-2024 సంవత్సరం దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైలురాయి
-ఫీనిక్స్ పక్షిలా అమరావతి మళ్లీ ఉదయిస్తోంది
-రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులొస్తున్నాయి
-2024కు వీడ్కోలు, 2025కు స్వాగతం పలుకుతూ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ట్వీట్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఉద్యోగ విప్లవం, యువతకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడం ఖాయమని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. బూడిద కుప్పల నుంచి ప్రాణం పోసుకునే ఫీనిక్స్ పక్షిలా అమరావతి మళ్లీ ఉదయిస్తోందని పేర్కొన్నారు. 2024 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. 2025కు స్వాగతం పలుకుతూ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎక్స్ వేదికగా మంగళవారం నాడు ట్వీట్ చేశారు. ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.
2024 సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌తో పాటు భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైలురాయి లాంటిదని మంత్రి సత్యకుమార్ యాదవ్ ట్వీట్‌లో వెల్లడించారు. 2024 ఎన్నికల్లో, ఏపీ ప్రజలు ప్రజా, అభివృద్ధి వ్యతిరేక, దురహంకార, అవినీతి పాలనకు తగిన గుణపాఠం చెప్పారని, సంఘ వ్యతిరేక శక్తుల్ని దిమ్మ తిరిగేలా తిప్పికొట్టారని స్పష్టం చేశారు. న్యాయమైన పరిపాలన, శ్రేయస్సు, మెరుగైన, సురక్షితమైన భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల్లో వచ్చిన ప్రజాస్వామ్య విప్లవమే 2024 ఎన్నికల ఫలితాలు అని అభివర్ణించారు.
ప్రజలు ఆకాంక్షించే బంగారు భవిష్యత్తుకు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు అండగా నిలుస్తారని భరోసానిచ్చారు. గత 6 నెలలుగా ఏపీలో, కేంద్రంలో జరుగుతున్న పరిపాలన, అమలవుతున్న కార్యక్రమాలే దీనికి నిదర్శనమన్నారు
ఆంధ్రప్రదేశ్ మళ్లీ స్పీడ్ ట్రాక్ పైకొచ్చిందని ట్వీట్‌లో పేర్కొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్రంలో అభివృద్ధి పనులు శర వేగంగా జరుగుతున్నట్లు వివరించారు. అమరావతి పునర్వైభవం సంతరించుకుంటోందని, పోలవరం సాకారం కాబోతోందని తెలిపారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులొస్తున్నాయనీ , అతి త్వరలో ఉద్యోగాల వెల్లువను చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
కాలచక్రంలో కొత్త పుటను రాసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో స్వర్ణాంధ్రప్రదేశ్, వికసిత్ భారత్ నిర్మాణానికి సంకల్పిద్దామని మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. 2025లో ప్రజలు ఆరోగ్యంగా, సంపన్నులుగా, సంతోషకరమైన జీవితాన్ని గడపాలని ట్వీట్ ద్వారా ఆకాంక్షించారు.