– కుటుంబంలో ఒకరిని మాత్రమే గుర్తించి, వారి ఖాతాల్లో నగదు వేస్తున్నాం.
– ఈ విషయాన్ని గమనించి, అధికార యంత్రాంగానికి సహకరించాలి.
– అనవసరంగా కుటుంబంలో మిగిలిన వారు అర్జీలు దాఖలు చేయొద్దు
– జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ముంపు ప్రభావిత బాధితులకు కుటుంబం యూనిట్‌గా ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని, కుటుంబంలో ఒకరిని గుర్తించి, వారి ఆధార్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాలో డీబీటీ ద్వారా నగదు జమచేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కుటుంబంలో మరో వ్యక్తిని లబ్ధిదారునిగా గుర్తించడానికి వీలు లేని విషయాన్ని గుర్తించాలని, అనవసరంగా అర్జీలు దాఖలు చేయొద్దని సూచించారు. బాధితులకు అత్యంత పారదర్శకంగా సహాయం అందించడం జరుగుతోందని, ఇప్పటివరకు ఇళ్ళు, వాహనాలు తదితర నష్టాలకు సంబంధించి 1,12,481 మంది బ్యాంకు ఖాతాల్లో సాయం జమచేయడం జరిగిందన్నారు.
ఆధార్ తో బ్యాంక్ ఖాతా అనుసంధానించుకోండి…
ఎన్యూమరేషన్ జరిగి, గుర్తించిన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం పరిహారం మంజూరు చేసిందని అయితే
ఆధార్‌తో బ్యాంకు ఖాతా లింక్ కాకపోవడం, బ్యాంకు ఖాతా వినియోగంలో లేకపోవడం తదితర కారణాల వల్ల దాదాపు 20 వేల మంది ఖాతాల్లో నగదు జమకాలేదని వివరించారు. ఈ విషయాన్ని ఎస్ఎమ్ఎస్ ద్వారా లబ్ధిదారుల ఫోన్ లకు సమాచారం యిచ్చామన్నారు .అందువల్ల సత్వరమే ఆధార్‌కు బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకొని వినియోగంలోకి తెచ్చుకోవాలని సూచించారు. ఈ విషయమై బ్యాంకులకు కూడా సూచనలిచ్చామని,సచివాలయ సిబ్బంది కూడా బాధితులకు సహకారం అందిస్తారని తెలిపారు. అర్హత పొందిన లబ్ధిదారుల జాబితాలు సచివాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని.. అక్కడ పేర్లు ఉండి ఇంకా పరిహారం జమ కాకపోతే ఆధార్‌తో బ్యాంకు ఖాతా అనుసంధానం కాలేదని గుర్తించి, బ్యాంకు ఖాతాను ఆధార్ తో లింక్ చేసుకోవాలని సూచించారు. ఆధార్ తో అనుసంధానం అయిన రెండు రోజుల లోపు ఖాతాలో పరిహారం జమచేయడం జరుగుతుందని, ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని, ఎవరూ ఎక్కడకూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని సూచించారు. అదేవిధంగా పరిహారం కోరుతూ గ్రీవెన్స్ లో సమర్పించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి రెండు మూడు రోజుల్లోనే పరిష్కరించి ఆపై అర్హులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ సృజన పేర్కొన్నారు.