Breaking News

పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ‘మొబైల్ టీం’ ఏర్పాటు

-ఏలూరు జిల్లావ్యాప్తంగా మొబైల్ టీం విస్తృత సేవలకు సిద్ధం
-వినూత్న ఆలోచనతో జిల్లాలో సమర్ధవంతంగా పారిశుద్ధ్య నిర్వహణ

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ఏలూరు జిల్లా కొత్త తరహా కార్యక్రమానికి నాంది పలికింది. పారిశుద్ధ్య కార్మికులతో మొబైల్ టీం ఏర్పాటు చేసి జిల్లాలో అవసరమైన చోట కార్మికుల సేవలను వినియోగించుకునే విధంగా ప్రణాళికలు తయారు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు. ప్రయోగత్మకంగా జిల్లాలో అమలు చేయనున్న మొబైల్ పారిశుద్ధ్య కార్మికుల టీంలో 13 మంది సభ్యులు ఉంటారు. వారిలో ఒక శానిటరి సూపర్ వైజరుతోపాటుగా ఇద్దరు ఎలక్ట్రీషియన్లు, ఇద్దరు ప్లంబర్లు, ఇద్దరు ట్యాంక్ ఆపరేటర్లు, ఆరుగురు శానిటేషన్ కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్ ఉంటారు. జిల్లా పంచాయతీ అధికారి స్వీయ పర్యవేక్షణలో నిర్వహించనున్న ఈ మొబైల్ టీం సభ్యులు అత్యవసర సమయంలో జిల్లాలో ఉన్న 547 గ్రామాలలో సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటారు. మొబైల్ టీంలో ట్రాక్టర్, దోమల నివారణకు ఫాగ్గింగ్ యంత్రం, మురుగు నీటిలో దోమల గుడ్లు వృద్ధి చెందకుండా ఉపయోగించే మలాతీయన్ పిచికారీ యంత్రము, 100 కేజీ బ్లీచింగ్, లైమ్, లోతట్టు ప్రాంతాలలో నిల్వ ఉన్న నీరు తొలగించడానికి పారలు, విష పురుగులు, పాములు రాకుండా పొదలు, పిచ్చి మొక్కలు తొలగించడానికి గొడ్డలి, కత్తులు తదితర సామాగ్రి కూడా టీం సభ్యుల దగ్గర ఉంటుంది.

ఉప ముఖ్యమంత్రివర్యుల అభినందన
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద ముంపుతో గ్రామాలు సతమతం అవుతున్న తరుణంలో ఇటువంటి మొబైల్ టీమ్ సేవలు ఉపయోగకరంగా ఉంటాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులతో మొబైల్ టీం ఏర్పాటు చేసిన ఏలూరు జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ విశ్వనాథ్ కు అభినందనలు తెలియచేశారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *