తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా పండుగ సందర్భంగా ప్రైవేటు బస్సులలో అధిక చార్జీలు వసూలు చేయడాన్ని నివారించడానికి, తిరుపతి జిల్లా రవాణా శాఖాధికారి మురళీ మోహన్ గారి ఆదేశాల ప్రకారం రవాణా శాఖాధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. దసరా పండుగ సెలవుల సందర్భంగా వాహనాల అధిక రద్దీ మరియు రహదారి భద్రత దృష్ట్యా ఈ వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సంయుక్త తనిఖీలు తొమ్మిదో తారీఖు నుండి 14 తారీకు వరకు రవాణా శాఖ అధికారులు చేపట్టనున్నారు. ముఖ్యంగా హైదరబాదు, బెంగళూరు నుండి వఛ్చే బస్సులను తనిఖీలు చేశారు. ఈ రోజు జరిగిన సంయుక్త తనిఖీలలో మోటారు వాహన తనిఖీ అధికారులు దామోదర్ నాయుడు, పి చంద్ర శేఖర్, స్వర్ణలత, ఆంజనేయ ప్రసాదు, మరియు ఆర్.టి.ఓ. కానిస్టేబుల్ ఈ.నరేంద్ర బాబు, రాజేష్ పాల్గొన్నారు. ఈ సంయుక్త తనిఖీలు ఆంజనేయ పురం మరియు కరకంబాడి రహదారిలో నిర్వహించారు.
ఆల్ ఇండియా పర్మిట్ మరియు త్రైమాసిక పన్ను చెల్లించని కారణంగా తిరుపతి నుండి హైదరాబాదు వెళ్తున్న ఆరంజ్ ట్రావెల్ బస్సు ను స్వాధీన పరచుకోవడం జరిగింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరో ఏసీ వాహనాన్ని సత్వరమే ఏర్పాటు చేసిన మోటార్ వాహనాల తనిఖీ అధికారి దామోదర్ నాయుడు పట్ల ప్రయాణికులు హర్షం వెలిబుచ్చారు. మోటార్ వాహనాల నియమ నిబంధనలను ఉల్లంఘించిన మరో 10 బస్సులపై అధికారులు అపరాధ రుసుము విధించారు. బస్సుల పై రెండు రోజుల నుండి జరుగుతున్న తనిఖీల్లో భాగంగా అపరాధ సొమ్ము మరియు పన్ను రూపంలో వాహనదారులు 6 లక్షల రూపాయలు చెల్లించవలసి ఉంది. తనిఖీల్లో నిర్వహించిన అన్ని బస్సులలో డ్రైవర్ల పై బ్రీత్ అనలైజర్ ద్వారా శ్వాస పరీక్షలు కూడా నిర్వహించారు.