-ఉజాలా ద్వారా రూ. 20 వేల కోట్ల మేర విద్యుత్ బిల్లుల ఆదా
-అదే తరహాలో ఎంఎస్ఎంఈల్లో అదితి పథకం మంచి ఫలితాలనిస్తుంది
-పర్యావరణ పరిరక్షణకోసం చేపట్టిన ముసీ నది పునరుద్ధరణకు దోహదం
-ఆర్ధిక వృద్ధి, ఉద్యోగాల కల్పనతోపాటు భూతాపాన్ని తగ్గించడంలో ఉపయుక్తం
-అందుకే ఇంధన సామర్ధ్య చర్యలను అందరూ ఉద్యమంలా చేపట్టాలి
-తెలంగాణ విజిలెన్స్ కమిషనర్ ఎంజీ గోపాల్ పిలుపు
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
నానాటికి దేశంలో పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించడంలో భాగంగా ఇంధన-సమర్థవంతమైన సాంకేతికతలను స్వీకరించడానికి అన్ని ప్రభుత్వాలు సమగ్ర వ్యూహాన్ని అనుసరించాలని తెలంగాణ విజిలెన్స్ కమిషనర్ ఎంజీ గోపాల్ పిలుపునిచ్చారు. బీఈఈ దక్షిణాది రాష్ట్రాల మీడియా సలహాదారు వివిధ రంగాల ప్రముఖులతో ఇంధన సామర్ధ్య చర్యల అమలుపై చేస్తున్న సంప్రదింపులలో భాగంగా విజిలెన్స్ కమిషనర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న గోపాల్‌ను కలిసి చర్చించారు. పట్టణాభివృద్ధి, పర్యావరణ రంగంలో అనేక సంవత్సరాలు సేవలందించిన ఎంజీ గోపాల్ ఇంధన-సమర్థవంతమైన సాంకేతికతలను స్వీకరించడంలో ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడానికి రూపొందించిన అసిస్టెన్స్ ఫర్ డిప్లాయిమెంట్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియంట్ టెక్నాలజీ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (అథితి) పథకంతో సహా వినూత్న పర్యావరణ, ఇంధన సామర్థ్య కార్యక్రమాలపై ఆయన అభిప్రాయాలను సేకరించారు. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి, పోటీతత్వాన్ని పెంచడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఈ పథకం యొక్క ఉపయోగాలను ఆయన నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా ఎంజీ గోపాల్ మాట్లాడుతూ, ఇప్పటికే ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేస్తున్న కృషిని గుర్తుచేస్తూ అన్ని రాష్ట్రాల్లో దీనిని ఒక ఉద్యమంలా చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 35 సంవత్సరాలకు పైగా సేవ చేసిన సీనియర్ అధికారిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ ఉద్యమాన్ని ముందకు తీసుకెళ్లేందుకు ప్రజల భాగస్వామ్యంతోపాటు విద్యుత్ వినియోగదారుల అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటంతోపాటు పర్యావరణ పరిరక్షణకు చేయూతనిచ్చినట్లవుతుందని అన్నారు. దేశంలో 2030 నాటికి ఒక బిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతోపాటు 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కమిషనర్ వివరించారు. దక్షిణాది రాష్ట్రాల్లో అందునా మరీ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఈ జాతీయ లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఇంధన సామర్ధ్య చర్యలను పెద్ద ఎత్తున చేపట్టి నిర్దిష్ట కార్యాచరణతో అమలు చేస్తే ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే 20 శాతం కార్బన్ ఉద్గారాలను తగ్గించడం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉజాలా పథకం మంచి ఫలితాలనిచ్చింది
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉజాలా, ఇ-మొబిలిటీ వంటి వివిధ విద్యుత్ పొదుపు కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేస్తోందని ప్రశంసించారు. ఈ కార్యక్రమాలు పర్యావరణ, ఆర్థిక స్థిరత్వానికి రాష్ట్రం యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తాయని చెప్పారు. మరీ ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన మూసీ నది ప్రక్షాళణలో ఇది మరింతగా దోహదపడుతుందన్నారు. అంతేకాకుండా ఇది ఆర్థిక ఉత్ప్రేరకంగా కూడా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమం పర్యావరణ స్థిరత్వంపై ప్రధాన ప్రభావాన్ని చూపడంతోపాటు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తుందని అన్నారు. ఈఈఎస్ఎల్ ఉన్నత్ జ్యోతి కింద ఉజాలా పథకం ద్వారా అందరికీ ఎల్ఈడీ బల్బులు పథకం విజయాన్నిఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో విద్యుత్ మంత్రిత్వ శాఖ 2015 నుండి గృహాలకు ఈ పథకం కింద ఎల్ఈడీ బల్బులను అందించడం ద్వారా దాదాపు రూ. 20 వేల కోట్లకు పైగా విద్యుత్ బిల్లులను ఆదా చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయని బీఈఈ మీడియా సలహాదారు చెప్పారు. దీనిపై స్పందించిన ఎంజీ గోపాల్ మాట్లాడుతూ, భూతాపాన్ని కాపాడుతూ జీవనోపాధిని మెరుగుపరచడంలో ఇంధన సామర్థ్యం యొక్క ప్రాముఖ్యతకు ఈ పథకం ద్వారా అంకురార్పణ జరిగినట్లు వివరించారు. పునరుత్పాదక, ఇంధన-సమర్థవంతమైన సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించడం వల్ల ఉద్యోగాలను సృష్టించడం, సహజ వనరులను సంరక్షించడం, కాలుష్యాన్ని తగ్గించడం సాధ్యమవుతుందన్నారు. దీర్ఘకాలిక పర్యావరణ స్థిరత్వాన్ని నిర్ధారించే కార్యక్రమాలకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థలు సహా అన్ని ఎస్‌డీఏలకు పంపిన సమాచారంలో బీఈఈ కార్యదర్శి మిలింద్ డియోర్ ఎనర్జీ ఎఫిషియెన్సీ కార్యక్రమాల అమలును తీవ్రతరం చేయాలని సూచించారు. అలాగే అదితి పథకం విజయవంతం కావడానికి రాష్ట్ర స్థాయిలో రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని కోరారు. ప్రభుత్వ, ప్రజా భవనాలలో ఇంధన సామర్థ్య చర్యలు అమలులో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిశాలతో పాటు తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని బీఈఈ మీడియా సలహాదారు తెలిపారు.
Prajavartha Online Telugu News