పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధే అజెండా

-25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు
-ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు
-సీఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు సమగ్ర ప్రజెంటేషన్‌

విశాఖ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అభివృద్ధి ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా ఆవిష్కరించారు. పరిశ్రమలు, ఇంధనం, ఎలక్ట్రానిక్స్‌, రక్షణ, అంతరిక్షం, డేటా సెంటర్లు, పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వేలు, సాగునీటి రంగం ఇలా అన్ని అంశాల్లో రాష్ట్రానికి ఉన్న అవకాశాలు, ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు, ఇప్పటికే సాధించిన పురోగతిని గణాంకాలతో సహా సీఎం వివరించారు. 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులోనే 303 అవగాహన ఒప్పందాల ద్వారా రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు ప్రకటించారు. జూన్‌ 2024 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన రూ.22.60 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు ఇవి అదనం అని అన్నారు. దీంతో రాష్ట్రానికి వచ్చిన మొత్తం పెట్టుబడి ప్రతిపాదనలు రూ.32.49 లక్షల కోట్లకు చేరాయని సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ పెట్టుబడులను కేవలం ప్రతిపాదనలకే పరిమితం చేయకుండా, క్షేత్ర స్థాయిలో పరిశ్రమల స్థాపన, ఉత్పత్తి, ఉపాధి కల్పన దిశగా తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రజెంటేషన్‌లో స్పష్టం చేశారు. పెట్టుబడుల ఆకర్షణతో పాటు వాటిని కార్యరూపంలోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సీఎం వివరించారు. సదస్సుకు ముందు జూన్‌ 2024 నుంచి రాష్ట్రానికి రూ.22.60 లక్షల కోట్ల విలువైన 714 ప్రాజెక్టుల ప్రతిపాదనలు వచ్చాయన్నారు. వీటిలో రూ.17.10 లక్షల కోట్ల విలువైన 526 ప్రాజెక్టులకు భూమి, ప్రోత్సాహకాలు తదితర అంశాలకు ఆమోదం లభించిందనీ వివరించారు. మరో రూ.7.30 లక్షల కోట్ల విలువైన 303 ప్రాజెక్టులు నిర్మాణానికి సిద్ధమయ్యాయనీ స్పష్టం చేశారు. ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో సంఖ్యా పరంగా 58 శాతం నిర్మాణ సన్నద్ధత దశకు చేరుకోవడం పారిశ్రామిక ప్రణాళిక అమలులో పురోగతిని సూచిస్తోందని ప్రజెంటేషన్‌లో వివరించారు.

ఇంధనం.. ఎలక్ట్రానిక్స్‌ అత్యాధునిక సాంకేతికత

పునరుత్పాదక ఇంధన రంగంలో 160 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన వెల్లడించారు. పునరుద్పాదక రంగంలో ఇప్పటికే 114 గిగావాట్ల సామర్థ్యానికి ఆమోదం లభించిందన్నారు. సోలార్‌ వెఫర్ తయారీ రంగంలోనూ భారీ పెట్టుబడులకు మార్గం సుగమమైందనీ తెలిపారు. 42 గిగావాట్ల సోలార్‌ సెల్‌ తయారీ సామర్థ్యంతో పాటు 53 గిగావాట్ల ఇంగట్‌ వేఫర్‌ తయారీ సామర్థ్యానికి అనుమతులు ఇచ్చామని సీఎం చంద్రబాబు తన ప్రజంటేషన్ లో వివరించారు.ఎలక్ట్రానిక్స్‌, గృహోపకరణాల తయారీ లో ఏటా రూ.4.20 లక్షల కోట్ల ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ రంగాల్లో ఇప్పటికే రూ.31,926 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్టు స్పష్టం చేశారు. ఏరోస్పేస్‌, రక్షణ రంగాల్లో రూ.50 వేల కోట్లు, అంతరిక్ష రంగంలో మరో రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలన్నది ప్రణాళిక అని… ఐదో తరం యుద్ధవిమాన ప్రాజెక్టును కేవలం 36 రోజుల్లో గ్రౌండింగ్‌ దశకు తీసుకువచ్చినట్లు సీఎం వెల్లడించారు. డేటా సెంటర్ల ఏర్పాటులో నూ ఏపీ కీలక గమ్యస్థానంగా ఎదుగుతోందని వివరించారు. రాష్ట్రంలో 4.6 గిగావాట్ల డేటా సెంటర్‌ ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చామనీ ప్రజెంటేషన్‌లో పేర్కొన్నారు. అమరావతిని అత్యాధునిక సాంకేతికతకు కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో 250 ఎకరాల్లో క్వాంటం కంప్యూటింగ్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. దక్షిణాసియాలో తొలి ప్రాజెక్టుగా అమరావతి క్వాంటం వ్యాలీని అభివృద్ధి చేసి, 2027 ఫిబ్రవరి 3న ప్రారంభించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

