నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
సీజనల్ వ్యాధులు, కోవిడ్ నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి తగు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సీజనల్ వ్యాధులు, కోవిడ్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తదితర అంశాలపై అధికారులతో ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలం లో దోమలు, అపరిశుద్ధ్యం కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వీటిని నియంత్రించేందుకు తగు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైనేజీ లలో మురుగు నీరు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు పూడిక తొలగించాలని, రోడ్లపై చెత్త నిల్వ ఉండకుండా ప్రతీరోజూ శుభ్రం చేస్తూ ఉండాలన్నారు. డ్రైనేజీలలో దోమల నిర్ములనకు ఆయిల్ బాల్స్ వేయించాలన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జరిగేలా గ్రామాలలో పంచాయతీ అధికారులు, పట్టణాలలో పురపాలక సంఘ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో చర్యలు తీసుకోవాలన్నారు. దోమలు నియంత్రణకు ప్రతీ రోజూ ఫాగ్గింగ్ చేయాలన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై గ్రామాలలోను, పట్టణ ప్రాంతాలలోనూ ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇంటి పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూసేలా ప్రజలలో అవగాహన కలిగించాలన్నారు. హోటల్స్, తినుబండారాల బళ్ల వద్ద అపరిశుద్ధ్య పరిస్థితులు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రస్తుత కోవిడ్ సమయంలో జ్వరాలతో బాధపడే వారు తమకు వచ్చిన జ్వరం ఏమిటన్నది తెలియక ఆందోళన పడే అవకాశం ఉందన్నారు. జ్వరాల కేసులు ఎక్కువగా నమోదయ్యే ఆసుపత్రుల పరిధిలో సంబంధిత పిహెచ్ సి ల సిబ్బంది మెడికల్ క్యాంపులు నిర్వహించి, జ్వరాలతో బాధపడే వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేయాలన్నారు. కోవిడ్ లక్షణాలు కలిగిన వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ వచ్చినవారికి హోమ్ ఐసోలేషన్ లేదా ఆసుపత్రిలో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సిడిపిఓ వై. జయలక్ష్మి, డివిజినల్ పరిపాలనాధికారి ఎం. హరనాథ్, పిహెచ్ సి వైద్యాధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
Tags nuzividu
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …