Breaking News

రాష్ట్రంలో మండలాలను, జిల్లా హెడ్ క్వార్టర్లను కలుపుతూ రూ. 6400 కోట్లతో యండిఆర్ రోడ్ల అభివృద్ది…

-రూ. 2,205 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో 8,970 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి…
-కాంట్రాక్టర్లలో విశ్వాసాన్ని కల్పించేందుకు బ్యాంకులు ద్వారా కాంట్రాక్టర్లకు చెల్లింపులు…
-రోడ్ల పర్యవేక్షణ, అభివృద్ధికి ప్రతి రెండు జిల్లాలకు చీఫ్ ఇంజినీరును నోడల్ అధికారిగా నియమించాం…
-రవాణా మరియు ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరి యంటి.కృష్ణబాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో రూ. 2,205 కోట్లతో 8,970 కిలోమీటర్లు మేర రోడ్లను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామని రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యంటి.కృష్ణబాబు అన్నారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయింపు, చేపట్టిన పనులను వివరించేందుకు సోమవారం సాయంత్రం రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యంటి. కృష్ణబాబు విజయవాడ ఆర్ అండ్ బి భవనంలో మీడియా ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ రూ. 2,205 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలోని ప్రధాన రహదారులను ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గత ఏడాది రూ. 932 కోట్ల రూపాయలు నిధులను ఖర్చుచేసి రోడ్లను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. వీటిలో రూ. 417 కోట్లు స్టేట్ హైవే రోడ్లు, రూ. 515 కోట్లు మేజర్ డిస్ట్రిక్టు రోడ్లను అభివృద్ధికి ఖర్చు చేయడం జరిగిందన్నారు. గత ఏడాది రూ. 600 కోట్ల రూపాయల బిల్లులు చెల్లింపునకు గాను జనవరి మాసం వరకూ రూ. 380 కోట్ల రూపాయలు చెల్లింపులు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను ప్రాధాన్యతా క్రమంలో చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇందుకు సంబంధించి నిధులు విడుదల చేయమని ఇప్పటికే ఆర్థిక శాఖను కోరడం జరిగిందన్నారు. త్వరలో చెల్లింపులు జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బిల్లుల చెల్లింపులపై కాంట్రాక్టర్లలో విశ్వాసం కల్పించేందుకు బ్యాంకులు ద్వారా చెల్లింపులు చేసేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందని రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యంటి. కృష్ణబాబు తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లలో ఉన్న అనుమానాలను నివృత్తి చేసి వారిలో నమ్మకాన్ని కల్పించేందుకు బ్యాంకులు నుండి రుణాలు తీసుకుని నేరుగా ఆయా బ్యాంకులు ద్వారానే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందన్నారు. ఈ విషయంలో 5 ప్రధాన బ్యాంకులతో ఇప్పటికే చర్చలు జరపడం జరిగిందని, వాటిలో 3 బ్యాంకులు రుణాలు మంజూరు చేసి బిల్లులు చెల్లించేందుకు ముందుకు రావడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రానికి పెట్రోలు, డీజిల్ ద్వారా వచ్చే సెనను ఆంధ్రప్రదేశ్ రోడ్డు డవలప్ మెంట్ కార్పోరేషన్ కు మళ్లించి రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 2020-21 సంవత్సరానికి గాను బడ్జెట్లో రూ. 410 కోట్లు రూపాయలు కేటాయించామని, ఇప్పటికే రూ. 160 కోట్లతో చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నవని ఆయన అన్నారు. వాతావరణ పరిస్థితులు దృష్ట్యా ప్రస్తుతం రోడ్ల పరిస్థితి సరిగ్గా లేదని 10 రోజుల్లోగా ఆర్ అండ్ బి శాఖకు సంబంధించిన పెండింగ్ నిధులు ప్రభుత్వం విడుదల చేస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుత రోడ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు, ప్రాధాన్యతా క్రమంలో రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రతి రెండు జిల్లాలకు ఒక చీఫ్ ఇంజినీరను నోడల్ అధికారిగా నియమించామని ఆయన అన్నారు.
రూ. 1158.53 కోట్ల నేషనల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డవలప్ మెంట్ అథారిటీ (నిడా) నిధులతో రాష్ట్రంలో 99 స్టేట్ హైవేస్ ను, 134 మేజరు డిస్ట్రిక్టు రోడ్లను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇందులో మొదటిదశకింద రూ. 408 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసామని వాటిలో రూ. 399.68 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన పనులను ఈ ఏడాది డిశంబరు నాటికి పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో రోడ్ కనెక్టవిటీని పెంచే విధంగా మండలాల నుండి జిల్లా హెడ్ క్వార్టరుకు రోడ్లను అభివృద్ధి చేయడానికి న్యూ డవలప్ మెంట్ బ్యాంకు (యన్ డిబి) సహకారంతో రూ. 6400 కోట్లతో ప్రాజెక్టును అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మొదటిదశక్రింద రూ. 2970 కోట్లతో పనులను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లకు అప్పగించడం జరిగిందన్నారు. ఇప్పటికే రోడ్ల అభివృద్ధి పై సర్వే నిర్వహించి ప్రాధాన్యతా క్రమంలో పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. నెలరోజుల్లో పనులను చేపట్టి, మొత్తం పనులన్నింటినీ రెండు సంవత్సరాల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని కృష్ణబాబు అన్నారు.
మీడియా ప్రతినిధుల సమావేశంలో ఇంజినీరింగ్ ఇన్ ఛీఫ్ (అడ్మిన్) కె. వేణుగోపాలరెడ్డి, ఇయన్ సి (యండిఆర్) కె. నయిముల్లా, ఏపిఆర్ డిసి మేనేజింగ్ డైరెక్టరు యల్. శ్రీనివాసరెడ్డి, చీఫ్ ఇంజినీర్ (బిల్డింగ్స్) పి.యల్. రమేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Check Also

స్వచ్చంద సంస్థలు యాంటి బర్త్ కంట్రోల్ (ఏబిసి)కి సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు స్వచ్చంద సంస్థలు యాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *