Breaking News

అక్టోబర్ 1 నుండి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

-10 జిల్లాల జాయింట్ కలెక్టర్లు, అధికారులతో సమీక్ష
-కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ
-రైతు పండించిన ప్రతి గింజనూ కొంటాము
-రైతును ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధ్యాన్యం
-నాదెండ్ల మనోహర్, ఆహారం & పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతి రైతునూ ఆదుకుని, రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శుక్రవారం విజయవాడ లెమన్ ట్రీ హోటల్ లో ధాన్యం సేకరణపై వర్క్ షాపు ను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అక్టోబర్ 1 నుండి ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తున్నామన్నారు. అందులో భాగంగానే 10 జిల్లాల జాయింట్ కలెక్టర్లతోపాటు, పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్, తూనికలు, కొలతలు, తదితర అధికారులతో సమీక్ష నిర్వహించామన్నారు. ఈ ఏడాదిలో 37 లక్షల మిలియన్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్దమయ్యామని తెలిపారు. సాంకేతికతను ఉపయోగించి క్షేత్ర స్థాయిలో రైతు పండించిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆరుగాలం కష్టపడి రైతు పండించిన పంటను కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఇలాంటి వర్క్ షాపులు నిర్వహిస్తామన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతు ఖాతాల్లోకి డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఖరీఫ్ లో ధాన్యం కొనుగోలుకు రైతులందరినీ సంప్రదించి, మిల్లర్లను ఎంపిక చేసుకునే అవకాశం రైతులకే కల్పిస్తున్నామన్నారు. పారదర్శకంగా రైతాంగాన్ని కాపాడటానికి, వారికి భరోసా ఇచ్చేలా పని చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలుకు ముందస్తుగా పెద్ద సంఖ్యలో లారీలను సిద్ధం చేశామన్నారు. ప్రతి వాహనానికి జిపిఎస్ అనుసంధానం చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికే పంట నష్టం , తడిచిన దాన్యానికి సంబంధించి కొనుగోలు చేస్తామని ప్రకటించారన్నారు. అంతేకాకుండా రెండు రోజుల్లో దీనికి సంబంధించి విధి విధానాలు వెల్లడిస్తామన్నారు. రైతు నష్ట పోకుండా ధాన్యం కొనుగోలు చేసి రైతుకు అండగా ఉంటామన్నారు. ఇండస్ట్రీలకు ఏవిధంగా అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండగా ఉంటుందో అదేవిధంగా రైతుకు సాంకేతికతో సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

తొలుత మంత్రి అధికారులతో సమీక్ష చేసి వారితో మాట్లాడుతూ వరదల్లో పనిచేసిన విధంగానే క్షేత్ర స్థాయిలో కూడా అందరం ధాన్యం కొనుగోలులో కూడా ఒక టీమ్ గా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. వరదల్లో మన డిపార్ట్ మెంట్ పనితీరుపై 91 శాతం సక్సెస్ తో మంచి పేరు వచ్చిందని అందుకు ముఖ్యమంత్రి కూడా మెచ్చుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా రైతును కాపాడటం కోసం ఈ సమావేశం నిర్వహించటం జరుగుతోందన్నారు. ధాన్యం అమ్మకాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు తగిన జాగరూకతతో వ్యవహరించాలని, తగిన లాజిస్టిక్స్ కూడా రెడీ చేసుకోవాలన్నారు. గన్నీ బ్యాగ్స్, లేబర్, (GLT) రవాణా వాహనాలను ముందుగానే సిద్దం చేసుకోవాలని, వీటి వల్ల రైతు ఇబ్బందులు పడకూడదన్నారు. సోషల్ మీడియా, మీడియా ను ఉపయోగించుకొని రైతులకు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోళ్ల సమాచారం అందించాలన్నారు. రైతు కల్లం దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తే రైతు చాలా సంతోషిస్తారన్నారు. రైస్ మిల్లర్స్ దగ్గర క్యూలు ఉండే పరిస్థితి ఉండకూడదన్నారు. అందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో 70 శాతం వ్యవసాయంపై ఆదారపడి జీవిస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.
పౌరసరఫరాల శాఖ కమిషనర్ జీ. వీరపాండ్యన్ మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. జీఎల్టీ సమస్యలు లేకుండా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ ప్రాధమ్యాలను గుర్తించి అధికారులు పనిచేయాలన్నారు. ముఖ్యంగా రైతు పండించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు సకాలంలో చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి మండలంలో అవగాహనా సదస్సులు నిర్వహించాలన్నారు. మార్క్ ఫెడ్ వీసీ, ఎండీ డాక్టర్. మనజిర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ ముందస్తు ప్లాన్ తో ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *