Breaking News

మట్టి వినాయకుడిని పూజిద్దాం… పర్యావరణాన్ని పరిరక్షిద్దాం: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

-వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా పకడ్బందీగా అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో సమన్వయంతో జిల్లాలో సజావుగా ప్రశాంతంగా నిర్వహించాలి….ప్రజలు సహకరించాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా పకడ్బందీగా అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో సమన్వయంతో జిల్లాలో సజావుగా ప్రశాంతంగా నిర్వహించాలని, ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ కోరారు.

శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో రానున్న వరసిద్ధి వినాయక ఉత్సావాల నిర్వహణ, నిమజ్జనం కార్యక్రమాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ గారు ఎస్పి సుబ్బరాయుడు, జెసి శుభం బన్సల్, మేయర్ డా. శిరీష, తిరుపతి మునిసిపల్ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య, ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ, నిర్వాహకులు తదితరులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకుందామని అన్నారు. తిరుపతి నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ వారు టీటీడీ సహకార సమన్వయంతో వినాయక నిమజ్జన కార్యక్రమాలు చేపట్టాలని, అందరూ సహకరించాలని అన్నారు. తిరుపతి నగర వినాయక ఉత్సవ కమిటీ ప్రత్యేక శ్రద్ధతో మహోత్సవాలకు సహకారం అందిస్తున్నoదుకు సంతోషం అని అన్నారు. గత సంవత్సరం గజ ఈతగాళ్లు సమస్య ఉండిందని కమిటీ సభ్యులు తెలుపగా, ఈ సారి అలాంటి సమస్యలు లేకుండా మత్స్య శాఖ అధికారి వారు చర్యలు తీసుకోవాలని సూచించారు. గజ ఈతగాళ్లు తగినంతమంది ఉండేలా చర్యలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మనమందరం బాధ్యతగా మట్టి వినాయకులను పూజించి పర్యావరణానికి మేలు కలిగేలా చూడాల్సి ఉంటుందని , లక్షల విగ్రహాలు పూజింప బడతాయని మట్టి వినాయకుల నిమజ్జనం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని వుండదని తెలిపారు. అన్నమాచార్య కీర్తనల బృందాలను టీటీడీ వారు ఏర్పాటు చేయాలని, ఆర్చిలు, పట్టణంలో పలు ప్రాంతాల్లో, డెకరేషన్ లైటింగ్, అరటి తోరణాలు ఏర్పాటు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్లీచింగ్, శానిటేషన్, త్రాగు నీరు, స్టేజి, లైటింగ్ ఏర్పాట్లు, బ్యారికేడింగ్ పోలీస్ వారితో సమన్వయము చేసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ కు సూచించారు. నిమజ్జన కార్యక్రమం కొరకు నీటి నిల్వ తగినంత ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. వినాయక సాగర్, చెన్నాయ గుంట, దామినేడు వద్ద నిమజ్జనంలో ఎలాంటి అపశృతులు జరగకుండా జాగ్రత్తగా నిర్వహించాలని అన్నారు. తుడా నుండి షామియానా, టేబుల్ ఇతర ఏర్పాట్లు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ వారితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీ వారు బస్ ట్రాఫిక్ రూట్ సమన్వయం పోలీస్ వారితో చేసుకోవాలని సూచించారు. అంబులెన్స్ ల ఏర్పాటు, ప్రథమ చికిత్స ఏర్పాటు ఉండాలని వైద్యాధికారులకు సూచించారు. ఇరిగేషన్ అధికారులు చెన్నాయ గుంట వద్ద కరకట్ట పరిశీలించాలని సూచించారు. ఏపీఎస్పీడిసిఎల్ వారు పవర్ కట్ లేకుండా చూడాలని, కరెంట్ తీగలు వేలాడుతుంటే వాటిని సరిచేయాలని, నిమజ్జన ప్రాంతంలో జనరేటర్ తదితర ఏర్పాట్లు ఉండాలని సూచించారు. అన్ని పట్టణాల్లో, మండలాల్లో కూడా పోలీస్, రెవెన్యూ, మండల అధికారులు, పంచాయితీ రాజ్, మునిసిపల్ అధికారులు సమన్వయంతో వినాయక విగ్రహ ఏర్పాట్లు, నిమజ్జన ఏర్పాట్లు సామరస్యంగా ప్రశాంతంగా సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సుమారు 2500 విగ్రహాలు ఏర్పాటు కానున్నాయని పండుగ వాతావరణంలో, భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, అధికారులు అప్రమత్తంగా బాధ్యతగా వ్యవహరించి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు.

ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు మాట్లాడుతూ మునిసిపల్ కార్పొరేషన్ వారు వినాయక సాగర్ నందు తగినంత నీరు ఉండేలా చూసుకోవాలని, శానిటేషన్, క్లోరినేషన్, పారిశుధ్యం చక్కగా ఉండాలని అన్నారు. నీటిలో బ్యారికెడింగ్ పక్కాగా ఏర్పాటు ఉండాలని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. విగ్రహాల నిమజ్జనం రూట్ వారీగా వారికి డేట్, టైం కేటాయించి సక్రమంగా జరిగేలా చూడాలని అన్నారు.

మేయర్ మాట్లాడుతూ దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ వారి సహకారంతో మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్, అధికారులు, అందరు జిల్లా అధికారులు పూర్తి సమన్వాయంతో సజావుగా నిర్వహించాలని కోరారు. ఈ సారి కూడా పర్యావరణ హిత వినాయకుల ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలిపారు.

మునిసిపల్ కమిషనర్ మాట్లాడుతూ సమన్వయంతో వినాయక మహోత్సవాల ఏర్పాట్లు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

ఎస్పీ మాట్లాడుతూ వినాయక మహోత్సవ కమిటీ నిర్వహణ, నిమజ్జన కమిటీలతో సమన్వయంతో పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సింగిల్ విండో విధానంలో ఫైర్, విద్యుత్, పోలీస్, మునిసిపల్ తదితర అధికారులు ఒకే వేదిక లో కూర్చునేలా ఏర్పాటుతో పర్మిషన్లు త్వరితగతిన ఇచ్చేలా ఇవన్నీ విగ్రహాల ఏర్పాటుకు రెండు మూడు రోజులు ముందే ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి మంటపానికి బాధ్యుల వివరాలను ముందుగా తీసుకుంటామని, రాత్రి 10 నుండి ఉదయం 6 వరకు ఎలాంటి మైక్, సౌండ్ సిస్టం, డిజే వాడరాదని అన్నారు. మండపాలలో భక్తి పాటలు మాత్రమే ప్లే చేయాల్సి ఉంటుందని, ఇతర పాటలు ఉండరాదని కోరారు. క్రేన్ ఏర్పాటు ఉండాలని, వాహనాలు మధ్యలో పాడైతే వాటిని రిపేర్ చేయడానికి తగినంత మంది మెకానిక్ లు అందుబాటులో ఉండేలా రవాణా శాఖ వారు చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్గాలుగా ఏర్పడి గొడవలు పడకుండా అందరూ ప్రశాంతంగా వినాయక మహోత్సవాలు జరిగేలా అందరూ సహకరించాలని, త్రాగి గొడవలు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సమావేశ ప్రారంభానికి ముందు శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ పలు అంశాలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వారు మాట్లాడుతూ పార్వతీ పుత్ర పర్యావరణ మిత్ర అనే కార్యక్రమం ద్వారా మట్టి వినాయకుల తయారీ మరియు వాటిని మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వినాయక సాగర్ నందు వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రతిసారీ జరుగుతుందని, అలాగే చుట్టూ ప్రక్కల మూడు చెరువులలో కూడా చుట్టు ప్రక్కల ప్రాంతాల వారు నిమజ్జనం చేస్తారని, 3, 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు లో నిమజ్జనం జరుగుతాయని, ఎక్కువ శాతం 3 రోజులకు నిమజ్జనం చేస్తారని, అన్ని శాఖలు సహకరించాలని కోరారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, నాగభూషన రావు, తుడా సెక్రెటరీ వెంకట నారాయణ, ఆర్డీఓ రవి శంకర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారిని సుశీల దేవి, తిరుపతి వరసిద్ది వినాయక మహోత్సవ కమిటీ ప్రతినిధులు సామంచి శ్రీనివాస్, భాను ప్రకాష్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, ఆర్.సి మునికృష్ణ, మాగంటి గోపాల్ రెడ్డి, గుండాల గోపి నాథ్, అజయ్, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *