Breaking News

మీకోసం అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయి అధికారులను చైతన్యపరచాలి…

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త :
మీకోసం అర్జీల పరిష్కారంలో సరైన విధానం అనుసరించేలా క్షేత్రస్థాయి అధికారులను చైతన్యపరచాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం కార్యక్రమ విభాగం సిబ్బందితో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి మీకోసం అర్జీల పరిష్కారంపై సమీక్షించారు. తొలుత జిల్లా కలెక్టర్ పి.జి.ఆర్.ఎస్.వెబ్ సైట్లో జిల్లాకు సంబంధించి వచ్చిన కొన్ని అర్జీలు, సంబంధిత ప్రభుత్వ శాఖలు పరిష్కరించిన వివరాలు పరిశీలించారు. అర్జీదారులు తమ దరఖాస్తులలో ఏ సమస్యలు ప్రస్తావించారు లేదా ఏ విజ్ఞప్తులు చేశారు, అందులకు సంబంధిత అధికారులు అప్లోడ్ చేసిన సమాధానం ఏమిటో జిల్లా కలెక్టర్ గమనించారు. అనంతరం సంబంధిత అర్జీదారునికి ఫోన్ చేసి వారు తెలిపిన సమస్య పరిష్కారం అయ్యిందా లేదా అధికారి ఎవరైనా సంప్రదించారా లేదా వారికి సమాధానం తెలిపారా లేదా తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొందరు అర్జీదారులు తమకు వ్రాత మూలకంగా సమాధానం ఇవ్వలేదని తెలపడం జరిగింది.

అంతేకాక సంబంధిత శాఖల అధికారులతో కూడా మాట్లాడగా వారు కూడా అర్జీదారులకు సమాధానం పంపలేదని, కలెక్టరేట్లో దరఖాస్తు ఇచ్చారు కాబట్టి వారు సమాధానం పంపుతారని తెలపడం జరిగింది. దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ ఇకపై సంబంధిత శాఖ అధికారి అర్జీపై తీసుకున్న పరిష్కార వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయడమే కాకుండా సంబంధిత అర్జీదారునికి కూడా వ్రాత మూలకంగా సమాధానం తెలిపే విధంగా జిల్లా అధికారులందరూ వారి క్షేత్రస్థాయి అధికారులందరిని చైతన్య పరచాలన్నారు. అంతేకాకుండా అర్జీ వచ్చినప్పుడు సంబంధిత అర్జీదారుని కలిసి వారి సమస్యపై చర్చించి వాస్తవ విషయాలను వివరించి సరైన సమాధానం వ్రాత మూలకంగా తెలియజేయాలన్నారు. ఇకపై తాను యాదృచ్ఛికంగా కొన్ని ప్రభుత్వ శాఖల ద్వారా పరిష్కారం అవుతున్న అర్జీల తీరుతెన్నులను క్షుణ్ణంగా పరిశీలిస్తానన్నారు.

అలాగే జిల్లా అధికారులు కూడా వారి శాఖకు చెందిన క్షేత్రస్థాయి అధికారులు పరిష్కరిస్తున్న అర్జీలను గమనించి ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇవ్వాలన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులందరికీ ఒక సందేశం ద్వారా సూచనలు జారీ చేశారు. కలెక్టరేట్ లోని మీకోసం విభాగం సిబ్బంది కూడా వారికి కేటాయించిన ప్రభుత్వ శాఖలకు సంబంధించి వచ్చిన అర్జీలను ఎలా పరిష్కరించారో ఆన్లైన్లో గమనించి, సంబంధిత అధికారులు, అర్జీదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకొని నిర్ణీత నమూనాలో వివరాలను పొందుపరిచి తన పరిశీలనకు అందజేయాలన్నారు. అర్జీదారునికి సమాధానం తప్పుగా ఇచ్చి ఉంటే ఆ విషయాన్ని తన దృష్టికి తీసుకొని రావాలన్నారు.

ఈ సమావేశంలో ఇన్చార్జి డిఆర్ఓ శ్రీదేవి, కలెక్టరేట్ గ్రీవెన్స్ పర్యవేక్షకులు బేగ్, కలెక్టరేట్ మీకోసం విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *