మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇరువర్గాల మధ్య తలెత్తే క్లిష్ట సమస్యలను సామరస్యంతో పరిష్కరించుకోవచ్చని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. సోమవారం ఆయన అంబేద్కర్ సర్కిల్ వద్ద స్థానిక రైస్ మిల్లర్ల అసోసియేషన్ భవనంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో కలసి గిలకలదిండి మరియు పోలాటితిప్ప మత్స్యకార గ్రామస్థుల మధ్య తలెత్తిన వలకట్ల సమస్యను పరిష్కరించే విషయమై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 గ్రామాల మధ్య ఇటువంటి క్లిష్ట సమస్య తలెత్తినప్పుడు ఆ సమస్య పరిష్కరించడం అధికారులకు కష్ట సాధ్యంగా మారినప్పుడు ఇరువర్గాలు ముందుకు వచ్చి సామరస్యంతో సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చునన్నారు. సమావేశ ప్రారంభంలో ఆయన కొల్లు రవీంద్రతో కలసి గిలకలదిండి మరియు పోలాటితిప్ప గ్రామస్థుల మధ్య తలెత్తిన వలకట్ల విషయాన్ని ఆయా గ్రామాల ఇరువర్గాల నుంచి సమస్యను విన్నారు. గిలకలదిండి గ్రామస్తులు తమ సమస్యను వివరిస్తూ సముద్రపు పాయనుండి వచ్చిన ఉప్పుటేరు నుంచి పోలాటి తిప్ప గ్రామస్థులు రొయ్యల చెరువుల సాగుకోసం చిన్నకాలువ త్రవ్వు కెళ్లారని, నేడు అది సముద్రపు ఆటుపోటులకు కోతకు గురై పెద్ద కాలువగా మారిందని, గత కొంత కాలంగా అదే కాలువ మీద పోలాటి తిప్ప గ్రామస్థులు అక్రమంగా వలకట్లు కట్టుకోవడం వల్ల దిగువనున్న తమ వలల్లో సరుకుపడటం లేదని, దీనికి వారిని అక్కడ వలకట్లు కట్టకుండా నిరోధించాలని వారు కోరారు. అందుకు పోలాటితిప్ప గ్రామస్థులు, తవ్విన కాలువ తమ భూభాగపు సరిహద్దులో నిదని, కావున దీనిపై తమకు హక్కు ఉందని, మానకోవడం కుదరదని తెలిపారు. పేర్నినాని, కొల్లు రవీంద్రలు విడి విడిగా ఇరువర్గాల గ్రామ పెద్దలను పిలిచి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేశారు. త్వరలో సమస్య ఉద్భవించిన ప్రాంతాన్ని సందర్శించి 2 గ్రామాల ప్రజలకు సమన్యాయం చేస్తామని, అంత వరకు ఇరువర్గాలు సమన్వయంతో వ్యవహరించాలని ఆయన కోరారు. అందుకు వారు దానికి సమ్మతించి సాధ్యమైనంత త్వరగా తమ సమస్యను పరిష్కరించాలని ఆయన్ను కోరారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ జెడి షేక్ లాల్ మహమ్మద్, సహాయ సంచాలకులు వెంకటేశ్వర రెడ్డి, బందరు డిఎసిపి మాసుం బాషా, మాజీ జడ్ పిటిసిలు లంకె వెంకటేశ్వరరావు, లంకె నారాయణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …