Breaking News

జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై సచివాలయంలో గురువారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ దొరబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాధి మంది పేదలకు మేలు చేసేందుకే సీఎం వైయస్ జగన్ పెద్ద మనస్సుతో వన్‌టైం సెటిల్‌మెంట్ స్కీంను ప్రకటించారన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 67 లక్షల మంది పేదలకు లబ్ధి జరుగుతుందన్నారు. డిసెంబర్ 21న గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వన్‌ టైం సెటిల్‌మెంట్ అమలుకు సిద్దం కావాలన్నారు. ఈ పథకం అమలులో ఉన్న సాదకబాధకాలను కూలంకశంగా పరిశీలించాలన్నారు. 1980-2011 వరకు ఉన్న ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు విడిపించుకునే అవకాశం పేదలకు లభిస్తోందన్నారు. పేదల ఇళ్లపై వారికే పూర్తి హక్కు వస్తుందని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం, ఇతరులకు తమ అవసరాల కోసం విక్రయించుకునే వెసులుబాటు వస్తుందన్నారు. తమ ఆస్తులపై బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం వస్తుందన్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, గృహనిర్మాణం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, సర్వే విభాగాలు సమన్వయంతో పనిచేసి అర్హులను గుర్తించాలన్నారు. గ్రామాల్లో వన్‌ టైం సెటిల్‌మెంట్ కింద అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకం కింద లబ్ధి పొందాలన్నారు. గతంలో ప్రభుత్వం నుంచి పట్టాలు పొంది, తరువాత అనధికారికంగా ఇతరులకు విక్రయించిన పరిస్థితుల్లో సదరు ఇంటిపై హక్కులను కల్పించే విషయంలో శాస్త్రీయంగా ఒక విధానంను రూపొందించాలన్నారు.  ఇప్పటికే స్వామిత్వ పథకం కింద రాష్ట్రం మొత్తం భూరికార్డుల ప్రక్షాళన జరుగుతున్న నేపథ్యంలో అవసరమైతే ఆ వివరాలను కూడా పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో సీసీఎల్‌ఏ నీరబ్ కుమార్‌ ప్రసాద్‌, స్పెషల్ సీఎస్(రిజిస్ట్రేషన్స్&ఎక్సైజ్) రజత్ భార్గవ్, స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ(హౌసింగ్) అజయ్ జైన్, ప్రిన్సిపల్ సెక్రటరీ(ల్యాండ్,ఎండోమెంట్స్ &డీఎం- రెవెన్యూ) వి.ఉషారాణి, ప్రిన్సిపల్ పీఆర్‌&ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఎండి (హౌసింగ్) నారాయణ్‌ భరత్ గుప్తా, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్ కమిషనర్ శేషగిరిరావు తదితరులు హాజరయ్యారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *