Breaking News

మత్య్సకారుల ఆర్థిక మూలాలను దెబ్బ తీసే ప్రయత్నాలను సర్కార్ మానుకోవాలి…

-జనసేన మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర కమిటీ సమావేశంలో పవన్ కల్యాణ్ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సంప్రదాయంగా, వారసత్వంగా వస్తున్న చేపల వేట, అమ్మకాలపై ఆధారపడ్డ మత్స్యకారుల జీవనోపాధికి గండికొట్టి, వారి ఆర్థిక మూలాలను దెబ్బ తీసే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్  స్పష్టం చేశారు. చెరువులు, రిజర్వాయర్లు లాంటి చోట్ల మత్స్యకార సొసైటీ సభ్యులకు చేపలు వేటాడుకొనే అవకాశం లేకుండా చేస్తున్న జీవో 217 విషయంలో జనసేన పార్టీ ఎలా పోరాడాలనే విషయంలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. జీవో 217 మూలంగా మత్స్యకారులు ఏ విధంగా దెబ్బ తింటారో, ఈ జీవో వెనక ఉద్దేశాలను తెలియచేస్తూ ఈ కమిటీ ఓ నివేదిక ఇస్తుందన్నారు. గురువారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేన మత్స్యకార వికాస విభాగం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్, మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా  పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “ప్రజా పోరాట యాత్రను ఇచ్చాపురం ప్రాంతంలో కపాసు కుర్ది దగ్గర గంగమ్మకు పూజ చేసే మొదలుపెట్టాను. కోస్తాలో పర్యటించిన ప్రతి ప్రాంతంలో మత్స్యకారుల సమస్యల గురించి, ఇక్కడ జీవనోపాధి లేక వలసలుపోతుండటాన్ని అవగాహన చేసుకున్నాను. మత్స్యకారుల సమస్యలపై పోరాడటమే కాకుండా… ఈ వృత్తిపై ఆధారపడ్డవారు నైపుణ్యాలు పెంచుకొని ఆర్థికంగా ఎదిగే అంశాలపై అవగాహన కలిగించేందుకే పార్టీ పక్షాన మత్స్యకార వికాస విభాగం ఏర్పాటు చేశాం. పాలనలో ఉన్నవారు సైతం సంప్రదాయ వృత్తులపై ఆధారపడ్డవారికి ఆర్థిక బలం చేకూర్చేలా చేయాలి. అంతేగానీ ఆర్థిక మూలాలను దెబ్బ తీసేలా నిర్ణయాలు చేయకూడదు. చెరువులు, రిజర్వాయర్ల దగ్గర చేపల వేటకు మత్స్యకారులకు అవకాశం లేకుండా చేసి వేలం ద్వారా సమకూరే ఆదాయంలో 70శాతం ప్రభుత్వమే తీసుకొంటుందనే ఆందోళన మత్స్యకారుల్లో ఉంది” అన్నారు.
మత్స్యకార వికాస విభాగం సభ్యులు తమ ఆందోళనను వెలిబుచ్చుతూ ఈ విధంగా వేలం వేయడం అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే… అదీ నెల్లూరు జిల్లాకే పరిమితం అని రాష్ట్ర మంత్రి చెబుతున్నారనీ… అయితే జీవో 217లో ఆ వివరాలు లేవు అన్నారు. ఈ వృత్తిపై ఆధారపడ్డవారికి ఉపాధి లేకుండా చేస్తుంది ఈ జీవో అని తెలిపారు.
ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు టి.శివశంకర్, సత్య బొలిశెట్టి, పాలవలస యశస్వి , లీగల్ సెల్ ఛైర్మన్ ఈవన సాంబశివ ప్రతాప్ పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *