Breaking News

ప్రభుత్వంపై విషం చిమ్మడమే వైసీపీ పనిగా పెట్టుకుంది…గతంలో వారు చేసిన పాపాలే ప్రజలకు నేడు శాపాలుగా మారాయి

-సర్వశక్తులు ఒడ్డి ప్రజల్ని ఆదుకున్నాం…9 రోజులుగా ప్రజల కోసం కష్టపడుతున్నాం : సీఎం చంద్రబాబు నాయుడు
-వరద ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజూ సీఎం చంద్రబాబు పర్యటన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజూ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. బాధితులను కలసి వారితో మాట్లాడారు. వరద పరిస్థితులపై కలెక్టరేట్ లో ఉన్నతాధికారులతో మాట్లాడిన అనంతరం వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు సీఎం చంద్రబాబు బయలుదేరారు. భవానీపురం నుండి సితార సెంటర్ మీదుగా ఊర్మిళా నగర్ వెళ్లారు. అక్కడ జరుగుతున్న డ్రైనేజీ క్లీనింగ్ పనులను పరిశీలించారు. అనంతరం కబేళా సెంటర్ లో స్థానిక మహిళలతో మాట్లాడారు. వరద ప్రభావంతో తాము అన్నీ కోల్పోయామని, తమకు ఉపాధి చూపించాలని మహిళలు సీఎంను కోరారు. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటానని, ఉపాధి కల్పనకు అన్ని చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ ఫ్లై ఓవర్ వద్దకు చేరుకొని, అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అక్కడి నుండి మిల్క్ ప్రాజెక్ట్, చిట్టి నగర్, ఎర్రకట్ట మీదుగా మ్యాంగో మార్కెట్, సింగ్ నగర్ కు వెళ్లారు. సింగ్ నగర్ ఫ్లై ఓవర్ వద్ద బాధిత ప్రజలతో మాట్లాడి ప్రభుత్వం నుండి అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ సీఎం మాట్లాడుతూ….అర్బన్ యాప్ వినియోగంపై ప్రజల్లో చైతన్యం పెంచుతామన్నారు. సర్వస్వం కోల్పోయిన వారికి జతబట్టలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆప్కో, ఇతర సంస్థల వద్ద వస్త్రాలు తెచ్చి పంపిణీ చేస్తామన్నారు. వరద బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని, అధిక వర్షాలు, గత పాలకుల పాపాలు ఇప్పుడు ప్రజలకు శాపంగా మారిందన్నారు. బుడమేరు నుంచి కొల్లేరుకు నీళ్లు వెళ్లకుండా కబ్జాలు చేశారన్నారు. సర్వశక్తులు ఒడ్డి ప్రజలను ఆదుకున్నామని, వైసీపీ నాయకుల అనుచరులకు చెందిన భారీ బోట్లు వరద సమయంలో నదిలోకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. బోట్లకు లంగరు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ప్రతి రోజు మాపై విషం చిమ్ముతున్నారని, అయినా తనకు 7 లక్షల మంది వరద బాధితుల కష్టాలే కనిపిస్తున్నాయన్నారు. వరద బాధితులకు మనోధైర్యం ఇవ్వాలనేదే తన లక్ష్యమని, వరద ప్రాంతాల్లోని ఇళ్లలోని వస్తువులన్నీ పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలను కూడా మరమ్మతు చేసేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. అనంతరం అక్కడి నుండి కలెక్టరేట్ వెళ్లి అధికారులతో సమీక్షించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *