Breaking News

సెంట్రల్ జైలు సిబ్బందికి ఆరోగ్య భద్రత కల్పిస్తాం

– గంజాయి కేసులపై ఎక్కువ దృష్టి సారిస్తున్నాం
-సైకియాట్రిస్టులను అందుబాటులో ఉంచుతాం.
-ఇకనుంచి మహిళా పోలీసు స్టేషన్లగానే దిశ స్టేషన్లు
-ప్రిజన్స్ కేఫ్ ప్రారంభించిన..
-హోం విపత్తుల నిర్వహణ హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
క్షణికావేశంలో చేసిన తప్పులకు జైలు జీవితం గడుపుతున్న ఖైదీలు బయటకు వెళ్ళాక నేర ప్రవృత్తివైపు వెళ్లకుండా ఉండేందుకు ఫ్యూయల్ అవుట్ లెట్స్, ప్రిజన్ కేప్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ మరియు హోం శాఖ మంత్రి వంగలపూడి వనిత పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఇన్నిస్ పేట సమీపంలో వున్న సబ్ జైలు ఆవరణ లో ఏపి ప్రిజన్స్ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ప్రారంభించిన… అనంతరం సెంట్రల్ జైలు, మహిళా జైలు సందర్శించారు. ఈ సందర్భంగా సెంట్రల్ జైలు ఎదురుగ ఏర్పాటుచేసిన ప్రిజన్స్ కేఫ్ ని మంత్రి అనిత ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో హోమ్ మంత్రి అనిత మాట్లాడుతూ మానవతా దృక్పథంతో ఖైదీలకు మంచి ప్రవర్తన కల్గించడంలో భాగంగానే ప్రిజన్స్ కేఫ్, పెట్రోలు బంకు ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 16సబ్ జైళ్లు, రెండు సెంట్రల్ జైళ్లు, ఒక స్పెషల్ జైలు ఉండగా, ఒక బోస్టన్ జైలు కడుతున్నట్లు వివరించారు. జైళ్లలో మొత్తం 3వేల 483మంది ఖైదీలు ఉన్నారని, ఉండాల్సిన సంఖ్య కంటే అధికంగా 700 మంది ఉన్నారని మంత్రి తెలిపారు. రాజమండ్రిలో 1200 మంది సామర్ధ్యానికి అదనంగా 50మంది ఉన్నారన్నారు.

తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి కేసులపై ఎక్కువ దృష్టి పెట్టామని, రాష్ట్రంలో 1700మందిని అరెస్టు చేయగా, అందులో ఒక్క విశాఖలోనే వెయ్యిమంది వరకు ఉన్నారని, అలాగే రాజమండ్రి జైలులో 376మంది ఉన్నారని హోం మంత్రి అనిత చెప్పారు. గంజాయి కేసుల్లో అరెస్టయిన వారికోసం సైకిట్రిస్టులను ఏర్పాటుచేసి, అవగాహన కల్పించడంతో పాటు డీ ఎడిక్షన్ సెంటర్స్ కూడా పెట్టాలని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. సెంట్రల్ జైలు, మహిళా జైలు చూసాక అక్కడి ఇబ్బందులు , సౌకర్యాలు గురించి తెలుసుకున్నామని ఆమె తెలిపారు.

ముఖ్యంగా స్నేహ బ్లాక్ చూసిన తర్వాత భావోద్వేగానికి గురయ్యామని హోం మంత్రి అనిత చెప్పారు. ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘ కాలం పాలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని చేయని నేరానికి 53 రోజులపాటు జైలులో ఉంచడం దారుణమని అందుకే ఆయనని పెట్టిన స్నేహ బ్లాక్ ని చూడగానే తట్టుకోలేకపోయానని చెప్పారు. అలాగే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుని కూడా గతంలో అరెస్టు చేసి పెట్టిన బరాక్ కూడా చూశామని ఆమె తెలిపారు. అప్పుడు మా నాయకుడిని అరెస్టు చేసినపుడు ఎంతగానో బాధపడ్డామని ఇప్పుడుఅదే జైలుకి సందర్శనకు వచ్చామని ఆమె వివరిస్తూ, రోజులు అన్నీ ఒకేలా ఉండవన్నారు. అదే ప్రజాస్వామ్యం గొప్పతనమని అన్నారు. ఏ తప్పు చేయనివాడు అందులోకి వెళ్లకూడదన్నదే తమ భావనగా ఆమె చెప్పారు. ఇక జైలు సిబ్బంది చెప్పిన విషయాలు, సమస్యలు తెలుసుకున్నామని, ముఖ్యంగా సివిల్ పోలీసుల మాదిరిగా ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారని, ఇప్పటివరకు ఆరోగ్య భద్రత లేకపోవడం శోచనీయమని ఆమె పేర్కొంటూ వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఆరోగ్య భద్రత కల్పించనున్నట్లు ఆమె తెలిపారు.

ఖైదీలకు క్షమాభిక్ష గత ఐదేళ్లలో అసలు పట్టించుకోలేదని హోం మంత్రి అనిత గుర్తుచేస్తూ క్షమాభిక్ష ఇచ్చే విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గత 24ఏళ్లుగా జైలులో ఉండిపోయానంటూ ఒక ఖైదీ తన దృష్టికి తెచ్చాడని ఆమె పేర్కొన్నారు. అలాగే పెరోల్ నిబంధనలను కూడా సమీక్షిస్తామన్నారు. గతంలో ఒక వ్యక్తి ష్యురీటీ ఇస్తే సరిపోయేదని, ఈ నిబంధన మార్చడం వలన ఇబ్బంది వస్తోందని గమనించామని ఆమె చెబుతూ దీన్ని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. దిశ చట్టమే లేకుండా దిశా పోలీసు స్టేషన్లు పెట్టడంలో అర్ధం లేదని హోమ్ మంత్రి పేర్కొంటూ గతంలో మాదిరిగా మహిళా పోలీస్ స్టేషన్లుగానే వ్యవహరించనున్నట్లు ఆమె స్పష్టం చేసారు. ఐదేళ్లుగా ఒక విధానంలో వెళ్ళినపుడు మార్పు రావడానికి కొంత సమయం పడుతుందని, మొత్తం మీద ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను మళ్ళీ తీసుకొస్తున్నట్లు ఆమె చెప్పారు. పోలీసుల్లో శారీరక దృఢత్వాన్ని పెంచే దిశగా నెట్ ప్రాక్టీస్ క్రికెట్ ను మంత్రి అనిత ప్రారంభించి బ్యాట్ తో క్రికెట్ ను ఆడగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బౌలింగ్ చేయడం విశేషం.

ఈ కార్యక్రమంలో హోం మంత్రి వెంట ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, జైళ్ల ఐజి విశ్వజిత్, డి.ఐ.జి. ఆఫ్ ప్రిజన్స్ ఎం ఆర్ రవి కిరణ్, సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ , మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *