మండల ప్రజా పరిషత్ పరోక్ష ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి

-ఎన్నికల నిబంధనలపై ప్రిసైడింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలి
-జిల్లా పరిషత్ సీఈఓ పి. సుశీల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లాలో మండల ప్రజా పరిషత్‌లకు సంబంధించి కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికతో పాటు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికల ప్రక్రియను ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి పి.సుశీల ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు.

జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం విజయవాడలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రిసైడింగ్ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ పి.సుశీల మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులు తమ బాధ్యతలను పూర్తి అవగాహనతో, అప్రమత్తంగా నిర్వర్తించాలని తెలిపారు. కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికలకు సంబంధించిన విధివిధానాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు.
ఎన్నికల నోటీసుల జారీ, సమావేశాలకు అవసరమైన కోరం నిర్ధారణ, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, ఓటింగ్, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై అధికారులకు వివరించారు. సమాన ఓట్లు వచ్చిన సందర్భంలో లాటరీ ద్వారా విజేతలను నిర్ణయించే విధానం, రాజకీయ పార్టీల అభ్యర్థుల అధికారిక గుర్తింపు పత్రాలు, పార్టీ విప్ జారీ, అమలు, ఎన్నికల సమావేశాల నిర్వహణ, ఫలితాల ప్రకటన, రికార్డుల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలను సజావుగా పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆమె స్పష్టం చేశారు. ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల నియమ నిబంధనలను పూర్తిగా అవగాహన చేసుకొని, తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించి ఎన్నికల ప్రక్రియ విజయవంతం కావడానికి కృషి చేయాలని సీఈఓ పి. సుశీల సూచించారు.