-జగనన్న ప్రభుత్వానికి రెండేళ్లల్లో రెట్టింపైన ప్రజాదరణ…
-తెలుగుదేశం అధ్యాయం ముగిసిందనడానికి కుప్పం ఫలితమే నిదర్శనం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యాయం ముగిసిందనడానికి కుప్పం ఫలితాలే నిదర్శనమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా వాంబే కాలనీలోని ఏ బ్లాక్ లో డివిజన్ కోఆర్డినేటర్ బెవర నారాయణతో కలిసి ఆయన పర్యటించారు, ప్రజా సమస్యలపై ఆరా తీశారు. కాలువలన్నీ చెత్తాచెదారంతో పూడుకుపోవడంపై శాసనసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజీ పొంగిపొర్లుతున్నా అధికారులకు కనీసం చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. తక్షణమే కాలువలలలో చెత్తను తొలగించి.. మురుగు పారేలాగా చూడాలన్నారు. ప్రజలు చెత్తను పడవేసేందుకు ఎక్కడికక్కడ డంపర్ బిన్ లను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే పగిలిన పైపు లైన్లకు మరమ్మతులు నిర్వహించాలని ఆదేశించారు. ఖాళీ స్థలాలలో పిచ్చి మొక్కలు ఉన్నట్లయితే వాటిని తొలగించాలన్నారు. ఒరిగిన విద్యుత్ స్తంభాల తొలగించడం, కిందికి వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయడం వంటి పనులను తక్షణం చేపట్టాలన్నారు. అవసరమైన చోట మురుగు కాల్వలపై సిమెంట్ బిల్లలను ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ.. నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. అనంతరం పరిషత్ ఫలితాలలో వైఎస్సార్ సీపీ ఘన విజయాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ సీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసిన చివరకు ప్రజాస్వామ్యమే గెలిచిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకే ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ 90 శాతానికిపైగా సీట్లతో ప్రజలు వైఎస్సార్ సీపీని ఆదరించారని వెల్లడించారు. నిన్న వెలువడిన ఫలితాలతో ప్రజలు మరొక్కసారి రావాలి జగన్ – కావాలి జగన్ అని బలంగా కోరుకుంటున్నట్లు స్పష్టమైందన్నారు. పరిషత్ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో మరోసారి టీడీపీ కంచుకోటలకు బీటలు పడ్డాయని.. కుప్పంలో వెలువడిన ఫలితాలే ఇందుకు నిదర్శనమని మల్లాది విష్ణు అన్నారు. ప్రజాతీర్పును ముందుగా గ్రహించే స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు ముగిసినా.. గెలవలేమని గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఎన్నికలు పెట్టకుండా పారిపోయారన్నారు. రాష్ట్రంలో పొత్తులేకుండా ఇప్పటివరకు చంద్రబాబు గెలిచిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. గెలుపైనా, ఓటమైనా ఒంటరిగా పోటీ చేయగల సత్తా ఉన్న ఏకైక నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కితాబిచ్చారు. రాష్ట్రంలో తెలుగుదేశం ముగిసిన అధ్యాయమని.. ఇకనైనా పిచ్చి మాటలు మానుకోవాలని ఆ పార్టీ నాయకులకు సూచించారు. ప్రజా తీర్పును గౌరవించి చంద్రబాబు, ఆయన అనుచర గణం కుట్ర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు బత్తుల దుర్గారావు, రాజా, నాని, గోపి, సుభానీ, ఇస్మాయిల్, కిరణ్, దుర్గాప్రసాద్, కుమారి, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.