– రాష్ట్ర వ్యాప్తంగా మెగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం
– విద్యార్థుల వికాసానికి, సమస్యల పరిష్కారానికి దిక్సూచి
– కార్యక్రమం విజయవంతానికి పూర్తిస్థాయిలో సన్నద్ధంకండి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 7న పాఠశాల విద్యావ్యవస్థకే అతిపెద్ద పండగగా రాష్ట్ర వ్యాప్తంగా మెగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాన్ని (మెగా పీటీఎం) నిర్వహించనుందని.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు, సమన్వయ శాఖల అధికారులు కృషిచేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు.
మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (ఎంపీటీఎస్) సన్నద్ధతపై ఎంఈవోలతో పాటు వివిధ శాఖల అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం పాఠశాలల పటిష్టతకు, విద్యార్థి వికాసానికి, సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా నిలుస్తుందన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య ఓ ఆత్మీయ వారధిని నిర్మిస్తుందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, దాతలు, పూర్వ విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని, ఈ కార్యక్రమం ద్వారా పిల్లల చదువు, ప్రవర్తన, క్రమశిక్షణ తదితర వివరాలను తల్లిదండ్రులు తెలుసుకోవచ్చన్నారు. ఇంతటి ప్రాధాన్యమున్న కార్యక్రమానికి పటిష్ట ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని, సమన్వయ శాఖల అధికారులకు నిర్దేశించిన బాధ్యతలను తు.చ. తప్పకుండా పాటించాలని సూచించారు. పారిశుద్ధ్యం, ఆవరణ సుందరీకరణ, సైబర్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహణ, నిరంతర విద్యుత్ సరఫరా, హోలిస్టిక్ ప్రాగ్రెస్ రిపోర్టుల పంపిణీ, ఆరోగ్య బుక్‌లెట్ల పంపిణీ, అతిథులకు, తల్లిదండ్రులకు ఆహ్వానం తదితరాలకు చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. పార్టీ జెండాలు, కండువాలు, రంగులు వేసుకొని రావద్దని విజ్ఞప్తి చేయాలని సూచించారు. తల్లిదండ్రులకు ఆహ్వానం పలకడం దగ్గరి నుంచి కామన్ లంచ్ వరకు ప్రతి కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. సమావేశంలో ఏపీ ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం రూపొందించిన పదో తరగతి పీఎస్ ప్రశ్నల నిధిని ఆవిష్కరించారు. సమావేశంలో డీఈవో యూవీ సుబ్బారావు, డీసీపీ ఎం.కృష్ణమూర్తి నాయుడు, వీఎంసీ అదనపు కమిషనర్ డా. డి.చంద్రశేఖర్, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ జి.మహేశ్వరరావు, నందిగామ ఆర్‌డీవో కె.బాలకృష్ణ, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డీపీవో పి.లావణ్య కుమారి తదితరులు పాల్గొన్నారు.