Breaking News

ఏపీలో ప్రభుత్వేతర రంగంలో ‘అందుబాటు ధర’కే ఆరోగ్య సంరక్షణ సేవలకు భారీ డిమాండ్

-పీపీపీ కింద ఏపీలో 175 ఆసుపత్రులు, మెగా హెల్త్ సిటీ ఏర్పాటు
-నియోజకవర్గానికో ఆసుపత్రి ఉండాలనేది ప్రభుత్వ ఆలోచన
-ప్రభుత్వాసుపత్రుల్లో రోగనిర్ధారణ, చికిత్స సౌకర్యాల మెరుగుకు కృషి
-ఏపీలో పెట్టుబడి అవకాశాలను ఫ్లోరిడా లో వివరించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
-వైద్యఆరోగ్య రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు విశేషమైన అవకాశాలు
-రంగరాయ, సిద్ధార్థ, గుంటూరు వైద్య కళాశాలల పూర్వ విద్యార్థుల ద్వైవార్షిక సదస్సులో మంత్రి కీలకోపన్యాసం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాల ప్రజలకు ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటులోకి తెచ్చే విధంగా రాష్ట్ర వైద్యఆరోగ్య రంగాన్ని మెరుగుపర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖామంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఆరోగ్య రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు విశేషమైన అవకాశం, సామర్థ్యాలు ఉన్నాయని చెప్పారు. అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం జరిగిన.. రంగరాయ, సిద్ధార్థ, గుంటూరు వైద్య కళాశాలల పూర్వ విద్యార్థుల ద్వైవార్షిక సదస్సుకు మంత్రి సత్యకుమార్ హాజరయ్యారు. వారిని ఉద్దేశించి కీలకోపన్యాసం చేసిన ఆయన… ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్య రంగంలో ఉన్న సవాళ్లు, అవకాశాల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు.
మారుతున్న ప్రజల ఆరోగ్య పద్ధతులు, పెరుగుతున్న ఆదాయాల కారణంగా… సమాజంలోని ఎక్కువ శాతంగా ఉన్న పేద, మధ్యతరగతి వర్గాలకు అందుబాటు ధరలకే వైద్యం అందించేందుకు… ఉచిత వైద్యం అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు, కార్పొరేట్ ఆసుపత్రులతో సహా ప్రైవేట్ ఆసుపత్రులకు భారీ అవకాశముందని మంత్రి పేర్కొన్నారు. స్పెషాలిటీ హెల్త్‌కేర్ సేవలతో సహా పేద, అల్పాదాయ వర్గాలకు ప్రజారోగ్య సంరక్షణ సేవలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం మెరుగ్గా కృషి చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. వైద్య సేవల విషయంలో ప్రజలకున్న డిమాండ్లను తీర్చడంలో ప్రైవేట్ ఆసుపత్రులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని, ‘కార్పొరేట్ హెల్త్‌కేర్’ పెద్దఎత్తున అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. అయితే అధిక ఖర్చుల కారణంగా ప్రైవేట్ వైద్యం ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులో లేదని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
సరసమైన ధరలకే ఆరోగ్య సంరక్షణ సేవలకు ఉన్న డిమాండ్, సరఫరా మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి, రాష్ట్ర ప్రభుత్వం తగిన రీతిలో పెట్టుబడులను ప్రోత్సహించాలని యోచిస్తోందని మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్య రంగంలో ఉన్న గణనీయమైన పెట్టుబడి అవకాశాలను ఆయన ఆవిష్కరించారు.
వీటిలో కొన్ని ఏంటంటే…
1.రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజక వర్గాల్లోని ఆసుపత్రులను పీపీపీ విధానంలో ఏర్పాటు చేయడం ద్వారా… అందుబాటు ధరలకే వైద్య సేవలను ఆశించే అన్ని వర్గాల ప్రజలకు, వారి ‘స్థోమత’కు తగిన ఆరోగ్య సంరక్షణను అందించవచ్చని, సరసమైన ధరలకే స్పెషాలిటీ సేవలతో సహా ఆరోగ్య సంరక్షణ సేవలను కల్పించవచ్చని చెప్పారు. దీనికి ఉదాహరణగా ఒక ట్రస్ట్ నిర్వహిస్తున్న ఆసుపత్రి గురించి వివరించారు. నామమాత్రపు ఔట్ పేషెంట్ (ఓపీ) రుసుము మాత్రమే వసూలు చేస్తున్న ఆ ఆసుపత్రి… నాణ్యమైన సేవలు అందిస్తోందని తెలిపారు. ఈ పద్ధతుల వల్ల ప్రస్తుతం ఉన్న సామర్థ్యానికి మరో 17,500 పడకలు జోడించవచ్చని వెల్లడించారు. ఈ ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని సమకూరుస్తుందన్నారు.
2. రాజధాని ప్రాంతంలోని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమిలో మెగా మెడిసిటీని అభివృద్ధి చేస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహాయం చేస్తుంది. ఈ మెడిసిటీలోని పీపీపీ సిటీలో అనేక రకాల ఆరోగ్య సంరక్షణ సంబంధిత సంస్థలను ప్రోత్సహిస్తాం.
3. రాష్ట్రంలో మంజూరైన 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 10 కళాశాలలు, అలాగే అటెండెంట్ టీచింగ్ ఆసుపత్రులను కూడా పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసే విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడి అవకాశాలను పెంచుతాం.
4. మెరుగైన సేవలు అందించడం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ రోగనిర్ధారణ పరికరాలు, అలాగే యంత్రాల డిమాండ్ – లభ్యత మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తొలగించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీంతో క్యాథ్ ల్యాబ్‌లు, సీటీ స్కాన్‌లు, ఎమ్ఆర్ఐ, క్యాన్సర్ డయాగ్నస్టిక్ మెషీన్ల ఏర్పాటులో పెట్టుబడులకు అనుమతి ఉంటుంది.
రాష్ట్రంలో ప్రజలందరూ వినియోగించుకునేలా, వారికి అందుబాటు ధరలో ప్రజారోగ్య సంరక్షణను అందించడంలో వనరుల పరిమితి ప్రధాన అడ్డంకిగా మారిందని మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ అన్నారు. ‘‘2019-24 మధ్యలో ఆర్థిక దుర్వినియోగం, నిర్వహణ వైఫల్యం వల్ల పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. అన్ని రంగాల్లోనూ గత ప్రభుత్వ వైఫల్య వారసత్వాన్ని కొనసాగనీయకుండా చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని మంత్రి స్పష్టం చేశారు.
అన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల పనితీరులో మార్పు తీసుకురావడానికి, అలాగే విస్తృతమైన సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు, వీటిని పెద్ద సంఖ్యలో సందర్శించే సామాన్య ప్రజలకు ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడానికి ఇటీవల రూపొందించిన 30 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను కూడా ఆరోగ్య మంత్రి వివరించారు.
గుంటూరు మెడికల్ కాలేజ్ – గుంటూరు, రంగరాయ మెడికల్ కాలేజ్ – కాకినాడ, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ – విజయవాడ, ఇంకా ఇతర ప్రభుత్వ వైద్య కళాశాలల పూర్వ విద్యార్థులను మంత్రి శ్రీ సత్యకుమార్ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులో ఉన్న పెట్టుబడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *