మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సుమారు ఏడాదిన్నర తరువాత ఈ రోజు సోమవారం కలక రేట్లో ప్రారంభమైన స్పందన వివిద ప్రాంతాల నుండి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీదారులతో కలక్టరేట్ ప్రాంగణంలో సందడి నెలకొంది. జాయింట్ కలక్టర్లు (రెవెన్యూ) డా. కె. మాధవీలత, జెసి (డెవలప్మెంట్) ఎల్. శివశంకర్, జెసి (హౌసింగ్) ఎస్ఎన్. అజయ్ కుమార్, జెసి ( సంక్షేమం) మోహన్ కుమార్ కలక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా అధికారులతో సమావేశమై ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. కోవిడ్ నేపధ్యంలో స్పందన హాలు ప్రవేశ ద్వారం వద్ద అర్జీదారులు మాస్క్ లు ధరించి శానిటైజేషన్ చేసిన అనంతరమే లోనికి అనుమతించారు.
జాయింటు కలక్టర్ రెవిన్యూ డా. కె. మాధవీలత ఈ సందర్భంగా మాట్లాడుతూ దాదాపు ఏడాదిన్నర తరువాత స్పందన కార్యక్రమం మరల ప్రారంభించడం జరిగిందని, అర్జీదారులు మాస్క్ లు ధరించి శానిటైజేషన్ చేసుకుని అర్జీలు సమర్పించాలన్నారు. సామాజిక దూరం పాటించాలని సూచించారు. కోవిడ్ నుండి మిమ్మును మీరు కాపాడుకుంటు ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ రోజు 150 గ్రీవెన్సు వచ్చాయని, ముఖ్యంగా అర్జీదారుల యొక్క గత సమస్యలపై మరలా అర్జీలు ఇచ్చారని, వచ్చిన అర్జీలు తగిన పరిశీలన జరిపి వచ్చే సోమవారం గ్రీవెన్సు నాటికి వాటి పరిష్కార స్థితి పై నివేదిక సమర్పించాలన్నారు.
జాయింటు కలక్టరు డెవలప్మెంట్ ఎల్. శివశంకర్ మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులు అందరు కోవిడ్ వాక్సినేషన్ చేయించుకున్నారా? లేదా ఆరాతీశారు. వాక్సినేషన్ చేయించుకోని వారు వెంటనే చేయించుకోవాలని సూచించారు.
స్పందన అర్జీలలో…
ముదినేపల్లి మండలం గురజ గ్రామంలో నాగేంద్రస్వామి గుడి ప్రక్కస్ధలంలో కొందరు ఇటుకబట్టీ నడుపుతున్నారని, బట్టి నుండి బూడిద దుమ్ము ప్రక్కనున్న మంచినీటి బావిలో పడుతూ త్రాగునీరు కలుషితం అవుతున్నదని ఇటుకబట్టీ వేరేచోటికి తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్థులు ఎస్.కె. జుబేర్ తదితరులు అర్జీ సమర్పించారు.
పెదపూడి గ్రామ పంచాయితీ కార్యదర్శి జగనన్న తోడు పథకం మంజూరు చేయిస్తానని డబ్బులు వసూలు చేశారని, తగిన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ పి. పాండురంగారావు అరీ సమర్పించారు.
పామర్రులో తనకు ఆర్ ఎస్. 725 నందు సెంటు స్థలం ఉందని, పొజిషన్ సర్టిఫికెట్ ఇప్పించాలని కోరుతూ జన్ను వెంకటేశ్వరరావు అర్జీ ఇచ్చారు.
మండవల్లి మండలం భైరవపట్నం గ్రామానికి చెందిన ఆగొల్లు నాగమణి తనకు చావలిపాడు గ్రామంలో గల 1.30 ఎకరాల భూమిలో 60 సెంట్లు తన కుమార్తెకు రిజిష్టరు చేశానని, తనకు తన కుమార్తెకు పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేసి అడంగల్ లో నమోదు చేయించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
గూడూరు మండలం రామరాజుపాలెం గ్రామానికి చెందిన బాల వెంకటేశ్వరరావు, దేశు రెడ్డి తదితరులు కె.ఇ.బి కెనాల్ బందరు కాలువ గట్టు లీజును పొడిగించాలని కోరుతూ అర్జీ ఇచ్చారు.
పల్లెర్ల మూడి బిసి హాస్టలులో వాచ్ మెన్ గా పని చేస్తు 2014 సంవత్సరంలో కనిపించకుండా పోయిన తన తండ్రి శేషగిరిరావు పోలీసులు నోట్రేస్ సర్టిఫికెటు ఇచ్చారని, తన తల్లికి కారుణ్య నియమకం నిమిత్తం కుటుంబ సభ్యుల సర్టిఫికెట్ నిరభ్యంతర ధృవపత్రం ఇప్పించాలని కోరుతూ జనార్ధనపురం వెంకట రామకృష్ణ అర్జీ సమర్పించారు.
మంటాడ గ్రామంలో అనధికార లే అవుట్ లో నిర్మించిన రహదారులను తొలగించాలని కోరుతూ జంపాన శ్రీనివాస్ గౌడ్ అర్జీ ఇచ్చారు.
ఈ సమావేశంలో సహాయ కలక్టరు శోభిత, డిఆర్వో ఎం. వెంకటేశ్వర్లు, ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి, జడ్ పి సిఇవో సూర్యప్రకాశరావు , డ్వామా పిడి జి.వి. సూర్యనారాయణ, డిఆర్ డిఎ పిడి ఎం. శ్రీనివాసరావు, డిఎంఅండ్ హెవో డా. సుహాసిని, ముడ విసి నారాయణ రెడ్డి వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.