Breaking News

పేదలకు కూటమి ప్రభుత్వం భరోసా

సాలూరు (పార్వతీపురం మన్యం), నేటి పత్రిక ప్రజావార్త :
పేదలకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖామాత్యులు గుమ్మిడి సంధ్యా రాణి  అన్నారు. మంగళవారం సాలూరు పట్టణంలో ఎన్ టి ఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు వేల పింఛను ను  నాలుగు వేల రూపాయలకు పెంచిందని తెలిపారు. నూతన సంవత్సరం సందర్బంగా ఒక రోజు ముందే పింఛను పంపిణి చేస్తుంటే, వృద్దులు,పేదల కళ్ళల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వృద్దులకు, వితంతువులకు దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనంత పింఛను నాలుగు వేల రూపాయలను కూటమి ప్రభుత్వం ఇస్తోందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోటులో ఉన్నా  వృద్దులు, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వికలాంగులకు ఆరు వేలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి పది వేలు, పూర్తిగా మంచం మీద నుంచి కదల్లేని వారికి పదిహేను వేల రూపాయలను కూటమి ప్రభుత్వం అందిస్తోందని  తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ కుటుంబానికి ఇంటి పెద్ద కొడుకుగా భరోసా, భద్రత కల్పించే బాధ్యత తీసుకున్నారని మంత్రి అన్నారు. జిల్లాలో 107, సాలూరు నియోజకవర్గంలో 29 కొత్త పింఛన్లు మంజూరు అయ్యాయని దీని వల్ల మరికొన్ని కుటుంబాలకు ఆసరా లభిస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో భర్త మరణిస్తే భార్యకు వితంతు పింఛను రావాలంటే  సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భర్త మరణిస్తే భార్యకు వితంతు పింఛను వెంటనే మంజూరు చేసేలా చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో సాలూరు మున్సిపల్ కమీషనర్ చెక్కా సత్యన్నారాయణ, 19, 20 వార్డు కౌన్సిలర్లు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *