భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో రష్యా భాగస్వామిగా నిలిచింది

-భారత్‌-రష్యా సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది
-రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఏపీలో ప్రత్యేక కారిడార్‌ అభివృద్ధి
-రష్యా-ఇండియా ఆర్థిక భాగస్వామ్యంపై ప్రత్యేక సదస్సులో మంత్రి నారా లోకేష్
-ఏపీలో పెట్టుబడులకు రష్యా పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త:
భారత్‌-రష్యా సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ లో భాగంగా రష్యా- ఇండియా ఆర్థిక భాగస్వామ్యంపై (Russia India Economic Partnership: Vizag to Kazan: Regional Partnerships to Global Opportunities) నిర్వహించిన ప్రత్యేక సదస్సులో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్‌లో రష్యా రాయబారి గౌరవనీయులు డెనిస్ గారికి, ఆయనతో పాటు విశాఖపట్నం వరకు విచ్చేసిన ప్రతినిధి బృందానికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. రష్యాతో నా పరిచయం, అనుబంధం, ప్రయాణం ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఒక దేశాన్ని సందర్శించేటప్పుడు ఆ దేశం గురించి కొన్ని అభిప్రాయాలు, అంచనాలు ఉంటాయి. అయితే, సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో పాల్గొనాల్సిందిగా మీరు నన్ను ఆహ్వానించడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఆ పర్యటన నాకు రష్యాను సందర్శించే అవకాశాన్ని మాత్రమే కాకుండా, ఆ దేశంతో లోతైన, అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచుకునే గొప్ప అవకాశాన్ని కల్పించింది.

గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, రష్యా అధ్యక్షులు గౌరవనీయులు వ్లాదిమిర్ పుతిన్ గారు గత కొన్నేళ్లుగా నిర్మించిన బలమైన ద్వైపాక్షిక సంబంధాలకు కొనసాగింపుగా ఈ అనుబంధం మరింత బలోపేతమవుతోంది. రష్యాలోని వివిధ రంగాలకు చెందిన అనేక కంపెనీల ప్రతినిధులను కలుసుకునే అవకాశం కూడా లభించింది. అంతేకాకుండా కుటుంబంతో కలిసి రష్యా పర్యటించే అదృష్టం కూడా కలిగింది. ఆ పర్యటన ద్వారా తరతరాలుగా రష్యా నిర్మించుకున్న విలువలు, సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని మరింతగా అర్థం చేసుకోగలిగాం.

పరస్పర సహకారంతో ప్రగతి

భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో రష్యా ఎప్పుడూ గొప్ప భాగస్వామిగా నిలిచింది. ప్రపంచం మనకు దూరమైన సందర్భాల్లో కూడా రష్యా మనకు అండగా నిలిచింది. ఒక యువ భారతీయుడిగా, భారత్‌-రష్యా సంబంధాలు కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాకూడదని విశ్వసిస్తున్నా. మన సహకారాన్ని మరింత అర్థవంతంగా విస్తరించుకోవాలి. పరిశోధన రంగంలో పరస్పర జ్ఞానాన్ని, అనుభవాలను పంచుకోవడం, శతాబ్దాలుగా రష్యా సంపాదించుకున్న నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానాన్ని మన దేశానికి తీసుకువచ్చి, ఇక్కడి వనరులు, అవకాశాలతో అనుసంధానం చేసి, పరస్పరం విలువను ఎలా సృష్టించుకోవాలి అనే అంశాలపై మనం దృష్టి పెట్టాలి.

దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి

దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. గౌరవ సీఎం చంద్రబాబు గారి దార్శనికతతో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. ఆయన వయస్సు 76 సంవత్సరాలు కావచ్చు. కానీ ఆయనలో ముగ్గురు 25 ఏళ్ల యువకులు ఉన్నారు. వివిధ తరాలకు చెందిన ప్రజలతో, ప్రపంచంలోని వివిధ దేశాలతో లోతైన, అర్థవంతమైన భాగస్వామ్యాలను నిర్మించాలనే అపారమైన శక్తి, ఉత్సాహం ఆయనలో ఉన్నాయి. ద్వైపాక్షిక సమావేశం సందర్భంగా మనం చర్చించుకున్నట్లుగా, ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తరతరాలుగా ప్రపంచంలోని వివిధ దేశాలతో బలమైన సంబంధాలను నిర్మించుకుంటూ వస్తోంది. భారత్‌-రష్యా దేశాలు కలిసి తమ భాగస్వామ్యంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇరు దేశాల నాయకులు మన భవిష్యత్ ప్రయాణానికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