లాజిస్టిక్స్ లోనూ కీలకంగా ఏపీ

సముద్ర తీరాన్ని రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ప్రధాన వనరుగా మలచుకునే దిశగా పోర్టుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. దేశ పోర్టుల ద్వారా జరిగే సరకు రవాణాలో 20 శాతం వాటాను సాధించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు పోర్టులు పనిచేస్తుండగా, వాటి వార్షిక సరకు నిర్వహణ సామర్థ్యం 346 మిలియన్‌ టన్నులు గా ఉందన్నారు.2025–26లో 209 మిలియన్‌ టన్నుల సరకు రవాణా జరిగింది. సరకు నిర్వహణలో దేశంలో ఏపీ నాలుగో స్థానంలో ఉందని వివరించారు. కొత్తగా నిర్మిస్తున్న నాలుగు పోర్టుల ద్వారా మరో 108 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యం అందుబాటు లోకి రానుందన్నారు. రామాయపట్నం పోర్టును 2027 ఏప్రిల్‌ నాటికి, మూలపేటను జూన్‌ నాటికి, మచిలీపట్నాన్ని డిసెంబర్‌ నాటికి, కాకినాడ గేట్‌వేను 2028 సెప్టెంబర్‌ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించామనీ స్పష్టం చేశారు. వీటికి అనుబంధంగా మూడు నౌకా నిర్మాణ క్లస్టర్లు, ఏడు కొత్త ఫిషింగ్‌ హార్బర్లను అభివృద్ధి చేయనున్నట్టు వివరించారు. దుగరాజపట్నం నౌకా నిర్మాణ క్లస్టర్‌ను 2028–29 నాటికి సిద్ధం చేయాలనీ ప్రణాళిక చేసినట్టు సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాల్లో వార్షిక ప్రయాణికుల నిర్వహణ సామర్థ్యం 1.55 కోట్లు గా ఉందని 2025–26లో 62 లక్షల మంది ప్రయాణించారనీ స్పష్టం చేశారు. భోగాపురం, అమరావతి, తిరుపతిని ప్రధాన కేంద్రాలుగా అభివృద్ధి చేస్తూ తొమ్మిది గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నా మని తెలిపారు. రాష్ట్రం మీదుగా 839 కిలోమీటర్ల హైస్పీడ్‌ రైలు కారిడార్లతో పాటు 4,415 కిలోమీటర్ల రైల్వే అనుసంధాన ప్రణాళికలను కూడా ప్రజెంటేషన్‌లో ప్రస్తావించారు. పోర్టులు, పారిశ్రామిక పార్కులు, విమానాశ్రయాలు, రైల్వే మార్గాలను సమన్వయం చేయడం ద్వారా రవాణా వ్యయాన్ని తగ్గించి, పరిశ్రమలకు మెరుగైన లాజిస్టిక్స్‌ సదుపాయాలు కల్పించాలన్నది ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు.

జలభద్రతకు పోలవరం.. నదుల అనుసంధానానికి ప్రణాళిక

రాష్ట్ర భవిష్యత్తుకు సాగునీరు, తాగునీటి భద్రత కీలకమని పేర్కొంటూ పోలవరం ప్రాజెక్టును 2027 జూన్‌ నాటికి జాతికి అంకితం చేస్తామని వివరించారు. గోదావరి – పెన్నా కావేరీ నదుల అనుసంధానం ద్వారా సుమారు 200 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రతిపాదన చేశామని తెలిపారు. గోదావరి– కావేరి నదుల అనుసంధానంతో ఐదు నదులు, నాలుగు రాష్ట్రాలకు జలభద్రత కల్పించాలన్నది తమ ఆలోచనగా వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రాంతీయ వనరులు, పారిశ్రామిక అవకాశాలను దృష్టిలో పెట్టుకుని 25 రంగాలవారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు సీఎం తెలిపారు. శ్రీకాకుళంలో కెమికల్‌ పార్కు, విశాఖపట్నంలో మెడ్‌టెక్‌ పార్కు, అనకాపల్లిలో ఉక్కు అనుబంధ పరిశ్రమలతో పాటు అరుదైన ఖనిజాలు, ఏఐ డేటా సెంటర్ల వంటి రంగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించారు. ప్రతి ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతను పారిశ్రామిక అభివృద్ధికి అనుసంధానం చేయడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచాలన్నది ఈ ప్రణాళిక వెనుక ఉన్న ఉద్దేశం అని ఇన్వెస్టర్లకు వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి స్వర్ణాంధ్ర 2047 విజన్‌ను మార్గదర్శకంగా తీసుకుని ముందుకు సాగుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. పెట్టుబడుల ఆకర్షణ, ఆధునిక సాంకేతికత, పారిశ్రామిక తయారీ, మౌలిక సదుపాయాల విస్తరణ, వ్యవసాయ రంగానికి జలభద్రత.. ఇలా అన్న రంగాలను సమన్వయం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టడ మే లక్ష్యమని తెలిపారు. కేవలం పెట్టుబడుల ఒప్పందాలు చేసుకోవడ మే కాకుండా వాటిని పరిశ్రమలుగా మార్చడం, ఉత్పత్తి పెంచడం, యువతకు ఉపాధి కల్పించడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా పని చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.