-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు
-వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మాసోత్సవాలు ప్రారంభించిన మంత్రి…
-రక్తహీన తగ్గించడమే లక్ష్యంగా పనిచేయాలి…
-అంగన్వాడీ కార్యకర్తలు కాదు టీచర్లుగా గౌరవం పొందాలి…
పలాస, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి అంగన్వాడీ కార్యకర్తలు ప్రీస్కూల్ ద్వారా టీచర్లుగా మారుతారని వారి గౌరవం మరింత పెంచేలా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. సోమవారం పలాస మార్కెట్ యార్డులో నిర్వహించిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పౌష్టికాహార మాసోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1975 వ సంవత్సరంలో ప్రారంభమైన ఐసిడిఎస్ ప్రాజెక్టు పేద ప్రజలకు పౌష్టికాహారం అందించాలనే ఒక సంకల్పంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం స్థాపించిందని అన్నారు. వాస్తవానికి ఆహారం తీసుకోవడంలో లోపాలు ఏర్పడితే అనేక రకాల జబ్బులకు మనిషి గురౌతాడు. అందులోను గర్భిణీ స్త్రీలకు ఎంతో మంచి పౌష్టికాహారం అవసరమనితెలిపారు. ఎందుకంటే గర్భంలో పిండం పెరుగుతుంటే గర్భిణీ స్త్రీకి ఎంతో బలవర్ధకమైన ఆహారం అవసరం ఉంటుంది. రక్తం అభివృద్ధి చెందేలా ఉండాలి. సుఖ ప్రసవం జరగాలంటే గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. మరి సమకాలీన సమాజంలో ఎంతో ఒత్తిడికి లోనౌతున్న గర్భిణీ స్త్రీల ఆరోగ్య రక్షణ కోసం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. రక్త హీన తతో గర్భంలోనే బిడ్డలను పాడుగొట్టుకునే సందర్భాలు ఉండటం వలన వాటి నివారణకు ప్రపంచంలో పలుదేశాలు ఈ ప్రాజెక్టు ప్రారంభించారని తెలిపారు. ఇప్పటికి 52 శాతం గర్భిణీ స్త్రీలు రక్తహీనత తో బాదపడుతున్నారని. దాదాపు 31 శాతం గర్భిణీలకు పుట్టినటువంటి పిల్లలు తక్కువ బరువు కలిగిఉండటం జరుగుతుందని అన్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకు సంవత్సరానికి సుమారుగా 1840 కోట్ల రూపాయల పైబడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టి గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చే పౌష్టికాహారానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చే పౌష్టికాహారానికి మీరే బేరీజు వేసుకోవాలని కోరారు. రాబోయే కాలంలో ఎవరూ పౌష్టికాహార లోపంతో బాద పడకూడదని అందరూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలనేది ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అందుకే జగనన్న ప్రభుత్వం గతంలో కంటే పౌష్టికాహారంలో మరిన్ని రకాలు కలిగే విదంగా వస్తువులు సంఖ్య పెంచడంతో పాటు పాలు, గుడ్లు రోజు తినేలా ఉండేలా గుడ్లు సంఖ్య పెంచారని తెలిపారు. నాణ్యమైన ఆహార పదార్ధాలు అందించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లేస్ పధకాలను అందిస్తున్నారని అన్నారు. ఈ పధకం ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలు కలిసి దాదాపు 30 లక్షలకు పైబడి లబ్ధిపొందుతున్నారని ఒక్కొక్కరికి నెలకు సుమారుగా 13 వందల రూపాయలు చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వాలు ఇదే పధకానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే జగనన్న ప్రభుత్వం రెండున్నర రెట్లు పై బడి 1843 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని దీని బట్టి ప్రజలు అర్దం చేసుకోవాలని కోరారు. అంతే కాకుండా గతంలో అంగన్వాడీ టీచర్లు టీచర్లుగా కొనసాగాలేదని కానీ జగనన్న ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లను టీచర్లుగా తయారు చేసి వారికి సమున్నత స్థానం కల్పిస్తుందని అన్నారు. ప్రీస్కూల్ లు ఏర్పాటు చేయడం వలన అంగన్వాడీ కార్యకర్తలను తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అలాంటి ప్రచారాలు నమ్మొద్దని అన్నారు. వాస్తవాలని గమనించాలని వ్యవస్థలు బలంగా ఉండాలని వాటి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మరింతగా కృషి చేయడం కోసం నాణ్యత పెంచడం కోసం ప్రీస్కూల్ వ్యవస్థ వస్తుందని దాని కోసం అంగన్వాడీ టీచర్లకు తర్ఫీదు ఇస్తామని తెలిపారు. ఇటీవల కాలంలో అంగన్వాడీ ల ద్వారా ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయని కూడా ప్రచారం మొదలుపెట్టారని అవి ప్లాస్టిక్ బియ్యం కాదని తెలిపారు. బియ్యంలో ఫోర్టిఫైడ్ బియ్యం కలిపి ఆహారంలో పలు విటమిన్ లు తయారు అయ్యేలా ప్రతి 80 కిలోలు బియ్యం బస్తాకు 2 కిలోలు ఫోర్టిఫైడ్ బియ్యం కలుపుతారని వాటి ద్వారా బలవర్ధకమైన ఆహారం అందుతుందని ఈ విషయాన్ని అంగన్వాడీ ల ద్వారా బియ్యం అందించినప్పుడు లబ్ధిదారులకు తెలియజేయవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలాస మార్కెట్ కమిటీ చైర్మన్ పివి సతీష్, పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, వైస్ చైర్మన్ మీసాల సురేష్ బాబు, ఎంపిడిఒ ఎన్.రమేష్ నాయుడు, ఎమ్మార్వో మధుసూదనరావు, ఐసిడిఎస్ పిఒ శార్వాణి తోపాటు ఇతర అధికారులు నాయకులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.