Breaking News

ఒక మంచి సమాజ నిర్మాణంలో గురువుల బాధ్యత ఎనలేనిది

-తిరుపతి జిల్లాలో ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఒక మంచి సమాజ నిర్మాణంలో గురువుల బాధ్యత ఎనలేనిది అని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ మరియు పలువురు ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కచ్చపి ఆడిటోరియం నందు జిల్లా విద్యా శాఖ మరియు సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గురు పూజోత్సవ కార్యక్రమం ఏర్పాటుతో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్, పలువురు ప్రజా ప్రతినిధులు, విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయుల తదితరులు పాల్గొన్నారు. ఆహుతులు జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కార్యక్రమం ప్రారంభమైనది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 150 కోట్లు పైబడి భారత జనాభా ఉంటే అందులో సుమారు 60 కోట్ల మంది 25 సం.లోపు వారు ఉంటారని, వారిని సమాజానికి ఎంతగానో ఉపయోగపడే విధంగా, మంచి బాటలో నడిచేలా గురువులు తీర్చి దిద్దితే మన దేశ భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉంటుందని తెలిపారు. విద్యార్థులను గొప్పగా వృద్ధి చెందేలా గురువులు నిరంతరం కృషి చేస్తారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఐఏఎస్, ఐపిఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు ఇలా కొన్నిటికే పరిమితం కాకుండా విద్యార్థులకు గొప్పగా ఎదిగేందుకు మరిన్ని అందుబాటులో ఉన్న అవకాసాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా వారు ఒక కొటేషన్ గుర్తు చేశారు. if u aim to the stars.. atleast u will reach clouds అని వారి గురువులు తెలిపేవారని కలెక్టర్ గుర్తుకు చేసుకున్నారు. ఎపిజే అబ్దుల్ కలాం గారు కూడా గొప్ప భవిష్యత్తు కొరకు కలలు కనాలని చెప్పే వారని, గొప్ప లక్ష్యం ఉండాలని దానిని సాధించే ప్రణాళిక, నిబద్ధత ఉండాలని దానిని మనం పిల్లలకు అలవర్చాలని సూచించారు. అలాగే పిల్లలకు విద్యా బోధనలో ప్రస్తుత కాలానుగుణంగా ఉన్న అంశాలను సోదాహరణంగా వివరించాలని, అలాగే వారికి బోధన వినూత్న పద్ధతులలో పిక్టోరియల్ విధానంలో చెబితే ఎంతగానో చక్కగా విద్యార్థులకు అర్థం అవుతుందని, కన్సెప్చువల్ లెర్నింగ్ ఎంతో ఉపయోగకరం అని తెలిపారు. మన మాతృ భాష పై పట్టు ఉండాలని, మనం ఎప్పుడు మన మాతృ భాషను గౌరవించాలని మన గౌ. ముఖ్యమంత్రి ఎప్పుడు చెబుతుంటారు అని గుర్తు చేశారు. తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ ఇతర భాషలు కూడా ముఖ్యమే అయినప్పటికీ మన మాతృ భాష తెలుగును ఎప్పటికీ గౌరవించి వాడాలని సూచించారు. జిల్లాలో సుమారు 2300 పైచిలుకు పాఠశాలలు ఉన్నాయని, మన రాష్ట్ర ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు అందిస్తూ, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా మంచి పౌష్టికాహారం అందిస్తోందని, ఇలా పలు పథకాలు విద్యార్థులకు అమలు చేస్తోందని అన్నారు. పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి కలిగేలా ఆటలు ఆడించి ప్రోత్సహించాలని సూచించారు. పాఠశాలల్లోని పిల్లలకు ఒక టీచర్ ను మెంటర్ గా ఉంచి వారికి ఎప్పటికప్పుడు వెన్ను దన్నుగా ఉండాలని సూచించారు. సామాజిక విలువలు, నైతికత వంటి అంశాలపై పిల్లల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఉపాధ్యాయులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

తిరుపతి స్థానిక ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు సభాధ్యక్షులు మాట్లాడుతూ తల్లి తండ్రి గురువులలో గురువులకు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ఎంతో గురుతర బాధ్యత ఉందని తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మ దినాన ఉపాధ్యాయులను సన్మానించుకోడం ఆనవాయితీ అని వారి స్పూర్తితో ప్రతి ఉపాధ్యాయులు పనిచేయాలని కోరారు. మన దేశంలో గొప్ప ఐటి ఇంజనీర్లు, డాక్టర్లు రాజకీయ వేత్తలు ఎందరో ఉన్నారని వారికి విద్యా బుద్దులు చెప్పి తీర్చిదిద్దిన గురువులను ఎన్నటికీ మర్చిపోలేమని అన్నారు. రాధాకృష్ణన్ రాజకీయంగా కూడా గొప్ప ఉన్నతమైన పదవులు అలంకరించారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు ముగ్గురు విద్యకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని, బాలల బంగారు భవిష్యత్తుకు కట్టుబడి ఉన్నారని తెలిపారు.

ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ భారత దేశ సమ సమాజ నిర్మాణంలో గురువు బాధ్యత ఎంతో గొప్పది అని, ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గురుతర బాధ్యత ఎనలేనిదని, గురువుల దార్శనికత మార్గదర్శనం ప్రతి రంగంలోనూ ఉంటుందని గుర్తు చేశారు. ప్రపంచంలో గురువు స్థానం గొప్పదని కొనియాడారు.

ఎంఎల్సి సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ గురు బ్రాహ్మలందరికి పాదాభివందనాలు అని తెలుపుతూ గురువులు నిచ్చెనల వంటి వారని, వారు అన్నీ భరిస్తూ తమ విద్యార్థులను ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు కృషి చేస్తారని అన్నారు. అమెరికా లో ఉన్న డాక్టర్లలో 40 శాతం మంది మన తెలుగు వారే ఉన్నారని గుర్తు చేశారు. ఈ ఖ్యాతి గురువుకే దక్కుతుంది అని అన్నారు. గురువు ఒక డాక్టర్ గా తన విద్యార్థులలోని అజ్ఞానాన్ని తొలగిస్తారని, ఒక గొప్ప ఆర్టిస్టుగా రాయి లాంటి విద్యార్థులను గొప్పగా మలచి మంచి శిల్పంగా రూపు దిద్దుతారని అన్నారు. గురువు లేని లోకాన్ని ఊహించుకొలేమని తెలిపారు. తల్లిదండ్రుల తర్వాత గొప్ప స్థానం ఒక్క గురువుకే దక్కుతుంది అని తెలిపారు.

ఎమ్మెల్యే చంద్రగిరి పులివర్తి నాని ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా నేడు జరుపుకుంటున్న గురు పూజోత్సవం నందు పాల్గొంటున్న అందరు గురువులకు వందనాలు తెలియ చేశారు. భారత రత్న అవార్డు గ్రహీత మన రాధా కృష్ణన్ గారు ఒకప్పటి మన భారత ఉప రాష్ట్రపతి మరియు రెండవ భారత రాష్ట్రపతి అని, వారు మహనీయులు అని, స్ఫూర్తి దాయకులు అని కొనియాడారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలను ఆన్లైన్ కౌన్సెలింగ్ తీసుకు వచ్చింది కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని గుర్తుచేశారు.

ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒకనాడు విద్యార్థే అని గుర్తు చేశారు. వారి తండ్రిగారు కూడా ఉపాధ్యాయులే అని గుర్తు చేశారు. భారతదేశం ఎంతో ముందుకు వెళ్తోంది అంటే గురువుల పాత్ర ఎంతో గొప్పదని అన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో ఎంతో గొప్ప మార్పులు తెచ్చి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని తెలిపారు.

అనంతరం జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కాబడిన 72 మందికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా శాలువా కప్పి ప్రశంసా పత్రం మరియు మొమెంటోలు అందించి సన్మానం చేశారు. అనంతరం ఆహుతులను విద్యా శాఖ తరఫున సన్మానం చేశారు. కార్యక్రమానికి ముందుగా పలు విద్యాలయాల నుండి విద్యార్థిని విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి డా. వి. శేఖర్, ఉప విద్యాధికారులు బాలాజీ, ప్రభాకర్ రాజు, శాంతి, మండల విద్యాధికారులు, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *