గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో పారిశుధ్య పనుల పట్ల కార్మికులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారి పై కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. ఆదివారం కమిషనర్ భాగ్య నగర్, పట్టాభిపురం, ద్వారకా నగర్, గోరంట్ల, షాప్ ఎంప్లాయిస్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి, పారిశుధ్య పనులు, ఓసి కోసం దరఖాస్తు చేసుకున్న భవనాలను తనిఖీ చేసి తీసుకోవాల్సిన చర్యలపై ప్రజ్రోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించి, ప్రజారోగ్య విభాగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇప్పటికే నూతన కాంపాక్టర్ బిన్లు, పుష్ కాట్స్ అందించామని, వెహికిల్ షెడ్ లో పారిశుధ్య పనులకు వినియోగించే వాహనాల మరమత్తులను యుద్దప్రాతిపదికన చేపట్టడానికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. త్వరలో ప్రతి డివిజన్ కు ఒక ట్రాక్టర్ ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలో పారిశుధ్య పనుల మెరుగుదల కోసం కృషి చేస్తుంటే కొంత మంది సిబ్బంది, అధికారులు నిర్లక్ష్య వైఖరితో ఉంటున్నారని వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రత్యేక అధికారులు మరింత శ్రద్ధ చూపాలని, ఎంహెచ్ఓ, సిఎంఓహెచ్ లు రోజు ఉదయం, మధ్యాహ్నం క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని ఆదేశించారు. పారిశుధ్య పనుల్లో గతం కంటే మెరుగుదల ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదన్నారు. తమ రోజువారీ పర్యటనల్లో పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. నగర ప్రజలు కూడా గుంటూరు నగరాన్ని సుందర, శుభ్రమైన నగరంగా తీర్చిదిద్దుకోవడానికి నగరపాలక సంస్థకు సహకరించాలని కోరారు. తమ ఇంటి ముందుకు చెత్త తీసుకోవడానికి ప్రజారోగ్య కార్మికులు రాకుంటే జిఎంసి కాల్ సెంటర్ 0863-2345103 కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. నగరంలో బ్లాక్ స్పాట్స్ నిషేదించామని, ప్రజలు తమ ఇళ్లల్లో వ్యర్ధాలు రోడ్లు లేదా కాల్వల్లో వేస్తె భారీ మొత్తంలో అపరాధ రుసుం విధిస్తామన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బృందాల ద్వారా పర్యవేక్షణ చేయిస్తున్నామని, సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనంతరం ఆక్యుపెన్సి సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాలను పరిశీలించి, సెట్ బ్యాక్, రోడ్ ల కొలతలు, ర్యాంప్ లు, డ్రైన్ల పై ఆక్రమణలను తనిఖీ చేసి, తదుపరి అనుమతులకై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. పర్యటనలో ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, ఏసిపిలు రెహ్మాన్, మల్లిఖార్జున, శానిటరీ ఇన్స్పెక్టర్లు, టిపిఎస్ లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …