-రాష్ట్రంలో చలన చిత్ర, టివి షూటింగ్ లు నిర్మించే నిర్మాతలను ప్రోత్సహిస్తాం…
-లఘుచిత్రాల నిర్మాతలను ప్రోత్సహించేందుకు షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహణ…
-మహిళా నిర్మాతలకు ప్రత్యేక షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తాం…
-య డిసి చైర్మన్ టియస్. విజయచందర్, యండి టి.విజయకుమార్ రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో చలనచిత్ర టివి షూటింగ్ లు నిర్వహించే నిర్మాతలకు ప్రభుత్వం అన్నిరకాలుగా సహకరించి ప్రోత్సహిస్తుందని త్వరలో మహిళా నిర్మాతలకు ప్రత్యేక షార్ట్ ఫిల్మ్ పోటీలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టివి మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ టియస్. విజయచందర్ తెలిపారు. రాష్ట్ర చలన చిత్ర టివి మరియు నాటకరంగ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ (లఘుచిత్రాల పోటీలు) పోటీలలో గెలుపొందిన విజేతలకు గురువారం విజయవాడ ఏపియస్ఆర్ టిసి భవన్ లో గల యఫ్ డిసి కార్యాలయంలో బహుమతులను అందజేసారు. ఈసందర్భంగా ఛైర్మన్ విజయ్ చందర్ మాట్లాడుతూ కోవిడ్ వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రభుత్వం షూటింగ్ లకు అనుమతించడం జరిగిందన్నారు. ప్రభుత్వ లొకేషన్లలో షూటింగ్ జరుపుకునేందుకు ఉచితంగా అనుమతిస్తున్నామన్నారు. షూటింగ్ అనుమతులకొరకు నేరుగా యఫ్ డిసి కార్యాలయానికి రాకుండా ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకునేలా ప్రక్రియను సులభతరం చేసామన్నారు. రాష్ట్రంలో షూటింగ్ లు జరుపుకునే సమయంలో టూరిజం రిస్సార్ట్స్ ను వినియోగించుకునేవారికి అద్దెలో 20 శాతం రాయితీ ఇవ్వడం జరుగుతుందన్నారు. కోవిడ్ సందర్భంగా ధియేటర్ యజమానులను ఆదుకునేందుకు ప్రభుత్వం 3 నెలల కరెంట్ ఛార్జీలను రద్దు చేయడం జరిగిందని, మరో ఆరు నెలల ఛార్జీలను దశలవారీగా చెల్లించేలా వెసులుబాటు కల్పించి ముఖ్యమంత్రి ధియేటర్ యజమానులను ఆదుకున్నారన్నారు. ఏపిలో లోబడ్జెట్ లో సినిమాలు నిర్మించే నిర్మాతలు చెల్లించే ఏపిజియటి ని ప్రభుత్వం రీఎ ంబమెంట్ చేసి ఉత్తమ చిత్రానికి రూ. 10 లక్షల పారితోషికం చెల్లించడం జరుగుతుందని విజయచందర్ వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టివి మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టరు టి.విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాతలు, ధియేటర్ యజమానులు, కళాకారులను ప్రోత్సహించి చలనచిత్ర టివి, నాటకరంగాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నదన్నారు. ముఖ్యంగా లోబడ్జెట్ లో సినిమాలు నిర్మించే నిర్మాతలకు రాయితీలను ప్రకటించడం జరిగిందన్నారు. లఘుచిత్రాల నిర్మాతలను ప్రోత్సహించేందుకు నిర్మాతలు పోటీలలో పాల్గొనవలెనని ఆహ్వానించడం జరిగిందన్నారు. 2020 సంవత్సరానికి గాను ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు, అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్ర స్థాయిలో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించగా 35 లఘు చిత్రాలు పరిశీలనకు వచ్చాయన్నారు. వీటిలో 6 ఉత్తమ లఘుచిత్రాలను కమిటీ ఎంపిక చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రధమ ఉత్తమ చిత్ర నిర్మాతకు రూ. లక్ష రూపాయలు, ద్వితీయ ఉత్తమ లఘుచిత్రానికి ఒక్కొక్కరికి రూ. 50 వేల రూపాయలు (ఇద్దరుకు), తృతీయ ఉత్తమ లఘుచిత్రానికి రూ. 25 వేల రూపాయలు (ముగ్గురుకు) చొప్పున మొత్తం రూ. 2 లక్షల 75 వేల రూపాయలు నగదు బహుమతులను, జ్ఞాపికలను అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. మహిళా నిర్మాతలను ప్రోత్సహించేందుకు త్వరలో మహిళా నిర్మాతలకు ప్రత్యేక మహిళా షార్ట్ ఫిల్మ్ పోటీలను నిర్వహించనున్నట్లు విజయకుమార్ రెడ్డి తెలిపారు.
షార్ట్ ఫిల్మ్ పోటీలలో ఎంపికైన లఘుచిత్రాలు…
కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన వరి నాగరాజు నిర్మించిన ‘ జయహో జననాయకా ‘ కు ప్రధమ బహుమతి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన య్బ యస్. శ్రీనివాస్ నిర్మించిన ‘ నవరత్నాలు మ్యూజికల్ ప్రజంటేషన్ ‘ కు ద్వితీయ బహుమతి, విశాఖపట్నం జిల్లాకు చెందిన శివశ్రీ మీగడ నిర్మించిన ‘ జగనన్న నవరత్నాలు ‘ కు ద్వితీయ బహుమతి, తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన టియస్. లక్ష్మీనారాయణమూర్తి నిర్మించిన ‘ మళ్లీ పుట్టాను ఆ చిత్రానికి తృతీయ బహుమతి, పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలుకు చెందిన టి. వేణుగోపాలకృష్ణ నిర్మించిన ‘ రాజన్న రాజ్యంలో ఓసీత కథ చిత్రం ‘ కు తృతీయ బహుమతి, గుంటూరుకు చెందిన చుండూరు సుందరరామశర్మ నిర్మించిన ” పేదలందరికీ ఇళ్లు ” చిత్రానికి తృతీయ బహుమతి లభించింది. విజేతలకు ఛైర్మన్ విజయచందర్, మేనేజింగ్ డైరెక్టరు విజయకుమార్ రెడ్డిలు దుశ్శాలువాలతో సత్కరించి నగదుబహుమతి, మెమెంటోలతో సత్కరించారు. అనంతరం యఫ్ డిసి బోర్డు మాజీ డైరెక్టరు సిహెచ్. వి.యల్. మల్లేశ్వరరావును సన్మానించి ఆయన సంస్థకు అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర టివి మరియు నాటకరంగ సంస్థ కార్యక్రమంలో యఫ్ డిసి జనరల్ మేనేజరు యంవియల్ యన్. శేషసాయి, సమాచార శాఖ అడిషినల్ డైరెక్టరు (యస్ఎసి) యల్. స్వర్ణలత,
జాయింట్ డైరెక్టర్లు పి. కిరణ్ కుమార్, టి. కస్తూరి తదితరులు పాల్గొన్నారు.