Breaking News

బాధితులను ఆదుకోవడం అభినందనీయం

-జిల్లా కలెక్టర్ డా. జి.సృజన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ పది రోజులపాటు ముంపు బాధితులకు నిరంతరం సేవలు అందించడంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది నమగ్నమయ్యారని.. అదేవిధంగా ఆ శాఖకు చెందిన విశ్రాంత ఉద్యోగులు కూడా ముంపు బాధితులకు చేయూతనివ్వడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన అన్నారు.
ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు మహిళా, శిశు సంక్షేమ శాఖ విశ్రాంత అధికారుల సహకారంతో సమకూర్చిన నూతన వస్త్రాల కిట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆమె కార్యాలయంలో అందజేశారు. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా చేతుల మీదుగా కూడా వస్త్రాల కిట్లను అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వపరంగా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సహకారానికి తోడు స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ సంఘాలు, వ్యాపారవేత్తలు తదితరులు ప్రజలను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారన్నారు. వరద ముంపునకు గురైన నాటినుండి ఇప్పటివరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులు బాధితులకు సేవలందించడంలో నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఇదేవిధంగా ఆ శాఖ విశ్రాంత అధికారులు, ఉద్యోగులు ముందుకొచ్చి బాధితులకు తమ వంతు సహకారాన్ని అందించడం ప్రశంసనీయమని కలెక్టర్ అన్నారు. ఇదే స్ఫూర్తితో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంతవరకు బాధితులకు సహాయం చేసేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు.
మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ జి.ఉమాదేవి మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులు అందించిన సహకారంతో బాధితులకు ఒక్కో చీర, దుప్పటి, లుంగీ, టవల్, నైట్ డ్రెస్, శానిటరీ న్యాప్కిన్స్ లతో కూడిన రూ. లక్ష విలువైన కిట్లను 500 కుటుంబాలకు పంపిణీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
వాంబే కాలనీ, అంబాపురంలో కిట్లు అందిస్తున్నట్లు తెలిపారు. విశ్రాంత ఉద్యోగులు ఆర్. సూయజ్, కె.సుహాసినీ దేవి, ఆర్. ఎల్. అన్నపూర్ణాదేవి, కె.కృష్ణకుమారి, సీడీపీవోలు జి. మంగమ్మ, పి.నాగమణి, ఏసీడీపీవో జ్యోత్స్న, అంగన్వాడి సూపర్వైజర్లు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *