెడ్డి, కందుల నాగరాజు, సాదిక్, వీరమహిళ ప్రాంతీయ కో ఆర్డినేటర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రికార్డు స్థాయిలో క్రియాశీలక సభ్యత్వాలు
అనంతరం పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్సీ పి. హరిప్రసాద్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ కళ్యాణం శివశ్రీనివాస్, పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ కి కూరగాయల గుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. చివరి రోజు సాయంత్రానికి లక్ష్యానికి మించి 12 లక్షలకు పైగా క్రియాశీలక సభ్యత్వాలు నమోదయ్యాయని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని హరిప్రసాద్ అధ్యక్షుల వారికి తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *