అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పశుగ్రాసం కొరతపై సీఎం చంద్రబాబు తక్షణ కార్యాచరణ

-మంత్రి సత్యకుమార్‌ విజ్ఞప్తితో రూ.కోటి విలువైన 250 టన్నుల మేత సరఫరాకు ఆదేశాలు
-ఎల్‌నినో ప్రభావంతో రెండు జిల్లాల్లో పశుగ్రాసం కొరత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఎల్‌నినో ప్రభావంతో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పశుగ్రాసం కొరత తీవ్రంగా నెలకొన్న నేపథ్యంలో పశుపోషకులకు అండగా నిలిచేందుకు మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తక్షణమే స్పందించి అధికారులను అప్రమత్తం చేశారు. రెండు జిల్లాల్లో పశుగ్రాసం లభ్యత, అవసరాలు, కొరత ఉన్న ప్రాంతాలపై సమీక్ష నిర్వహించి.. లోటు ఉన్న చోట్లకు వెంటనే మేత సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ మేరకు రూ.కోటి విలువైన 250 మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసాన్ని తక్షణమే సరఫరా చేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ అమరేంద్ర తెలిపారు. అధికారుల సమీక్షలో రెండు జిల్లాల్లో కలిపి సుమారు 11.04 లక్షల మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసం కొరత ఉన్నట్లు వెల్లడైంది.

కేబినెట్‌ సమావేశంలో మంత్రి ప్రస్తావన

నవంబర్‌ 9న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పశుగ్రాసం కొరత అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉండే అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పశువులకు మేత అందుబాటులో లేకపోతే రైతులు, పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని వివరించారు. పశుసంపదను కాపాడటంతో పాటు పశుపోషకుల జీవనోపాధికి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించి, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో అన్ని సచివాలయాల పరిధిలో కొరత

శ్రీ సత్యసాయి జిల్లాలోని మొత్తం 363 రెవెన్యూ గ్రామ సచివాలయాల పరిధిలో పశుగ్రాసం కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో 3,56,900 ఆవులు, గేదెలు, 32,49,250 గొర్రెలు, మేకలు ఉన్నాయి. ప్రస్తుతం 2,39,891 మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసం అందుబాటులో ఉంది. 90 రోజుల అవసరాలకు 4,58,946 మెట్రిక్‌ టన్నులు కావాల్సి ఉండగా.. 2,19,055 మెట్రిక్‌ టన్నుల లోటు ఏర్పడింది.

అనంతపురంలో 8.84 లక్షల మెట్రిక్‌ టన్నుల కొరత

అనంతపురం జిల్లాలోని 362 రెవెన్యూ గ్రామ సచివాలయాలకుగాను 293 పరిధుల్లో పశుగ్రాసం కొరత ఉన్నట్లు సమీక్షలో వెల్లడైంది. జిల్లాలో 3,50,425 ఆవులు, గేదెలు, 8,84,756 గొర్రెలు, మేకలు ఉన్నాయి. ప్రస్తుతం 3,87,533 మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసం అందుబాటులో ఉండగా.. 90 రోజుల అవసరం 12,72,426 మెట్రిక్‌ టన్నులుగా అంచనా వేశారు. దీంతో 8,84,893 మెట్రిక్‌ టన్నుల లోటు ఉన్నట్లు గుర్తించారు.

రూ.కోటి విలువైన 250 టన్నుల పశుగ్రాసం తక్షణ సరఫరా

రెండు జిల్లాల్లో పశుగ్రాసం కొరత తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సరఫరాకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ అమరేంద్ర తెలిపారు. ఇందులో భాగంగా రూ.కోటి విలువైన 250 మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసాన్ని తక్షణమే సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి, అవసరాలకు అనుగుణంగా ఎండుగడ్డి, పచ్చిగడ్డి, పశుదాణా అందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. తీవ్ర కొరత ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తూ సరఫరా చేపడతామన్నారు.

పశుపోషకులకు ప్రభుత్వం భరోసా

పశుగ్రాసం కొరతతో రైతులు, పశుపోషకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. పశుసంపద రైతుల జీవనోపాధిలో కీలక పాత్ర పోషిస్తుందని, ఎల్‌నినో ప్రభావంతో పశుపోషకులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కొరత ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తూ పశుగ్రాసం సరఫరా చేస్తామన్నారు.
పశుపోషకుల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి అధికారులను అప్రమత్తం చేసినందుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. పశుసంపదను కాపాడటం, రైతులకు అండగా నిలవడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతని పేర్కొన్నారు.