Breaking News

ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ల‌కు అనుగుణంగా దార్శ‌నిక‌త అవ‌స‌రం

-ప్ర‌తి శాఖా స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న‌ల‌తో కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక (2024-29) రూపొందించాలి
-విక‌సిత్ ఆంధ్రా-2047- జిల్లా దార్శ‌నిక‌త‌, కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక వ‌ర్క్‌షాప్‌లో క‌లెక్ట‌ర్ సృజ‌న‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌లు, ముఖ్య‌మంత్రి మార్గ‌ద‌ర్శ‌కాలకు అనుగుణంగా జిల్లా దార్శ‌నికత‌-కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక (2024-29) రూప‌క‌ల్ప‌న‌కు ప్ర‌తి శాఖా ప్ర‌గ‌తికి సంబంధించి స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న‌ల‌తో ప్ర‌ణాళిక‌ను రూపొందించి ఈ నెల 31లోగా సీపీవో కార్యాలయానికి అంద‌జేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న సూచించారు.
శుక్ర‌వారం న‌గ‌రంలోని క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో విక‌సిత్ ఆంధ్రా-2047కు సంబంధించి త‌క్ష‌ణ క‌ర్త‌వ్యంగా జిల్లా దార్శ‌నిక‌త‌-కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక (2024-29) రూప‌క‌ల్ప‌న‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై క‌లెక్ట‌ర్ సృజ‌న నేతృత్వంలో అన్ని శాఖ‌ల అధికారుల‌కు వ‌ర్క్‌షాప్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ఏ చిన్న ప‌ని చేయ‌డానికైనా స‌రైన దార్శ‌నిక‌త‌, ప్ర‌ణాళిక ఉంటేనే ఆ ప‌ని విజ‌య‌వంత‌మ‌వుతుంద‌ని.. అదే విధంగా వివిధ శాఖ‌లు వ‌చ్చే అయిదేళ్ల‌లో గ‌ణ‌నీయ పురోగ‌తి సాధించేందుకు అనుస‌రించే ప్ర‌ణాళికను రూపొందించేందుకు చిత్త‌శుద్దితో, నిబ‌ద్ధ‌త‌తో కృషిచేయాల‌ని సూచించారు. ప్ర‌తి శాఖా త‌మ భాగ‌స్వామ్య ప‌క్షాల‌తో నాణ్య‌మైన సంప్ర‌దింపులు జ‌రిపి, కీల‌క అంశాల‌ను న‌మోదు చేయాల‌న్నారు. ఆయా శాఖ‌ల అధికారులు ప‌టిష్ట స‌మ‌న్వ‌యం, భాగ‌స్వామ్యంతో త‌మ శాఖ‌ల‌కు చెందిన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను రూపొందించాల‌న్నారు. పేదరిక నిర్మూలన; సాంఘిక‌, భౌతిక మౌలిక వ‌స‌తుల అభివృద్ధి; జీవ‌న సౌల‌భ్యం, పారిశ్రామిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా నైపుణ్యాల పెంపు, అత్యంత నాణ్య‌మైన సేవ‌లు, టెక్ అనుసంధాన ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, డిజిట‌ల్ గ‌వ‌ర్నెన్స్ త‌దిత‌ర అంశాల‌కు ప్ర‌భుత్వం ప్రాధాన్య‌మిస్తున్నందున వీటిని దృష్టిలో ఉంచుకోవాల‌న్నారు. ఏటా 15 శాతం వృద్ధి ల‌క్ష్యానికి అనుగుణంగా శాఖ‌ల వారీగా వృద్ధి చోద‌క శ‌క్తుల‌ను గుర్తించాల‌ని, నిపుణులు, ముఖ్య సంస్థ‌ల స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌న్నారు. జిల్లా స‌మ‌గ్రాభివృద్ధి త‌ద్వారా రాష్ట్రం, దేశ స‌మ‌గ్రాభివృద్ధిలో అధికారులు కీల‌క భాగ‌స్వాములు కావాల‌ని క‌లెక్ట‌ర్ సృజ‌న ఈ సంద‌ర్భంగా సూచించారు.
జిల్లా ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న‌కు సంబంధించి నోడ‌ల్ అధికారులుగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న సీపీవో వై.శ్రీల‌త‌, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాస‌రావు, జిల్లా ప‌రిశ్ర‌మ‌ల అధికారి ఎ.సుధాక‌ర్‌, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్ త‌మ‌కు కేటాయించిన శాఖ‌ల‌కు సంబంధించి జిల్లా అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. 2024-29 కాలానికి గాను వృద్ధి, స్థూల రాష్ట్ర దేశీయోత్ప‌త్తి (జీఎస్‌డీపీ) ప‌రంగా సాధించాల్సిన ల‌క్ష్యాలు, స్థూల జిల్లా దేశీయోత్ప‌త్తి (జీడీడీపీ), త‌ల‌స‌రి ఆదాయం, జిల్లా ఆర్థిక స్వ‌రూపం, శాఖ‌ల వారీగా బ‌లాలు త‌దిత‌రాల‌ను వివ‌రిస్తూ స‌రైన విధంగా కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న‌కు సూచ‌న‌లు చేశారు.
స‌మావేశంలో పౌర సరఫరాల డీఎం జి.వెంకటేశ్వర్లు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. మహేశ్వరరావు, కేఆర్ ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఇ.కిరణ్మయి, డ్వామా పీడీ జె.సునీత, ఐసీడీఎస్ పీడీ జి.ఉమాదేవి, విజయవాడ నగర పాలకసంస్థ అదనపు కమిషనర్ కేవీ సత్యవతి, డీఎంహెచ్ఓ డా. ఎం.సుహాసిని, డీఈవో యు.వి.సుబ్బారావు, డీపీవో ఎన్వీ శివ ప్రసాద్ యాదవ్, తదితర అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *