-ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ధ్వజం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు అత్యంత కీలకమైన జర్నలిస్టుల సమస్యలపట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారని ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐజేయూ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ శనివారం ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ కొత్తవంతెన వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేసారు. యూనియన్ అధ్యక్షులు చావారవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ జర్నలిస్టుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపడం సరికాదన్నారు.
జర్నలిస్టులను కోవిడ్ ఫ్రంట్లైన్ వారియర్స్ గా గుర్తించి రూ.50 లక్షల బీమా పథకాన్ని వర్తింపజేయాలని, వర్కింగ్ జర్నలిస్టు చట్టాన్ని పునరుద్ధరించాలని, చిన్న పత్రికలకు అక్రిడేషన్ మంజూరులో జి ఎస్ టీ నిబంధన పూర్తిగా ఎత్తివేయాలని, వెటరన్ జర్నలిస్టుల వయోపరిమితిని 58 ఏళ్ళ కుదించాలని, అటాక్స్, వెల్ఫేర్, ప్రెస్ అకాడమీ కమిటీలను ఏర్పాటు చేయాలని, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, పదవీ విరమణ చేసిన జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలని, ప్రమాద బీమా పథకాన్ని కొనసాగించాలని తదితర డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని కోరారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్థన్ మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కారించాలని లేని పక్షంలో తమ అందోళనను ఉదృతంగా చేస్తామన్నారు. విశాలాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కూనా అజయ్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నాలుగు కోడ్ లుగా విభజించి జర్నలిస్టుల, రైతు చట్టాలను రద్దు చేయడం ఎంతో దుర్మార్గపు చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వరరావు, జి రామారావు, షేక్ బాబు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి, నగర అధ్యక్షులు ఎంవీ సుబ్బారావు, ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.