Breaking News

ప్రజలను రక్షించేందుకు నిరంతర చర్యలు… : జిల్లా కలెక్టర్

పెదపారుపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో అధిక వర్షాలు, వరదల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలలోని ప్రజలను రక్షించేందుకు జిల్లా యంత్రాంగం అహర్నిశలు నిరంతర చర్యలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. బుధవారం ఉదయం కలెక్టర్ జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావుతో కలిసి పెదపారుపూడి మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. గ్రామాలలోని వీధుల్లో తిరుగుతూ వరద ముంపు పరిస్థితులను పరిశీలించి ప్రజలతో మాట్లాడారు. ఈ క్రమంలో వారు ట్రాక్టర్, ద్విచక్ర వాహనంపై చేరుకొని పుట్టగుంట, మోపర్రు గ్రామాల వద్ద బుడమేరు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. మోపర్రు గ్రామాన్ని తక్షణమే ఖాళీ చేయించి ప్రజలను దగ్గరలోని పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ రెవిన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బుడమేరు పొంగి ప్రవహించడం కారణంగా పరిసర ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని, దీంతో కొన్ని గ్రామాలు ముంపుకు గురై ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు రావాలని విజ్ఞప్తి చేశారు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందన్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పునరావాస కేంద్రాలకు చేర్చేందుకు ప్రభుత్వం తరఫున బస్సులు, పడవలు, సహాయకులను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని, ప్రజలు అశ్రద్ధ చేయకుండా సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని కోరారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలలో ఉంటున్న వారికి ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి సమయాలలో భోజన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తాగునీరు ఇతర వసతులు కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. స్థానిక నాయకులు, రెవెన్యూ సిబ్బంది కలెక్టర్ వెంట ఉన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *