– ఏపీఎన్జీజీవో నగర శాఖ అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్ పిలుపు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపి ఎన్జీజీఒ రాష్ట్ర సంఘానికి ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న చౌదరి పురుషోత్తమ నాయుడు ఈనెల 31వ తేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ పదవికి కో ఆప్షన్ విధానంలో జరుగుతున్న ఎన్నికలకు ప్రస్తుత కృష్ణాజిల్లా అధ్యక్షులు, గత మూడు దశాబ్దాలుగా ఏపీఎన్జీజీవో సంఘంలో వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన ఎ. విద్యాసాగర్ ప్రధాన కార్యదర్శిగా పోటీలో ఉన్నారని విజయవాడ నగర శాఖ అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్ తెలిపారు. గాంధీనగర్లోని ఏపీఎన్జీజీవో హోంలో ఆదివారం నిర్వహించిన నగర శాఖ కార్యవర్గ అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్న విద్యాసాగర్ కు ఇప్పటికే రాష్ట్రంలోని మెజారిటీ జిల్లా సంఘాల నాయకులు మద్దతు తెలిపారన్నారు. ఆయన ఎన్నిక లాంఛన ప్రాయమేనన్నారు. ఎన్నిక అనంతరం విద్యాసాగర్ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించేందుకు నగర శాఖ ఇప్పటికే సిద్ధమైందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతల నిర్వహణ కోసం కో ఆప్షన్ విధానంలో ఎన్నిక జరగనుందని వివరించారు. ఇదే అంశాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల సంఘాల నాయకులకు రాష్ట్ర శాఖ సమాచారం అందించిందన్నారు. ఈ అంశంపై అన్ని జిల్లాల సంఘాల నాయకులు తమ తమ కార్యవర్గ సమావేశాల్లో విద్యాసాగర్ ను సమర్థిస్తూ ఈ మేరకు తీర్మానం చేసి రాష్ట్ర కార్యవర్గానికి అందజేసినట్లు పేర్కొన్నారు. 31వ తేదీ ఉదయం 10 గంటలకు రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నిక జరుగుతుందన్నారు. కార్యవర్గ సమావేశంలో విద్యాసాగర్ ఎన్నిక అనంతరం జింఖాన గ్రౌండ్లో నిర్వహించనున్న కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ పదవీ స్వీకార మహోత్సవానికి రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలిరానున్నారని తెలిపారు. విద్యాసాగర్ వంటి సమర్థులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నుకునేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లా సంఘాల నాయకులు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని వివరించారు. విద్యాసాగర్ వంటి సమర్థత కలిగిన వారి నాయకత్వంలో కలిసి పనిచేసేందుకు రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు. ఇప్పటివరకు జిల్లా స్థాయి నాయకుడిగా వ్యవహరించినప్పటికీ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని నాయకులకు సుపరిచితుడైన విద్యాసాగర్ నాయకత్వంలో ఏపీఎన్జీజీవో మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని రాష్ట్రంలోని 26 జిల్లాల నాయకులు బలంగా విశ్వసిస్తున్నారన్నారు. గతంలో సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో విజయవాడ, అప్పటి సమైక్య కృష్ణజిల్లాలో నిర్వహించిన ఎన్నో ఆందోళన కార్యక్రమాలలో విద్యాసాగర్ కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. సరైన పదవికి సరైన వ్యక్తి అనే సూత్రానికి అసలైన నిర్వచనమన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం విద్యాసాగర్ నేతృత్వంలో మరింత బలంగా పనిచేస్తుందని రాష్ట్రంలోని అన్ని జిల్లాల, నగర శాఖల నాయకులు తమ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని లక్షలాదిమంది ఉద్యోగులలో ప్రతి ఒక్క ఉద్యోగి పేరు గుర్తుపెట్టుకుని చనువుగా పలకరించగలగే ఒకే ఒక్క నాయకుడు విద్యా సాగర్ అని మెజారిటీ జిల్లాల సంఘాల నాయకులు తమ తమ కార్యవర్గ సమావేశాల్లో సైతం పేర్కొంటారన్నారు. అటువంటి వ్యక్తి పదవీ స్వీకార మహోత్సవం నిర్వహించే అవకాశం రావడం నగర శాఖకు దక్కిన గౌరవమన్నారు. వైభవంగా జరిగే ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొనాలని నగర శాఖ ఆహ్వానం పలుకుతోందన్నారు. సమావేశంలో నగర శాఖ కార్యవర్గ సభ్యులు రాజశేఖర్ నజీరుదీన్ శ్రీనివాసరావు వి వి ప్రసాద్ సిహెచ్ మధుసూదనరావు సాగర్ ఖాసీం సాహెబ్ విజయశ్రీ డిఇసి మెంబర్లు వివిదశాఖల చెందిన ఉద్యోగుల పాల్గొన్నారు.