Breaking News

జీరో శాతం హెచ్ఐవి/ ఎయిడ్స్ కేసులు నమోదే లక్ష్యం

-ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఏ. సిరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యువతలో హెచ్ఐవి/ ఎయిడ్స్ పై పూర్తి అవగాహన పెంచే విధంగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో ఆంధ్ర ప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఏ. సిరి అన్నారు. హెచ్ఐవీ/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో విజయవాడ పట్టణంలోని బీఆర్టీఎస్ రోడ్డు మీసాల రాజారావు వంతెన వద్ద నుండి బీఆర్టీఎస్ సిగ్నల్ పాయింట్ వరకు 5 కె రన్ ను మంగళవారం ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఎ. సిరి, డీసీపీ గౌతమి శాలినిలు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎ. సిరి మాట్లాడుతూ హెచ్ఐవి /ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా వారిని కూడా ప్రేమాభిమానాలతో ఆదరించాలన్నారు. అదేవిధంగా రాష్ట్రస్థాయిలో గెలిచిన విజేత లు జాతీయస్థాయికు ఎంపిక చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. రాష్ట్రస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులను గోవాలో నవంబర్ 10వ తేదీన నిర్వహించబోయే 10 కె రన్ జాతీయస్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది ఆమె తెలిపారు. రాష్ట్రంలో పదివేల మందికి పైగా హెచ్ఐవి బాధితులు ఉన్నారని, ఎయిడ్స్/ హెచ్ ఐ వి పై పురుషులలో 25 శాతం, స్త్రీలలో 38 శాతం మాత్రమే అవగాహన కలిగి ఉన్నారన్నారు. యువతీ యువకులలో నూరు శాతం అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగుతుందని తెలిపారు హెచ్ఐవి అనేది తల్లి నుండి బిడ్డకు సంక్రమిస్తుందని, అలాగే ఒకే సిరంజిని పలువురికి వాడటం వంటి వాటి వల్ల కూడా హెచ్ఐవీ సోకే ప్రమాదం పొంచి ఉందని, అంతేకాకుండా మత్తు పదార్థాలకు బానిసైన యువత ఒకే సిరంజిని ఎక్కువ మంది వాడటం వల్ల ఈ వ్యాధి సంక్రమించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. వ్యాధి వ్యాప్తిని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని జాగ్రర్తలు తీసుకోవాలని సూచించారు. మన రాష్ట్రంలో 2030 నాటికి జీరో శాతం వ్యాధి వ్యాప్తి నిరోధకమే లక్ష్యంగా నిర్ధేశించుకున్నామన్నారు.
రాష్ట్ర స్థాయి మారథాన్ రెడ్ రన్ – 2024 లో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు, ఇతర కేటగిరి ( ట్రాన్స్ జెండర్) వారు మారథాన్ 5కె రన్ లో పాల్గొనడం జరిగిందని ఆమె తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థాయిల్లో నిలిచిన పురుషుల విభాగంలో ఇద్దరు, స్త్రీ విభాగంలో ఇద్దరు, ట్రాన్స్ జెండర్ విభాగంలో ఇద్దరు చొప్పున మొత్తం ఒక్కో జిల్లా నుంచి ఆరుగురు విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఈరోజు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొన్నారని వివరించారు. రాష్ట్రస్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన వారిలో ప్రథమ స్థానం సాధించిన వారికి రూ. 35 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి రూ. 25 వేలు, తృతీయ స్థానంలో సాధించిన వారికి కాంస్య పతకాలు ప్రశంసా పత్రాలు అందిస్తున్నామన్నారు.

5 కె మారథాన్ రాష్ట్రస్థాయి పోటీల విజేతలు
పురుషుల విభాగంలో మొదటి స్థానంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎ. పైడప్పడు, ద్వితీయ స్థానంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీహెచ్. సురేష్, తృతీయ స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వి. రమేష్ లు నిలిచారు. అలాగే మహిళలు విభాగంగా మొదటి బహుమతిని ఎల్. మేరీ గ్రేస్(విశాఖపట్నం జిల్లా), ద్వితీయ బహుమతిని వి. చెన్ననీల (బాపట్ల జిల్లా), తృతీయ బహుమతిని ఎన్. రమ్య జాయ్(బాపట్ల జిల్లా)లు గెలుపొందారు. ట్రాన్స్ జెండర్ విభాగంలో మన్యం జిల్లాకు చెందిన మెల్లాకా నరేష్ మొదటి స్థానంలో నిలవగా, ద్వితీయ స్థానంలో మన్యం జిల్లాకు చెందిన గౌడు రమేష్, తృతీయ స్థానంలో కర్నూలు జిల్లాకు చెందిన జి. లీలావతి నిలిచారు. 5కే రన్ అనంతరం విజేతలకు నగదు బహుమతిగా చెక్కులు, మెడల్స్, సర్టిఫికెట్ లు అందచేశారు. తృతీయ స్థానంలో నిలిచిన విజేతలకు కాంస్య పతకం, సర్టిఫికెట్ లను ప్రాజెక్ట్ డైరక్టర్ డాక్టర్ ఎ. సిరి అందచేశారు.
ఈ కార్యక్రమంలో జేడీలు భాగ్యలక్ష్మీ, డాక్టర్ కామేశ్వర్ ప్రసాద్, డాక్టర్ టి మంజుల, డీడీ డాక్టర్ చక్రవర్తి, ఏడీఎం డాక్టర్ ఉషారాణి, కో ఆర్డినేటర్లు డా. రాజేంద్ర ప్రసాద్, ఆదిలింగం, ఏపీశాక్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *