– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు గడ్డపై నుంచి ఎందరో చెస్ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నారని.. అలాంటి విజేతలను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ చిన్నారుల్లో ఉత్సాహం నింపారు. ఆదివారం విజయవాడ, కృష్ణలంకలోని అమరజీవి పొట్టి శ్రీరాములు నగరపాలక సంస్థ పాఠశాలలో జరిగిన స్టేట్ ర్యాంకింగ్ చదరంగం పోటీల సంరంభానికి కలెక్టర్ లక్ష్మీశ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాదాపు 350 మంది క్రీడాకారులు, 200 మంది తల్లితండ్రులు పోటీలకు హాజరయ్యారు. 16 ఏళ్లలోపు చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ మేధస్సు మేళవింపుతో సృజనాత్మక శక్తిని పెంచే చెస్ క్రీడలో విద్యార్థులు రాణించాలని సూచించారు. చెస్‌తో మేధోశక్తి ఇనుమడిస్తుందని.. మానసిక ఆరోగ్యంతో ముందడుగు వేసేందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. పోటీల్లో గెలుపొందిన 60 మంది విజేతలకు కలెక్టర్ ట్రోఫీలు, పతకాలు అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. గెలుపొందిన క్రీడాకారులు జనవరిలో పెద్దాపురంలో శ్రీ ప్రకాష్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగే నేషనల్ స్కూల్ గేమ్స్‌లో ప్రాగ్రెసివ్‌గా పాల్గొంటారని అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఠాగూర్ గ్రంథాలయం ప్రతినిధి రమాదేవి, గ్లోబల్ చెస్ అకాడమీ డైరెక్టర్, కోచ్ ఎస్‌కే కాసిం, ఎన్‌టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ అక్బర్ పాషా, మందుల రాజీవ్, టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్, స్టేట్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎన్ఎం ఫణికుమార్ పాల్గొన్నారు.