Breaking News

ప్రజా సమస్యల పరిష్కార వేదిక- మీకోసం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి అందే అర్జీల పట్ల అత్యధిక ప్రాధాన్యతతో నిర్ణీత గడువు దాటకుండా నాణ్యత ప్రమాణాలు పాటించి పరిష్కరించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక- మీకోసం కార్యక్రమం ఇన్చార్జి డిఆర్ఓ శ్రీదేవి మచిలీపట్నం ఆర్డిఓ ఎం వాణిలతో కలిసి నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను ఎంతో ఓపిగ్గా ఆలకించి సంబంధిత అధికారులను పిలిపించి వారి సమస్యలు పరిష్కారం చేయాలని సూచించారు.

మీకోసం కార్యక్రమానికి మొత్తం మీద 80అర్జీలు జిల్లా యంత్రాంగానికి అందాయి. వాటిలో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి:

ఉయ్యూరు నగర పంచాయతీ 12వ వార్డు కనుపూరి వారి అగ్రహారంలో నివసిస్తున్న సోమయాజుల విశ్వేశ్వరరావు, పామర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాము వ్యవసాయ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, గత 8 సంవత్సరాలుగా చిన ఓగిరాల గ్రామం నుండి యాకమూరు గ్రామం వరకు తమకు ప్రక్కన గల పుల్లేరు కాలువలో పుట్టుకొచ్చిన గుర్రపు డెక్క, ఇతర వ్యర్థాలు ప్రోక్లైన్తో తొలగించి పక్కనే తాము అనునిత్యం ప్రయాణించి నడిచి వెళ్లే కాలువ గట్ల పైన, కాలువబాట వంతెన పక్కన వేయిచున్నారని, దీనివలన ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు ప్రయాణించడానికి వీలు లేకుండా పోయిందని, ఆ గుర్రపు డెక్క మలిన పదార్థాలు తమ భూముల్లోకి, ఇంట్లోకి జారిపోతున్నాయని, దీనివలన వంట నష్టం జరుగుతున్నదని, దుర్వాసన, దోమలు కూడా పెరిగిపోతున్నాయని ప్రతి సంవత్సరం ఇలా చేయడం వలన వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేయుటకు చాలా ఇబ్బందులు పడుతున్నామని, తొలగించిన గుర్రపు డెక్కను ఇతర ప్రాంతాల్లోకి తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తూ అర్జీ అందజేశారు.

ఏలూరు పట్టణం అశోక్ నగర్ ధూర్జటి వారి వీధికి చెందిన సాతూలూరి సత్యనారాయణ చార్యులు వారి సతీమణి వెంకటలక్ష్మి మాట్లాడుతూ తమకు బాపులపాడు మండలం ఓగిరాల గ్రామంలో రీ సర్వే నంబరు 37/1,2 నంబర్లలో 9.90 ఎకరాల భూమి ఉందని, అందులో 0.76 సెంట్లు భూమి బుడమేరు భూసేకరణ కింద ప్రభుత్వం తీసుకుందని, ఆ భూమికి సంబంధించి ఇంతవరకు నష్టపరిహారం అందలేదని మిగతా భూమిలో 0.37 సెంట్ల భూమి గ్రామ లెక్కల్లో ఆర్ఓఆర్ లో నమోదు కావాల్సి ఉందని, 22-ఏ పరిధి నుండి ఈ భూమిని తొలగించి, నష్టపరిహారం చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

ఉయ్యూరుకు చెందిన సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పమిడిముక్కల మండలం కృష్ణాపురం గ్రామంలోని 7
ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గ్రామపంచాయతీ ఊర చెరువు ఆక్రమణకు గురైందని, 60 నుంచి 80 వేల రూపాయలకు ఆ స్థలాన్ని అమ్ముకుంటున్నారని, ఆక్రమణ వలన చెరువు కలుషితమై దుర్వాసన వస్తుందని, గ్రామంలోని పశువులకు హానికరంగా మారిందని,, ఆక్రమణలను తొలగించడానికి తగు చర్యలు తీసుకోవాలని
కోరుతూ అర్జీ అందజేశారు.

అలాగే అదే మండలంలోని గోపువానిపాలెం గ్రామం సర్వే నెంబర్ 30 లోని 9.88ఎకరాల వల్లభుడు చెరువు, సర్వే నంబర్ 93 లో 4.44 ఎకరాలు పట్టాభి రాముడు చెరువులు రైతులు ఆక్రమించుకున్నారని వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని అందులో ఫిర్యాదు చేశారు.

తొలుత జిల్లా ఇన్చార్జి కలెక్టర్ జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుండి పంపిన 46 అర్జీలు ఇంకా పరిష్కారం కాక పెండింగ్లో ఉన్నాయని వాటికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించాలన్నారు. కొంతమంది అర్జీలను ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగా పంపుతున్నారని, అవి అక్కడి నుండి జిల్లాకు వస్తున్నాయని, ఆ అర్జీలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి నాణ్యత ప్రమాణాలు విధిగా పాటిస్తూ నిర్ణీత గడువు లోగా పరిష్కరించాలన్నారు.

మీకోసం అర్జీల పరిష్కారం సంబంధించి జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. మీకోసం అర్జీల పరిష్కారంపై ప్రతిరోజు వారు సమీక్షిస్తున్నారన్నారు. ఇకపై జిల్లా అధికారులు దీనిని చాలా తీవ్రమైన విషయంగా పరిగణిస్తూ ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలన్నారు.

అర్జీదారులకు నేరుగా సరైన సమాధానం పంపాలని ఏదైనా వారు కోరిన పనులు చేయలేకపోతే అవి ఎందుకు చేయలేదో కారణాలు స్పష్టంగా తెలియజేస్తూ వివరించాలన్నారు. ఏదైనా వివాదాలు కానీ, పాలసీ విధానాలకు సంబంధించి గాని, కోర్టు కేసుల స్టేకు సంబంధించి గాని ఉంటే అవి ప్రస్తావిస్తూ, నియమాలు నిబంధనలు పేర్కొంటూ సమాధానం పంపాలన్నారు. తొందరపడి ఏదో సమాధానం ఇచ్చేసి అర్జీని ముగించరాదని స్పష్టం చేశారు.

జిల్లాలో 16 అర్జీలు గడువు మీరి ఉన్నాయని వాటిని సంబంధిత శాఖలు వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 24 గంటల్లో పరిష్కరించాల్సిన 6 సమస్యలు ఉన్నాయని వాటిని సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలన్నారు. జిల్లాలో 28 కోర్టు కేసులకు సంబంధించి వివరాలు కోరడం జరిగిందని, అందులో 10 కేసులకు సంబంధించి నివేదికలు అందాయని, మిగిలిన కేసులకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులు తాజా సమాచారం వెంటనే పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఓ నాగేశ్వర్ నాయక్, జెడ్పిసిఈఓ ఆనంద్ కుమార్, సర్వే భూ రికార్డుల ఏడి మనీషా త్రిపాఠి, ఏపీఎంఐపి పీడీ విజయలక్ష్మి, మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్, డీఎస్ఓ పార్వతి మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, డిఎంహెచ్వో డాక్టర్ గీతాబాయి, డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రావణ్ కుమార్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *