-ఎంఎల్ఎలు, ఎంఎల్ సిలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
-బడుగు బలహీన వర్గాల అభివృద్దికి కృషి చేయాలని వక్తల పిలుపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చేతి వృత్తిదారుల జీవన ప్రమాణ స్ధాయిని మరింత మెరుగు పరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తుల అభివృద్ది సంస్ధ (లేపాక్షి) ఛైర్ పర్సన్ బడిగించల విజయలక్ష్మి అన్నారు. విజయవాడ లేపాక్షి షోరూమ్ ఆవరణలో శాసన సభ్యులు, శాసన మండలి సభ్యుల సమక్షంలో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సంస్ధ ఛైర్మన్ గా విజయలక్ష్మి ప్రమాణా స్వీకారం చేసారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మల మడుగుకు చెందిన వైఎస్ఆర్ సిపి సీనియర్ నేత విజయలక్ష్మి ఇటీవలి నియామకాలలో లేపాక్షి ఛైర్మన్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రాచీన హస్తకళలు భారతదేశానికి వెన్నెముక వంటివని వాటిని కోనుగొలు చేసి హస్త కళాకారులను ప్రోత్సహించవలసిన బాధ్యత సమాజంపై ఉందని అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి కళాకారులు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి కళాకృతులు రూపొందిస్తున్నారని వాటికి అంతర్జాతీయ మార్కెట్ కల్పించవలసి ఉందని వివరించారు. సంస్ధ టర్నోవర్ ను పెంచి వ్యాపార లక్ష్యాలను అధికమించేందుకు కృషి చేస్తానన్నారు. తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా చేతి వృత్తిదారుల కృషి చేస్తానని స్ఫష్టం చేసారు.
జమ్మల మడుగు ఎంఎల్ఎ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం సిఎం నిరంతరం తపిస్తున్నారని, ఆ క్రమంలో విజయలక్ష్మి క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. కమలాపురం ఎంఎల్ ఎ రవీంధ్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ కరోనా కారణంగా మందగించిన వ్యాపార సరళిని పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. శాసన మండలి సభ్యులు అమరనాధ్ రెడ్డి మాట్లాడుతూ చేతి వృత్తి దారుల సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వం పాలన అందిస్తుందని, ప్రతి ఒక్కరికీ ఆ ఫలాలు చేరేలా శ్రద్ద వహించాలని వివరించారు. కడప మేయర్ సురేష్ బాబు, ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహన రావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు కృష్ణారెడ్డి, ఎన్ఎపిసిఎ రాష్ట్ర అధ్యక్షులు బిఎం రత్నం, వైఎస్ఆర్ సిపి నాయకులు బడిగించల చంద్రమోళీ తదితరులు కార్యక్రమానికి హాజరై నూతన ఛైర్ పర్సన్ కు తమ శుభాకాంక్షలు తెలపగా, సంస్ధ ఓఎస్డి ఐవి లక్ష్మినాధ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం అనంతరం నూతన ఛైర్మన్ సంస్ధ ఉద్యోగులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఓఎస్ డి లక్ష్మినాధ్ సంస్ధ అర్ధిక స్ధితిగతులు, కార్యకలాపాలను గురించి వివరించారు.