Breaking News

పి ఎం సూర్యఘర్ పథకం సద్వినియోగం చేసుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పి ఎం సూర్యఘర్ పథకం వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరమని అందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పీఎం సూర్య ఘర్ సౌర విద్యుత్ పథకం పై కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్- ముఫ్త్ బిజిలి యోజన పేరుతో సౌర విద్యుత్ పథకాన్ని దిగువ, మధ్యతరగతి నివాస వినియోగదారుల ప్రయోజనం కోసం అమలు చేస్తుందన్నారు.

ఈ పథకం చాలా మంచి పథకమని, దీని వలన వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రతి ఇంటిలో విద్యుత్ ఛార్జీల బిల్లు ఖర్చు ఎక్కువగా ఉంటుందన్నారు. గతంలో పరిస్థితులు గమనిస్తే మొదట్లో 60 వ్యాట్ బల్బులు వాడే వారమని, దాని వలన ఎక్కువ విద్యుత్తు ఖర్చు అవ్వడంతో ట్యూబ్లైట్ ల వాడకానికి మారామని, తదుపరి ఎల్ఈడీ దీపాలు వినియోగించి విద్యుత్ ఆదా చేస్తున్నామన్నారు. తాజాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సౌర విద్యుత్ పథకాన్ని వినియోగదారుల శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టాయన్నారు. ఒక్కసారి పెట్టుబడి పెడితే తదుపరి విద్యుత్ చార్జీలు తగ్గిపోతాయన్నారు. ఇంటి పైకప్పు పై సౌరఫలకాలను అమర్చుకుంటే తద్వారా విద్యుత్తు ఉత్పత్తి అవుతుందన్నారు. దీంతో విద్యుత్చార్జీల బిల్లు మనకు ఆదా అవుతుందన్నారు. నెలవారి విద్యుత్తు వినియోగం సరాసరి 150 యూనిట్ల లోపు ఉంటే 1.2 కిలో వాట్ సౌరఫలకాలు బిగించుకోవచ్చని, దానికోసం 30 వేల నుంచి 60 వేల రూపాయల వరకు సబ్సిడీ లభిస్తుందన్నారు.

అలాగే 150 నుండి 300 యూనిట్ల వరకు 2.3 కిలో వాట్ సౌరఫలకాలు బిగించుకుంటే 60 వేల రూపాయల నుంచి 78 వేల రూపాయల వరకు సబ్సిడీ లభిస్తుందన్నారు. అదేవిధంగా 300 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం ఉంటే 3 కిలోవాట్ల కు పైగా సౌర ఫలకాలు అమర్చుకుంటే 78,000 వరకు సబ్సిడీ లభిస్తుందన్నారు. ఈ పథకం కింద సౌరఫలకాలు అమర్చుకునే వినియోగదారులకు బ్యాంకర్లు కూడా రుణ సహాయం అందిస్తారని నెలవారి కంతులలో దానిని తీర్చుకోవచ్చన్నారు. అన్ని రకాల సంఘాల ప్రతినిధులు ఈ సౌర విద్యుత్ పథకాన్ని విస్తృతంగా వారికి తెలిసిన వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయాలని వీలైనంత ఎక్కువమంది సద్వినియోగం చేసుకునేలా సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ చింత రవి బాలకృష్ణ నాట్య బృందం వారిచే ఏర్పాటుచేసిన కూచిపూడి నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ కార్యాశాలలో విద్యుత్ శాఖ ఈఈ భాస్కరరావు మచిలీపట్నం గుడివాడ మున్సిపల్ కమిషనర్లు జి బాలసుబ్రమణ్యం ఎల్డీఎం జయవర్ధన్, జడ్పిసిఈఓ ఆనంద్ కుమార్ పౌరసరఫరాల సంస్థ డిఎం సతీష్, జిల్లా పశుసంవర్ధక అధికారి శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ అధికారి రమేష్, గిరిజన సంక్షేమ అధికారి ప్రకాష్ రావు,పర్యాటక అధికారి రామ్ లక్ష్మణ్ తదితర జిల్లా అధికారులు విద్యుత్ శాఖ డీఈలు రామకృష్ణ, మాణిక్యాలరావు, శ్రీనివాసులు, సుందర్రావు సచివాలయ కార్యదర్శులు, వివిధ బ్యాంకుల మేనేజర్లు పలువురు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, రైస్ మిల్లర్ సంగం సభ్యులు, వినియోగదారులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *