Breaking News

ఈ నెల 23 నుంచి ఇసుక బుకింగ్‌కు ప్ర‌త్యేక కేంద్రాలు

– ఉద‌యం ఆరు గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు బుకింగ్ చేసుకోవ‌చ్చు
– స్టాక్ పాయింట్ల వ‌ద్ద బుకింగ్‌కు అవ‌కాశం లేదు
– ఇన్‌వాయిస్ లేని వాహ‌నాల‌కు స్టాక్ పాయింట్ల వ‌ద్ద‌కు అనుమ‌తి లేదు
– 1800-599-4599, 1800-425-6029 టోల్‌ఫ్రీ నంబ‌ర్ల ద్వారా ఫిర్యాదు చేయొచ్చు
– అక్ర‌మంగా నిల్వ ఉంచినా, ర‌వాణా చేసినా చ‌ట్ట‌ప‌ర చ‌ర్య‌లు త‌ప్ప‌వు
– మీడియా స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
త్వ‌ర‌లో కొత్త ఇసుక విధానం రానుంద‌ని ఈలోగా ప్ర‌స్తుత ఉచిత ఇసుక విధానాన్ని మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లుచేసేందుకు గౌర‌వ ముఖ్య‌మంత్రి మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింద‌ని.. ఈ నెల 23వ తేదీ శుక్ర‌వారం నుంచి స్టాక్ పాయింట్ల వ‌ద్ద బుకింగ్‌కు వీలుండ‌ద‌ని, ప్ర‌త్యేకంగా ఇసుక బుకింగ్‌కు కేంద్రాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న వెల్ల‌డించారు. ఉచిత ఇసుక విధానం నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాల‌పై క‌లెక్ట‌ర్ సృజ‌న‌.. జాయింట్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా, డీసీపీ కేఎం మ‌హేశ్వ‌ర‌రాజు, ఏసీపీ డా. ర‌వికిర‌ణ్‌తో క‌లిసి గురువారం క‌లెక్ట‌ర్ క్యాంపుకార్యాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ సృజ‌న మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానంలో మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త‌ను, జ‌వాబుదారీత‌నాన్ని పెంచేందుకు, ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌ల‌కు ఆస్కారం లేకుండా ఉండేందుకు ప్ర‌త్యేకంగా ఇసుక బుకింగ్ కేంద్రాల‌ను ఏర్పాటుచేశామ‌న్నారు. కీస‌ర స్టాక్ పాయింట్ (కంచిక‌చ‌ర్ల మండ‌లం)కు కంచిక‌చ‌ర్ల‌-3 గ్రామ స‌చివాల‌యంలోనూ, మొగులూరు స్టాక్ పాయింట్ (కంచిక‌చ‌ర్ల మండ‌లం)కు చెవిటిక‌ల్లు గ్రామ స‌చివాల‌యంలోనూ, అనుమంచిప‌ల్లి స్టాక్‌పాయింట్ (జ‌గ్గ‌య్య‌పేట మండ‌లం)కు షేర్‌మొహ‌మ్మ‌ద్‌పేట పంచాయ‌తీ కార్యాల‌యంలో, పోలంప‌ల్లి స్టాక్ పాయింట్ (వ‌త్స‌వాయి మండ‌లం)కు పోలంప‌ల్లి గ్రామ స‌చివాల‌యంలోనూ ఇసుక బుకింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు వివ‌రించారు. రెవెన్యూ, పోలీస్‌, మైన్స్ శాఖ‌ల అధికారులు ఇప్ప‌టివ‌ర‌కు చోటుచేసుకున్న ప‌రిణామాల‌ను విశ్లేషించి, ఈ కేంద్రాల‌ను అందుబాటులోకి తెచ్చిన‌ట్లు తెలిపారు. జిల్లాలో జులైలో ఎనిమిది స్టాక్‌పాయింట్లతో ఉచిత ఇసుక విధానం ప్రారంభంకాగా.. ప్ర‌స్తుతం నాలుగు స్టాక్ పాయింట్ల‌లో ఇసుక అందుబాటులో ఉంద‌ని తెలిపారు. ఈ బుకింగ్ కేంద్రాలు ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ప‌నిచేస్తాయ‌న్నారు. AP.Mines.Gov.in వెబ్‌సైట్లో రిజిస్ట‌ర్ అయిన వాహ‌నాల‌కు మాత్ర‌మే బుకింగ్ చేయ‌డం జ‌రుగుతుంద‌ని, అదే విధంగా ఇన్‌వాయిస్ లేని వాహ‌నాల‌ను స్టాక్‌పాయింట్ల వ‌ద్ద‌కు అనుమ‌తించ‌డం జ‌ర‌గ‌ద‌న్నారు. బుకింగ్ స‌మ‌యంలోనే స్లాట్ కేటాయించ‌డం జ‌రుగుతుంద‌ని.. ఆ వ్య‌వ‌ధిలోనే స్టాక్ పాయింట్‌కు వాహ‌నాలు వెళ్లాల్సి ఉంటుంద‌న్నారు. జిల్లాస్థాయి ఇసుక క‌మిటీ (డీఎల్ఎస్‌సీ) నిర్ధారించిన ర‌వాణా ఛార్జీల‌ను మాత్ర‌మే అనుమ‌తించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ట్రాన్స్‌పోర్టు ఛార్జీల‌ను, హ్యాడ్లింగ్ ఛార్జీల‌ను బుకింగ్ కేంద్రాల వ‌ద్ద ప్ర‌ద‌ర్శించ‌డం జ‌రుగుతుంద‌ని.. ఒక వినియోగ‌దారునికి రోజుకు 20 మెట్రిక్ ట‌న్నుల వ‌ర‌కు మాత్ర‌మే అందించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. కార్య‌క‌లాపాలు స‌జావుగా సాగేందుకు, వినియోగ‌దారుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్ర‌భుత్వం ఈ చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు తెలిపారు.

నోడ‌ల్ అధికారిగా జాయింట్ క‌లెక్ట‌ర్‌:
ఉచిత ఇసుక విధానం అమలు ప‌ర్య‌వేక్ష‌ణ‌కు సంబంధించి జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ నోడ‌ల్ అధికారిగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని క‌లెక్ట‌ర్ సృజ‌న తెలిపారు. ఏవైనా ఫిర్యాదులు చేయాల్సి వ‌స్తే 1800-599-4599 (రాష్ట్ర‌), 1800-425-6029 (జిల్లా) టోల్‌ఫ్రీ నంబ‌ర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చ‌న్నారు. dmgontrsandcomplaints@yahoo.com మెయిల్‌కు కూడా ఫిర్యాదులు పంపొచ్చ‌న్నారు. ఈ ఫిర్యాదుల‌ను స‌త్వ‌రం ప‌రిష్కరించేందుకు ప్రాజెక్టు మానిట‌రింగ్ యూనిట్ (పీఎంయూ) ఏర్పాటు చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ సృజ‌న తెలిపారు.

ప‌క‌డ్బందీగా చెక్‌పోస్టులు: డీసీపీ మ‌హేశ్వ‌ర‌రాజు
డీసీపీ (రూర‌ల్‌) కేఎం మ‌హేశ్వ‌ర‌రాజు మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానం ప‌టిష్ట అమ‌లుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింద‌ని.. అద‌న‌పు చెక్‌పోస్టుల‌తో నిఘాను పెంచామ‌ని తెలిపారు. అక్ర‌మంగా ఇసుక త‌వ్వ‌కాలు, ర‌వాణా జ‌రిపినా, నిల్వ ఉంచినా చ‌ట్ట‌ప‌ర చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇప్ప‌టివ‌ర‌కు 22 కేసులు న‌మోదు చేశామ‌ని, అదే విధంగా 28 వాహ‌నాల‌ను సీజ్ చేసిన‌ట్లు తెలిపారు. వివిధ శాఖ‌ల అధికారుల స‌మ‌న్వ‌యంతో, మీడియా స‌హ‌కారంతో ఉచిత ఇసుక విధానాన్ని ప‌క‌డ్బందీగా అమ‌లుచేస్తున్న‌ట్లు తెలిపారు. స‌మావేశంలో ఏసీపీ డా. ర‌వికిర‌ణ్ పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *