– రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ బాబు ఏ సూచనల అమలుకు చర్యలు
– పన్నుల శాఖ ఒకటో డివిజన్ జాయింట్ కమిషనర్ సూరపాటి ప్రశాంత్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యాపార వాణిజ్య వర్గాలకు అత్యంత పారదర్శకమైన, సరళీకృతమైన రిజిస్ట్రేషన్, పన్ను చెల్లింపు విధానాన్ని అందుబాటులో ఉంచడంతో పాటు వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) చెల్లింపులో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన జీఎస్‌టీ సేవా కేంద్రాల ద్వారా మరింత మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది కృషిచేయాలన్న రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ బాబు ఏ ఆదేశాల అమలుపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు రాష్ట్ర పన్నుల శాఖ ఒకటో డివిజన్ జాయింట్ కమిషనర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
విజయవాడ-1 డివిజన్‌లో ఉన్న జీఎస్‌టీ సేవా కేంద్రాన్ని రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ బాబు ఇటీవల సందర్శించారని.. వచ్చే నెల నుంచి అమలు చేయనున్న రిజిస్ట్రేషన్ల ఫేషియల్ రికగ్నిషన్ విధానంపై దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. జీఎస్‌టీ సేవా కేంద్రాన్ని సందర్శించే పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని, కొత్త విధానాన్ని సజావుగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా అమలు చేయాలని సూచించినట్లు వివరించారు. వ్యాపార నిర్వహణలో పన్ను చెల్లింపు అనేది భాగమని.. అయితే కొందరు నకిలీ ఆధార్ కార్డు, గుర్తింపు పత్రాల సహాయంతో జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ చేయించుకొని కొంతకాలం పన్ను చెల్లించి ఆ తర్వాత ఎగవేతకు పాల్పడుతున్నట్లు తనిఖీల్లో వెల్లడైందని.. అదేవిధంగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) ఎగవేతకూ పాల్పడుతున్నారని వీటికి అడ్డుకట్ట వేయడంతో పాటు వ్యాపారులు, వినియోగదారులకు మేలు చేకూరేలా అత్యంత సరళమైన, పకడ్బందీ విధానాన్ని అమలుచేసేందుకు జీఎస్‌టీ సేవా కేంద్రాల సేవలను ఎప్పటికప్పుడు ఆధునికీకరిస్తున్నట్లు వివరించారు. ఫేషియల్ రికగ్నిషన్ విధానం అమలుతో అవకతవకలకు అడ్డుకట్ట వేయొచ్చని పేర్కొన్నారు.