భారత్‌-రష్యా బంధం మరింత బలోపేతం కావాలి

ఈ రోజు మన గౌరవ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు ఒక అద్భుతమైన పోలికను ప్రస్తావించారు. దీపావళి సందర్భంగా వెలిగించే దీపం వెలుగును, శక్తిని అందిస్తుంది. అదే విధంగా భారత్, రష్యా దేశాలు కూడా పరస్పరం శక్తిని అందించుకుంటూ, ఒకరికొకరు తోడ్పడే భాగస్వామ్యాన్ని నిర్మించుకోవాలి. ఇప్పటికే నిర్మించిన బలమైన పునాదులపై ఆధారపడి భారత్‌-రష్యా సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. రష్యాలో నా పర్యటన సందర్భంగా గుర్తించిన సహకార రంగాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.

రేర్ ఎర్త్ మినరల్స్ కోసం లోతైన పరిశోధనలు

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ప్రత్యేక కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో లోతైన పరిశోధన, పరస్పర సహకార అవకాశాలను పరిశీలిస్తున్నాం. ఈ రంగానికి సంబంధించి ఎకో సిస్టమ్ అభివృద్ధి, అందుబాటులో ఉన్న అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశాలపై కలిసి పనిచేయాలని భావిస్తున్నాం. ఏపీ మెరుగైన ఫలితాలు సాధించడానికి, మరింత వేగంగా ముందుకు సాగడానికి సిద్ధంగా ఉంది.

స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ ఏపీ ప్రత్యేకతలు

స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ ఏపీ ప్రత్యేకతలు. పెట్టుబడులు, ప్రాజెక్టుల అమలులో వేగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. రెండోది స్టెబిలిటీ. మనం చేపట్టే ప్రతి కార్యక్రమం కాలపరీక్షకు, రాజకీయ మార్పులకు తట్టుకుని నిలబడాలి. పెట్టుబడిదారులకు దీర్ఘకాలిక విధాన స్థిరత్వంపై నమ్మకం కల్పించాలి. రష్యా నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి చూపుతున్న పారిశ్రామికవేత్తల కోసం మేం రెండు ప్రత్యేక వ్యవస్థలను రూపొందిస్తున్నాం. ఎస్క్రో మెకానిజం ద్వారా ప్రభుత్వం పెట్టుబడిదారులకు ప్రకటించిన ప్రోత్సాహకాలు, రాయితీలు తప్పనిసరిగా అందేలా హామీ కల్పించే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తున్నాం.

మూడోది పెట్టుబడిదారులతో ఒకసారి చేతులు కలిపిన తర్వాత, అది ఇకపై మీ ప్రాజెక్టు మాత్రమే కాదు. అది మనందరి ఉమ్మడి ప్రాజెక్టుగా మారుతుంది. ఆ ప్రాజెక్ట్ విజయానికి ప్రభుత్వం కూడా సమాన బాధ్యత తీసుకుంటుంది. ఈ మూడు అంశాల ఆధారంగా రష్యాతో కలిసి పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. భారత్‌-రష్యా భాగస్వామ్య ప్రయాణంలో ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అందరం కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రినాక్ ఇండియా లిమిటెడ్ సీఈవో, సీఐఐ కోల్డ్ చైన్ టాస్క్ ఫోర్స్ కో ఛైర్మన్ డాక్టర్ సోజీ అబ్రహాం, భారత్ లో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్, భారతదేశంలోని రష్యన్ ఫెడరేషన్ వాణిజ్య కమిషనర్ ఆండ్రీ సోబోలెవ్, ట్రేడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ రష్యా ఇన్ ఇండియా జ్లాటా ఆంటుషేవా, రిపబ్లిక్ ఆఫ్ తతారిస్తాన్ పెట్టుబడుల అభివృద్ధి సంస్థ డిప్యూటీ హెడ్ లెనార్ జమాలియేవ్, స్బేర్ బ్యాంక్ ఇండియా కార్పోరేట్ అండ్ ఫైనాన్షియల్ ఇన్ స్టిట్యూషన్ డిపార్ట్ మెంట్ హెడ్ ఆర్టెమ్ బటాలోవ్, రోసాటమ్ సౌత్ ఏషియా బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ ఎకటెరినా అస్తాషినా, JSC గిరెడ్‌మెట్ సంస్థ అధిపతి ఆండ్రీ గోలినీ, మోహన్ ముత్తా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ప్రఫుల్ ముత్తా పాల్గొన్నారు.