Breaking News

విజయవాడలో ఘనంగా తెలుగు భాష దినోత్సవ వేడుకలు 

విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
ఇంగ్లీష్ వస్తే ఉద్యోగాలు వస్తాయనుకోవడం పొరపాటేనని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. జ్ఞానం పెరగాలంటే మాతృ భాషలోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, మంత్రి కందుల దుర్గేశ్‌తో కలిసి తెలుగు భాషాల దినోత్సవ వేడుకలను ప్రారంభించిన అనంతరం సీఎం ప్రసంగించారు. తెలుగు భాషను గౌరవించుకునేందుకు ప్రతి ఏడాది గిడుగు రామ్మూర్తి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామని, భాష లేకపోతే మన మనుగడే ఉండదని చంద్రబాబు అన్నారు. ‘‘మన సంస్కృతికి, సాంప్రదాయాలకు మూలం మన భాష. అమెరికా లాంటి దేశంలో తెలుగు 11వ భాషగా ఉంది’’ అని అన్నారు.   ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అత్యధికలు తెలుగువారేనని చంద్రబాబు అన్నారు. ‘‘ఇక్కడ ఉన్నవారు కూచిపూడి మర్చిపోయారు. కానీ అమెరికాలో ఉన్నవారు మర్చిపోలేదు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాటం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. తెలుగువారి ఆత్మగౌరాన్ని దేశ నలుమూలల చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు. తెలుగు భాషను ప్రమోట్ చేయడంలో ఎన్టీఆర్ ప్రథమ భూమిక పోషించారు. తెలుగు ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రాన్ని పోరాడి నెల్లూరు తీసుకొచ్చాం. గత ప్రభుత్వం ఇంగ్లీషే జీవితం అన్నట్టు వ్యవహరించింది. భాష అనేది కమ్యూనికేషన్ కోసమే. మాతృభాషలో అధ్యయనం చేసినప్పుడే జ్ఞానం పెరుగుతుంది. తెలుగు భాషను ఎట్టి పరిస్థితుల్లో కాపాడుతాం. జీతం కోసం ఇంగ్లీష్ నేర్పిస్తాం… జీవితం కోసం తెలుగును ముందుకు తీసుకెళ్తాం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

‘‘2047కి ఆంధ్రప్రదేశ్‌ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాం. 2047కి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండే విధంగా తీర్చిదిద్దుదాం. ప్రపంచం గర్వపడే విధంగా అమరావతిని తీర్చిదిద్దుతాం. జీవో నెంబర్ 77పై అధ్యయనం చేస్తాం. గడిచిన ఐదేళ్లలో కళాకారులను పని చేయించుకుని డబ్బులు ఇవ్వని పరిస్థితి ఉంది. మన కళాకారులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే విధంగా ఒక కార్యాచరణ రూపొందిస్తాం. కూచిపూడి నృత్యానికి దేశవ్యాప్తంగా ఆదరణ ఉండే విధంగా తీర్చిదిద్దాం. భాషను మర్చిపోతే జాతి కనుమరుగైపోతుంది. భాష విధ్వంసానికి గురికాకుండా అందరూ కాపాడుకోవాలి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల తెలుగు భాషకు అన్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని వివరించారు. ప్రస్తుతం తెలుగు భాష పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల తెలుగు భాషకు అన్యాయం జరిగిందన్నారు పవన్. తెలుగు భాష ఔనత్యాన్ని, దాని గొప్పతనాన్ని తగ్గిస్తూ వచ్చామన్నారు. మన భాషని గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. గిడుగు వెంకట రామమూర్తి వర్తమాన యువతకు తెలియదని.. ఆయన మామూలు పోరాట యోధుడు కాదన్నారు. తెలుగుజాతి కోసం పరితపించిపోయిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి అని పేర్కొన్నారు. సవర భాష కోసం కొన్ని సంవత్సరాలు పాటు కృషిచేసిన మహానుభావుడు గిడుగు రామ్మూర్తి అని కీర్తించారు. తెలుగు భాష మాట్లాడే వారిని గౌరవించాలని పవన్ పిలుపునిచ్చారు. మాతృభాష బోధించేవారికి జీతభత్యాలు ఎక్కువ ఉండాలన్నారు. జీవో నెంబర్ 77ను తెలుగు పండిట్లు రద్దు చేయాలని కోరుకుంటున్నారని.. ఈ జివో వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఇంగ్లీషు పదం లేకుండా తెలుగు మాట్లాడటం చాలా కష్టంగా ఉందన్నారు. మాతృభాషకు పెద్దపీట వేయకపోతే మనం తీవ్రంగా నష్టపోతామన్నారు. ఇంగ్లీషులో చదివితే తెలివితేటలు వస్తాయనుకునేది పొరపాటేనని.. సూర్యనారాయణ నిఘంటువు తిరిగి పునర్ ముద్రణ చేయిస్తామని ఉపముఖ్యమంత్రి పవన్ తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *