Breaking News

అక్టోబరు 15 నుండి ఇసుక డిమాండ్ కు అనుగుణంగా లభ్యత

-రాష్ట్ర అబ్కారీ, భూగర్భ, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న వేసవి కాలంలో నెలకొనే ఇసుక డిమాండ్ కు అనుగుణంగా లభ్యత పెంపుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వాణిజ్యపన్నుల శాఖ ఛీఫ్ కమీషనర్, అబ్కారీ, భూగర్భ, గనుల శాఖ ముఖ్య కార్యాదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఉచిత ఇసుక పాలసీ 2024 జులై 8 నుండి అమలులోకి తీసుకురాగా, స్టాక్‌యార్డ్‌ల వద్ద 4.8 లక్షలు, డి-సిల్టేషన్ పాయింట్లు వద్ద 54 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ప్రస్తుతం సిద్దంగా ఉందన్నారు.రోజువారీ సరఫరా సామర్థ్యం 37,000 మెట్రిక్ టన్నులు కాగా, అక్టోబర్ 2024 నుండి మార్చి 2025 వరకు 1.5- 1.75 కోట్ల మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందని అంచనా వేసామని మీనా తెలిపారు. డిమాండ్‌ను తీర్చడానికి సిద్దం చేసిన కార్యాచరణ ప్రణాళికను అనుసరించి డి-సిల్టేషన్ పాయింట్లు (28) నుండి 54 లక్షలు, మాన్యువల్ రీచ్‌లు (108) నుండి 70 లక్షలు, సెమీ-మెకనైజ్డ్ రీచ్‌లు (48) నుండి 140 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక సేకరిస్తామన్నారు.

ప్రస్తుతం, డి-సిల్టేషన్ పాయింట్లు, మాన్యుల్ రీచ్‌లకు అన్ని అనుమతులు ఉన్నాయని, ఆగస్టు 15 నుండి డి-సిల్టేషన్ పాయింట్ల నుండి కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయన్నారు. వర్షాకాలంలో నది ఒడ్డున ఇసుక మైనింగ్ కార్యకలాపాలపై పరిమితి కారణంగా అక్టోబర్ 16 నుండి మాన్యువల్ రీచ్‌ల నుండి కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. ఈ రెండు మార్గాల ద్వారా దాదాపు 1.25 కోట్ల మెట్రిక్ టన్నులు సమకూరుతుందన్నారు. సెమీ-మెకనైజ్డ్ రీచ్‌లను ఆపరేట్ చేయడానికి అనుమతుల ప్రక్రియ ప్రాసెస్‌లో ఉండగా డిసెంబర్ నాటికి మరో 140 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా ప్రారంభమవుతుందన్నారు. పట్టా భూముల నుండి కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, వీరంతా ఇసుక మేనేజ్‌మెంట్ పోర్టల్‌లో ఇసుక డీ-కాస్టింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ముఖేష్ కుమార్ మీనా అభ్యర్థించారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీలు భవిష్యత్తులో ఇసుక సరఫరాను సులభతరం చేయడానికి ఇసుక చేరిన ప్రాంతాలను మరింతగా గుర్తిస్తాయన్నారు.

ధరల హెచ్చుతగ్గులు, రవాణాదారుల దోపిడీ లేకుండా ఉండేలా రాష్ట్రం అంతటా ఒకే విధంగా రేట్లు నియంత్రించబడగా, వినియోగదారులకు ఇసుకను రవాణా చేయడానికి వారి స్వంత వాహనాలను ఎంచుకోవచ్చు లేదా నిర్ణీత రేటుతో ప్రభుత్వం అందించిన రవాణాను ఎంచుకోవచ్చని మీనా వివరించారు. “AP సాండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్”, ఆన్‌లైన్ పోర్టల్‌లో https://sand.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఇసుకను బుక్ చేసుకునే సౌలభ్యం ఉందన్నారు. ప్రతి వారం, ఇసుక సరఫరా సామర్థ్యం మేరకు రాబోయే వారానికి ఒకేసారి విడుదల చేస్తుండగా, భవిష్యత్తులో మిగిలి పోయిన వారంవారీ సరఫరాలో కొంత భాగాన్ని “తత్కాల్” తరహాలో అందుబాటులో ఉంచుతామన్నారు. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాల్లో అత్యవసర ఇసుక అవసరాలను తీర్చడానికి వారపు సామర్థ్యంలో 10 శాతం నిల్వను కలిగి ఉంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక పరంగా ఎటువంటి రుసుము వసూలు చేయటం లేదని, కేవలం సీనరేజి, నిర్వహణ, జిఎస్టి, రవాణా ఖర్చులు మాత్రమే ఉంటాయని ముఖేష్ కుమర్ మీనా తెలిపారు. అక్రమ కార్యకలాపాల నిరోధం, వనరుల రక్షణతో సహా ఇసుక తవ్వకం, రవాణా, మైనింగ్ వంటి వాటిపై ప్రభుత్వ విధానాలను ఖచ్చితంగా పాటించేలా ప్రతి జిల్లాలో బహుళ-విభాగ అధికారులతో (గనులు, రెవెన్యూ, పోలీస్, పర్యావరణం) జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ పనిచేస్తుందన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *