Breaking News

“మోసగాళ్లకు మోసగాడు”  చిత్రానికి  50 ఏళ్ళు పూర్తి…


అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారత దేశంలోనే  తొలి  కౌబాయ్ సినిమాగా పేరు తెచ్చుకున్న “మోసగాళ్లకు మోసగాడు”  చిత్రం  హీరో  సూపర్ స్టార్, డేరింగ్, డేషింగ్, నటశేఖర కృష్ణ జీవితాన్ని మలుపు తిప్పి… ఆర్ధికంగా నిలబెట్టి… ఇమేజ్ మార్చేసిన సినిమా. 2021 ఆగస్టు 27 కి ఆ సినిమా విడుదలై 50 ఏళ్ళు పూర్తి అయింది. అయినప్పటికీ సినిమా ఇంకా తాజా అనుభూతినిస్తుంది. అసలు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఉండకపోతే  పద్మాలయా సంస్థ  నిలబడేది కాదు. ఆ సినిమానే మోసగాళ్లకు మోసగాడు. నిర్మాతగా  మొదటి సినిమా “అగ్నిపరీక్ష ” హిట్ కాకపోవడంతో  హీరో కృష్ణ నిరాశపడ్డారు.  ఆ నిరాశ లో నుంచి పుట్టిన కసే “మోసగాళ్లకు మోసగాడు” తీసేందుకు ముందడుగు వేయించింది. సినిమా గురించి చెప్పుకోవాలంటే విశేషాలు చాలానే ఉన్నాయి. భారత దేశంలోనే  తొలి  కౌబాయ్ సినిమాగా పేరు తెచ్చుకుంది. కృష్ణ ఈ సినిమాతో స్టార్ హీరో గా ఎదిగారు.  ఏడు లక్షల రూపాయల బడ్జెట్ తో కేవలం 28 రోజుల్లో ఈ సినిమా తీయడం ఒక రికార్డు. ఫస్ట్ రిలీజ్ లోనే దాదాపు 32 లక్షల రూపాయలు  వసూలు చేసింది.  హాలీవుడ్ సినిమా కథల స్ఫూర్తి తో రూపొందిన ఈ సినిమా ఆంగ్లంలోకి అనువాదమై అక్కడి ప్రేక్షకులను అలరించింది. ట్రెజర్ హంట్ పేరిట 125 కి పైగా దేశాల్లో విడుదలై కనకవర్షం కురిపించింది.  అలాగే తమిళ్, హిందీ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేస్తే మంచి వసూళ్లను రాబట్టింది. అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ సినిమా స్ఫూర్తి తో మరెన్నో కౌబాయ్ సినిమాలు తెలుగులో రూపొందాయి.  హీరో కృష్ణ తోనే 15  సినిమాలు వరకు వచ్చాయి. వాటిలో కొన్ని బాగానే ఆడాయి.  మరి కొన్ని అంతగా ఆడలేదు. ఇవన్నీ పూర్తి అయ్యేవరకు కృష్ణ మళ్ళీ సొంత సినిమాపై దృష్టి పెట్టలేకపోయారు. మోసగాళ్ళకు మోసగాడు సినిమాను రాజస్థాన్లో ఎడారులు, బికనీర్ కోట, పంజాబ్ లోని సట్లెజ్ నది తీరం, హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా పరిసర ప్రాంతాల్లో మంచుకొండలు, టిబెట్ పీఠభూమి, పాకిస్తాన్-చైనా సరిహద్దు ప్రాంతం వంటి ప్రదేశాల్లో చిత్రీకరించారు. ఆయా ప్రాంతాల్లో షూటింగ్ కోసం మొత్తం యూనిట్ అంతటినీ రాజస్తాన్ కు ప్రత్యేక రైలు వేయించుకుని తీసుకువెళ్ళారు. సినిమాలో కృష్ణని మొట్టమొదటిసారి కౌబాయ్ గా కాస్ట్యూంస్ చేసిన బాబూరావు, వెంకట్రావు, మేకప్ మేన్ మాధవరావు తీర్చిదిద్దారు. సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా వి.ఎస్.ఆర్.స్వామి వ్యవహరించి చిత్రీకరణ చేసారు. కృష్ణతో పాటు  నాగభూషణం, సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, విజయనిర్మల, జ్యోతిలక్ష్మి, త్యాగరాజు, ధూళిపాళ, రావుగోపాలరావు తదితర తారాగణం నటించారు. పాటలు… ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా ఏడిగుందా…, కత్తిలాంటి పిల్లోయి కదలివచ్చె కాస్కో మచ్చుకైన మామ…, కోరినది నెరవేరినది ఓహో కలలు నిజమాయే…, గురిని సూటిగ కొట్టేవాడా సాటిలేనిది…, తకిట ధిమి తక తై తమాషా మైకం తలచినది…, పద్మాలయాం పద్మాకరాం పద్మపత్రనిభేక్షణా (శ్లోకం) ఇప్పటికి అలరిస్తున్నాయి. కృష్ణ వారసుడు అయిన హీరో మహేష్  కూడా  టక్కరి దొంగ అనే  కౌబాయ్ సినిమాలో నటించాడు .  దీన్ని తమిళ్ ,హిందీ భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేశారు. జయంత్ తీసిన ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. కృష్ణ అల్లుడు సుధీర్ 2015 లో  “మోసగాళ్లకు మోసగాడు”  టైటిల్ తో తీసిన సినిమాలో నటించాడు.  ఆ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. ఈ చిత్ర కథ మన నేటివిటీ కి దగ్గరగా లేకపోయినా ప్రేక్షకులు అప్పట్లో పట్టించుకోలేదు. కొత్త ట్రెండ్, బోర్ లేకుండా సాగే కథనం ఆడియన్స్ ను కట్టిపడేశాయి. ఈ సినిమాకు కథ మాటలు సమకూర్చింది ప్రముఖ రచయిత ఆరుద్ర.  నిర్మాతలు చెప్పినట్టు ఆయన కథను తయారు చేసారు. దర్శకుడు కేఎస్ ఆర్ దాస్ దానికి సొబగులు అద్ది   ప్రేక్షకులకు అందించారు. “గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ” లో  కొంత …   “మెకన్నాస్ గోల్డ్” లో కొంత  …  “ఫ్యూ డాలర్స్ మోర్ ”  లో కొంత కథను , కొన్ని  సన్నివేశాలను  ఆధారంగా కొత్త కథను  ఆరుద్ర తయారు చేశారు.  అది బాగా నచ్చడం తో ఇక మార్పులు లేకుండా కృష్ణ సినిమా తీశారు. మొదట్లో ఈ సినిమాను ఆరుద్రనే కృష్ణ డైరెక్ట్ చేయమన్నారట. ఆయన తనవల్ల కాదని తేల్చి చెప్పడంతో  దాస్ రంగంలోకి దిగారు. అప్పటికే  దాసు తో కృష్ణ కు బాగా పరిచయం ఉండటం, యాక్షన్ సినిమాలు తీసి ఉండటం  కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. దాస్ కూడా తన సత్తా చాటుకున్నారు. తొలుత ఈ సినిమాకు “అదృష్టరేఖ” అనే టైటిల్ పెడదామనుకున్నారు కానీ చివరకు “మోసగాళ్లకు మోసగాడు” టైటిల్  ఖరారు అయింది. హీరోను ఎడారిలో వదిలి వెళ్ళినపుడు తాగడానికి నీళ్లులేక , ఎండ వేడిమికి  మొహమంతా పొక్కులు వస్తాయి. కృష్ణకు ఆ విధంగా మేకప్ చేసేందుకు మేకప్ మ్యాన్ మాధవరావు శ్రమపడ్డారు. బఠానీలపై ఉండే తొక్కును మొహంపై అతికించి మేకప్ చేశారు. దాంతో సన్నివేశానికి కావాల్సిన విధంగా కృష్ణ తయారయ్యారు. ఇక వీఎస్ ఆర్ స్వామి కెమెరా పని తనం  సినిమాకు వన్నె తెచ్చింది. నక్క జిత్తుల నాగన్న పాత్రలో నాగభూషణం జీవించారు. ఆ క్యారెక్టర్ ఊతపదం ‘అబ్బయ్య’  కూడా బాగా పేలింది. నాగభూషణం పై చిత్రీకరించిన పాట ‘ఎలాగుంది  ఎలాగుంది అబ్బాయా’  కూడా సరిగ్గా కథకు సరిపోయింది.  ఆది నారాయణరావు సంగీతం కూడా సినిమాకు ఊపు నిచ్చింది. కృష్ణ ఆస్థాన రచయిత అప్పలాచార్య నాగభూషణం పాత్ర ద్వారా కొంత కామెడీ అందించారు. ఈ సినిమా కథ ఆధారంగా వెండితెర నవల కూడా వచ్చింది. కృష్ణ అభిమాని విజయ్ దీన్ని తీసుకొచ్చారు.  కృష్ణ తర్వాత కొందరు కౌబాయ్ పాత్రలు పోషించినా కృష్ణను మరిపించలేకపోయారు.  కాబట్టి కృష్ణే ఎవర్ గ్రీన్ కౌబాయ్ అని చెప్పుకోవచ్చు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *