చెడు మీద మంచి విజయం సాధించడమే గీతా సారాంశం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 


-ఉత్తమ జీవన విధానానికి ‘భగవద్గీత’ స్ఫూర్తినిస్తుంది
-శ్రీ కృష్ణ పరమాత్ముని ఊరేగింపు మహోత్సవంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధ్యాత్మిక మార్గనిర్దేశం ద్వారా సమాజాన్ని సన్మార్గంలో నడిపే శక్తి భగవద్గీతకు ఉందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. శ్రీకృష్ణాష్టమి వేడుకల ముగింపు సందర్భంగా బాల గోపాలుని ఊరేగింపు మహోత్సవం ఆంధ్రప్రభ కాలనీలో కన్నులపండువగా జరిగింది. ప్రబోధ సేవా సమితి, ఇందూ జ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు నిర్వహించిన గీతా పారాయణం, కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు సమాజంలో ఆధ్యాత్మిక కోణంలో ఎలా జీవించాలో భగవద్గీత తెలియజేస్తుందన్నారు. చిన్న వయస్సులోనే భగవద్గీత శ్లోకాలను శాస్త్రబద్ధంగా పఠించడం, దానిలోని సందేశం అర్థం చేసుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చన్నారు. ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాలలోనూ భగవద్గీత సాక్షిగా ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కనుక ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా రోజుకో పేజీ అయిన భగవద్గీత చదవాలని సూచించారు. ఉత్తమ జీవన విధానానికి భగవద్గీత స్ఫూర్తినిస్తుందని అన్నారు. భగవద్గీత శ్లోక పఠనం వల్ల భక్తులలో జ్ఞానం, శాంతి, దయ, సద్భావన కలుగుతాయన్నారు. మానవుని పరమార్థాన్ని గీతాసారం ద్వారా తెలుసుకోవచ్చన్నారు. గీతాసారాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు టిటిడి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని మల్లాది విష్ణు గారు తెలియజేశారు. ఇదే సందర్భంలో హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఉమ్మడి రమాదేవి వెంకట్రావు, అలంపూర్ విజయలక్ష్మి, కొంగితల లక్ష్మిపతి, నిర్వాహకులు కిరణ్, సత్యం, దుర్గారావు, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *