-స్ట్రీట్స్ ఫర్ పీపుల్ ఛాలెంజ్ లో భాగంగా రూ.33 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర సుందరీకరణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ‘స్ట్రీట్స్ ఫర్ పీపుల్ ఛాలెంజ్’లో భాగంగా 33వ డివిజన్ లో శివాలయం వీధి నుండి బీఆర్టీఎస్ రోడ్డు వరకు రూ. 33.20 లక్షలతో ప్రధాన రహదారి సుందరీకరణ పనులకు మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి లతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్’ వారి ‘స్ట్రీట్స్ ఫర్ పీపుల్’ ఛాలెంజ్ ద్వారా నగరానికి కొత్త రూపు తీసుకువచ్చేందుకు నగరపాలక సంస్థ విశేషంగా కసరత్తు చేస్తోందన్నారు. అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరానికి తగ్గట్లుగా వాకింగ్ ట్రాక్ లు, మెరుగైన పార్కింగ్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకుని ప్రజల భాగస్వామ్యంతో వాటిని అభివృద్ధి పరుస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలకు అనువుగా ఉండే రీతిలో వీధులన్నీ తీర్చిదిద్దడంతో పాటు.. పాదచారులు సులభంగా ఒకవైపు నుంచి నడిచి వెళ్లేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం సమగ్ర విధానాన్ని మాస్టర్ ప్లాన్ తరహాలో రూపొందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) శారదాదేవి, డిప్యూటీ సిటీ ప్లానర్ జుబిన్ రాయ్, ఈఈ శ్రీనివాస్, డివిజన్ కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, వీఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.