Breaking News

విజయదశమికి చెరకు ఫ్యాక్టరీల్లో ఉద్యోగుల జీతాల చెల్లింపు… : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

-వర్చువల్ గా సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం
-హైకోర్టు తీర్పుతో చెరకు రైతులకు మేలు జరిగింది : మంత్రి మేకపాటి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా కల్లా చక్కెర ఫ్యాక్టరీలలోని ఉద్యోగుల జీతాల చెల్లింపులకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. చెరకు రైతుల బకాయిల చెల్లింపుకు తొలి ప్రాధాన్యమివ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గురువారం ఉదయం మంత్రివర్గ ఉపసంఘం చెరకు ఫ్యాక్టరీల సమస్యలు సహా పలు అంశాలపై వర్చువల్ గా సమావేశమై చర్చించారు. హైకోర్టు తీర్పుతో చెరకు రైతులకు ఎంతో మేలు జరిగిందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అక్టోబర్ 5వ తేదీన జరగబోయే టెండర్ ప్రక్రియ గురించి ఆయన ఆరా తీశారు. హై కోర్టు నుంచి స్టే తీసుకువచ్చేందుకు కృషి చేసిన ఉన్నతాధికారులను మంత్రివర్గ ఉపసంఘం అభినందించింది. చెరకు రైతులు, చక్కెర ఫ్యాక్టరీల ఉద్యోగుల జీతాల బకాయిలపై మంత్రి వర్గ ఉపసంఘం ప్రత్యేకంగా చర్చించింది.

ముఖ్యమంత్రితో సమావేశమై ఆ తర్వాత అన్నింటిపై స్పష్టత తీసుకురావాలని వారు సమాలోచనలు జరిపారు. టెండర్ తర్వాత మరోసారి భేటీ కావాలని ముగ్గురు మంత్రులు నిర్ణయించారు. షుగర్స్ డైరెక్టర్, కమిషనర్ తో పాటు ఒక ఉన్నతాధికారిని ఏర్పాటు చేసి వేగంగా చక్కెర అమ్మకాలు పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాదికి గానూ చోడవరం, తాండవ సహా పలు చక్కెర కర్మాగారాలకు సంబంధించిన బకాయిల మొత్తం రూ.70 కోట్లు ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. అందులో ఏటికొప్పాక, తాండవ ఫ్యాక్టరీల బకాయిల విలువే అత్యధికమన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ ఇప్పటికే రూ.72 కోట్లు చెల్లించినట్లు మంత్రులకు వివరించారు. చక్కెర ధర పెరిగిన నేపథ్యంలో వీలైనంత త్వరగా అమ్మకాల ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి కన్నబాబు వెల్లడించారు.

చక్కెర ఫ్యాక్టరీల ఇబ్బందులు, చెరకు రైతులు సమస్యలు, ఫ్యాక్టరీల ఉద్యోగుల జీతాల వంటి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రులు తెలిపారు. చక్కెర అమ్మకాలు, వీఆర్ఎస్ స్కీమ్ అమలు సహా మంత్రివర్గ ఉపసంఘ నిర్ణయాలు ఆర్థిక శాఖతో ముడిపడి ఉన్నాయని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. ఆప్కోబ్ బకాయిల మొత్తంపైనా మంత్రి కన్నబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు.చక్కెర అమ్మకాల మొత్తంలో ముందు రైతులకు చెల్లించేందుకే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతగా తీసుకుందని మంత్రి వర్గ ఉపసంఘం వెల్లడించింది.. అనంతరం ఉద్యోగులకు జీతాల బకాయిలను చెల్లించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

చోడవరం ఫ్యాక్టరీలోని చక్కెర సహా పలు కర్మాగారాలలో నిల్వ ఉన్న చక్కెరను అమ్మితే రూ.127 కోట్లు రావచ్చనే అంచనాను పూనం మాలకొండయ్య తెలిపారు. మంచి ధర వస్తేనే చక్కెర అమ్మకాలు చేపడతామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ఏఏ ఫ్యాక్టరీలో ఎంత స్థాయి చక్కెర నిల్వలు ఉన్నాయి, ఫ్యాక్టరీల ఉద్యోగుల జీతాల బకాయిలు, వీఆర్ఎస్ వంటి అంశాలపై ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు సహా వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, షుగర్స్ డైరెక్టర్ వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *