మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (public grievance redressal system) కు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తున్నదని, జిల్లా, డివిజన్, మండల, మున్సిపాలిటీ స్థాయిల్లో మరింత యాక్టివ్ గా పని చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు అధికారులకు సూచించారు.
కలెక్టరేట్లో సోమవారం డిఆర్వో మీకోసం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఈనెల 11, 12 తేదీల్లో ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించి, ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించి మెరుగైన ప్రభుత్వ సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రవేశ పెట్టడం జరిగిందని, ఈ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం సూచించిందన్నారు. ప్రభుత్వ ఆకాంక్షల మేరకు వివిధ శాఖలకు చెందిన అన్ని స్థాయిల్లో అధికారులు సానుకూల దృక్పథంతో వారికి అందిన గ్రీవెన్స్ క్షుణ్ణంగా చదివి, సమస్య తెలుసుకొని, మనస్ఫూర్తిగా వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రతి సోమవారం మండల తాసిల్దార్ కార్యాలయాల్లో నిర్వహించు మీకోసం కు వివిధ శాఖల మండల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.
మండల, డివిజన్, మున్సిపాలిటీ స్థాయిలలో గ్రీవెన్స్ జిల్లా స్థాయికి వస్తున్నాయని, వాటి పరిష్కారానికి మరలా ఆయాస్థాయి అధికారులకు పంపడం జరుగుతున్నదని, క్రింది స్థాయిల్లోనే పరిష్కరిస్తే ఇక్కడ వరకు అర్జీదారులు రావలసిన అవసరం లేదని, కావున ఇకపై క్రింది స్థాయి లో పరిష్కరించవలసిన సమస్యలు ఇక్కడి వరకు రాకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.
వివిధ శాఖల్లో కోర్టు కేసులు మానిటర్ చేయడానికి కలెక్టరేట్లో లీగల్ సెల్ ఏర్పాటు చేయనున్నట్లు డిఆర్ఓ తెలిపారు.
మీకోసం లో అర్జీలు….. ….
గుడివాడకు చెందిన సంబంగి శివరంజని తన కూతురు భవ్య శ్రీ ( 19 సంవత్సరాలు,) వికలాంగుల పింఛను నెలకు 6 వేలు ఇస్తున్నారు, కానీ తన కూతురు మంచానికే పరిమితమైందని, 15 వేల పింఛన్ ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
ఘంటసాల మండలం తెలుగురావు పాలెం రైతు సేవా కేంద్రం పరిధిలో ఈక్రాప్ అయినట్లు తన ఫోన్కు మెసేజ్ వచ్చింది, ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళితే ఈ క్రాప్ కాలేదని, తన పేరు లేదని అంటున్నారని, ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కరించాలని కోరుతూ అచ్చంపాలెం గ్రామానికి చెందిన గాజుల లీన సాయి ప్రియ మీకోసం లో అర్జీ సమర్పించారు.
2015లో కప్పలదొడ్డి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు చేనేత కార్మికులకు ఇంత వరకు ఎక్స్గ్రేషియా అందలేదని, వెంటనే ఎక్స్గ్రేషియా ఇప్పించాలని కోరుతూ పేరీశెట్టి విగ్నేశ్వర రావు తదితరులు మీకోసం లో అర్జీ సమర్పించారు.
కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, బందరు ఆర్డీవో కే స్వాతి డిఆర్ఓ తో పాటు మీకోసం లో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
పంచాయతీరాజ్ ఎస్ఈ రమణారావు, ఐసిడిఎస్ పిడి ఎస్ సువర్ణ, డి సి హెచ్ ఎస్ డాక్టర్ ఎం జయకుమార్, సర్వే ఏడి జోషీల తదితరులు పాల్గొన్నారు.