Breaking News

అర్హులందరికీ పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు

-దీపావళి నుంచి మూడు సిలిండర్ల పథకం అమలు
-మహిళలకు త్వరలోఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం
-రాబోయే ఐదు సంవత్సరాలలో రాయచోటి నియోజకవర్గం రూపురేఖలు మారుస్తాం
-రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

రాయచోటి, నేటి పత్రిక ప్రజావార్త :
పేదల సంక్షేమమే తమ కర్తవ్యంగా అర్హులందరికీ పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అందజేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాయచోటి మండల పరిధిలోని సిబ్యాల గ్రామంలో “ఇది మంచి ప్రభుత్వం” ప్రజా దర్బార్ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ….. గతంలో ఎవరు చేయని విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులలో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల నుంచి ఇది మంచి ప్రభుత్వం అని ఒక గుర్తింపు తీసుకురావడం జరిగిందన్నారు. రాబోయే రోజులలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలలో భాగంగా వచ్చే దీపావళికి అర్హులైన ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి త్వరలో విధి విధానాలు రూపొందించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని త్వరలో కల్పించడం జరుగుతుందన్నారు.

గతంలో పెన్షన్లు కొందరికి మాత్రమే ఇచ్చే వాళ్ళని నేడు కుల మత ప్రాంత భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ మొత్తాన్ని పెంచి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు మేలు కలుగజేస్తుందన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని వివిధ కేటగిరీలకు చెందిన పెన్షన్లు వారి ఇంటి వద్దనే ప్రతినెల ఒకటో తేదీన వంద శాతం పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజలు ఎవరు ఆకలితో పస్తులు ఉండకూడదనే ముఖ్య ఉద్దేశంతో అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందన్నారు. దీంతో ప్రతి పేదవాడు మూడు పూటలా భోజనం చేసి సుఖ సంతోషాలతో జీవిస్తారన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా ఇకనుంచి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆకలి కేకలు ఉండవన్నారు.

గత ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కోట్లాదిమంది రైతులు ఉరి వేసుకునే విధంగా తెచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దుచేసి రైతులను ఆదుకోవడం జరుగుతుందన్నారు. డ్వాక్రా మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసేందుకు వారికి ఐదు నుంచి పది లక్షల వరకు రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన నూతన జిల్లాలలో ప్రతి శాఖకు ప్రభుత్వ భవనాలు నిర్మించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం నూతన జిల్లాలలో ప్రభుత్వ భవనాలు లేక ఉద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొత్త జిల్లాలలో అన్ని శాఖలకు ప్రభుత్వ భవనాలు నిర్మించడం జరుగుతుందన్నారు. మన ప్రాంతంలో వర్షపాతం తక్కువ పడడంతో నీటిమట్టం తగ్గిపోయి ఎన్ని బోర్లు వేసినా నీరు పడడం లేదన్నారు. దీంతో గ్రామాలలో నీటి సమస్య తీర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఇకనుంచి నీటి సమస్య రాకుండా రాబోయే ఐదు సంవత్సరాలలో శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అర్హులందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా రాయచోటి నియోజకవర్గం లోని ఆరు మండలాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. గతంలో ఇల్లు మంజూరు కు సంబంధించి ఎన్నో అవకతవకలు జరిగాయని వాటన్నింటినీ సరిదిద్దడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామంలో ఎన్టీఆర్ కాలనీలు నిర్మించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో భూ ఆక్రమణలు జరిగాయని అవన్నీ తిరిగి స్వాధీనం చేసుకొని పేదలకు పంచడం జరుగుతుందన్నారు.

మన ప్రాంతవాసులు చాలామంది జీవనాధారం కోసం కువైట్, సౌదీ లాంటి ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడ నాన ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అలాంటి వారి సమస్యలన్నీ పరిష్కరించేందుకు మన ప్రాంతంలో వివిధ ఫ్యాక్టరీలు పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు రైతుల కోరిక మేరకు అవసరమైన ప్రాంతాలలో సబ్ స్టేషన్ లు ఏర్పాటు చేసి రైతుల కరెంటు సమస్య పరిష్కరించడం జరుగుతుందన్నారు. రాబోయే ఐదు సంవత్సరాలలో రాయచోటి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం జరుగుతుందని ఇందుకు ప్రతి ఒక్కరు తమకు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *