Breaking News

సంక్షోభంలోనూ సంక్షేమమే..!

-తీవ్ర బొగ్గు కొరత ఉన్నా.. పెరుగుతున్న విద్యుత్తు డిమాండును తట్టుకునేందుకు విద్యుత్తు సంస్థలు సిద్ధం
-ఏపీ జెన్కో మొత్తం సామర్థ్యం 5010 మెగావాట్లు
-బొగ్గు కొరతతో 2300-2500 మెగావాట్ల ఉత్పత్తే..
-థర్మల్ విద్యుత్కేంద్రాలకు రోజుకు 70 వేల టన్నుల బొగ్గు అవసరం..
-కానీ, సెప్టెంబరులో వచ్చింది 24 వేల టన్నులే
-దేశంలో బొగ్గు కొరతతో రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం
-ముఖ్యమంత్రి చొరవతో కొంత మేర మెరుగుపడిన బొగ్గు సరఫరా
-వెల్లడించిన విద్యుత్తు అధికారులు
-వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వం ఎన్నడూ రాజీ పడలేదు
-నిరంతరాయంగా కరెంటు సరఫరా కోసం యూనిట్ రూ.15-20 వెచ్చించి కొనుగోలు
-విద్యుత్తు సంస్థలకు రూ.34,340 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
-బొగ్గు కొరత నేపథ్యంలో…. తక్కువ అంతరాయాలతో నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న డిస్కంల అధికారులు, సిబ్బందికి మంత్రి బాలినేని అభినందనలు
-రైతులు, వినియోగదారులకు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా బొగ్గు కొరత.. థర్మల్ విద్యుత్కేంద్రాల్లో అడుగంటిన బొగ్గు నిల్వలు.. కొన్ని రాష్ట్రాల్లో అయితే అనధికారిక కరెంటు కోతలు మొదలయ్యాయి కూడా.. దేశ రాజధాని ఢిల్లీలో బ్లాక్ అవుట్ చేయాల్సిన పరిస్థితులు.. బొగ్గు సరఫరా పెంచండి మహాప్రభో అంటూ కేంద్రానికి వినతులు.. మహారాష్ట్ర, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కొన్ని థర్మల్ విద్యుత్తు కేంద్రాలు షట్ డౌన్ చేసిన వైనం.. ఇదీ ప్రస్తుతం దేశంలో విద్యుత్తు రంగం పరిస్థితి. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు సంస్థలు వినియోగదారులకు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయి. బొగ్గు సంక్షోభం ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా పడినప్పటికీ వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా ఏపీ డిస్కంలు పనిచేస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం/విద్యుత్తు సంస్థలు మన థర్మల్ విద్యుత్కేంద్రాలకు 20 బొగ్గు రేక్ లను కేటాయించేలా బొగ్గు, రైల్వే శాఖలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించేలా చూసేందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాగే పీపీఏలు లేదా బొగ్గు అనుసంధానం లేకుండానే అత్యవసర ప్రాతిపదికన ‘నిలిచిపోయిన/పనిచేయని’ పిట్ హెడ్ బొగ్గు గనులను పునరుద్ధరించాలని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేసేలా చూస్తోంది. విద్యుత్తుకు భారీ డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో సాధారణంగా యూనిట్ రూ.4-5 ఉండే ధర ప్రస్తుతం అత్యధికంగా రూ.20 వరకూ చేరినట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా బొగ్గు కొరతతో అత్యధిక డిమాండ్ అత్యల్ప సరఫరా పరిస్థితులు నెలకొనడంతో కరెంటు ధరలు భారీగా పెరిగిపోయాయి. అదేసమయంలో ఈ నెలలో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ 190 మిలియన్ యూనిట్లకు చేరింది. గత ఏడాది అక్టోబరులో ఇది 160 మిలియన్ యూనిట్లు కావడం గమనార్హం.
రాష్ట్రంలో మొత్తం ఏ పీ జెన్కో స్థాపిత సామర్థ్యం 5010 మెగావాట్లు కాగా.. ప్రస్తుతం ఏపీ జెన్కో 2300 నుంచి 2500 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. బొగ్గు కొరత కారణంగా ఆర్టీటీపీకి చెందిన కొన్ని యూనిట్లు షట్ డౌన్ చేశారు. కృష్ణపట్నం, ఎన్టీటీపీఎస్ లు కూడా వాటి సామర్థ్యం కంటే తక్కువగానే విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 18533 మెగావాట్లు కాగా.. ఇందులో సౌర, పవన విద్యుత్తు 8075 మెగావాట్లు. అయితే వాతావరణపరమైన మార్పుల కారణంగా బేస్ లోడుకు సరిపడా విద్యుత్తు అందడం లేదు.
రాష్ట్రానికి గ్యాస్ ఆధారిత స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 908 మెగావాట్లు కాగా కేవలం 100 మెగావాట్లకే గ్యాస్ సరఫరా అవుతోంది. ఇక 1040 మెగావాట్ల సామర్థ్యం కలిగిన హెచ్ఎన్పీసీఎల్ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. రాష్ట్రంలో మొత్తం విద్యుత్తు వినియోగం 63070 మిలియన్ యూనిట్లు కాగా థర్మల్, జల, పవన, సౌర, కేంద్ర విద్యుదుత్పత్తి సంస్థల నుంచి 50,000 మిలియన్ యూనిట్ల కరెంటు రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలకు అందుబాటులో ఉంది.
ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్లకు సెప్టెంబరులో సగటున రోజుకు 70 వేల టన్నుల బొగ్గు అవసరం కాగా 24వేల టన్నుల బొగ్గు సరఫరా అయింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో ఇటీవల అది 40 వేల టన్నులకు పెరిగింది. ‘‘గడిచిన రెండేళ్లుగా దేశవ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిలో కొరత ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు గణనీయంగా పెరిగాయి.దీనికి తోడు ఇటీవల విద్యుత్ గ్రిడ్ డిమాండ్ బాగా పెరిగింది. రోజుకు కనీసం 15 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఎక్కువ వినియోగం జరుగుతుంది.ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ సరఫరా పై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది’’ అని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
బొగ్గు సంక్షోభాన్ని అధిగమించి, వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా చూస్తూ , కరెంటు సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని అధికారులు తెలిపారు.తొట్టతొలిసారిగా బొగ్గు కొరత తీర్చే విషయంలో కేంద్రం జ్యోక్యం చేసుకొని , విద్యుత్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి కి లేఖ రాసిన తోలి సి ఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి. ఫలితంగానే రాష్ట్రానికి బొగ్గు సరఫరా కొంత మెరుగైంది’’ అని అధికారులు చెప్పారు. గడిచిన రెండేళ్లలో చౌక విద్యుత్తు కొనుగోలు, ఉత్తమ విధానాలను అనుసరించడం ద్వారా విద్యుత్తు సంస్థలు రూ.2300 కోట్లు ఆదా చేసినట్లు తెలిపారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును అందించడం కోసం బహిరంగ మార్కెట్లో అధిక ధరలు చెల్లిస్తూ యూనిట్ కు రూ.14 నుంచి రూ.20 వరకు వెచ్చించాల్సి వస్తోందని అధికారులు చెప్పారు. విద్యుత్తు వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం/ విద్యుత్ సంస్థలు ఎన్నడూ రాజీ పడబోvaని తెలిపారు. ‘‘విద్యుత్తు రంగం గతంలోనూ అనేక సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, ఎన్నడూ వెనకడుగు వేయలేదు. ఇది తాత్కాలికమే. ప్రభుత్వ సహకారంతో, వినియోగదారుల మద్దతుతో మనం ఈ సంక్షోభాన్ని తప్పకుండా అధిగమిస్తాం’’ అని అధికారులు చెప్పారు.
గడిచిన రెండున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు రంగానికి ఎనలేని మద్దతు ఇస్తోందని, రెండేళ్లలో ప్రభుత్వం విద్యుత్తు సంస్థలకు రూ.34,340 కోట్లు విడుదల చేసిందన్నారు. ఒక్క కృష్ణపట్నం విద్యుత్కేంద్రానికే ప్రభుత్వం రూ.9160 కోట్లు చెల్లించిందని చెప్పారు.
2014-19 మధ్య మొత్తం విద్యుత్తు కొనుగోలు బిల్లులు రూ.56,904 కోట్లు కాగా.. డిస్కంలు ఏపీ జెన్కో, ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు అభివృద్ధి సంస్థ (ఏపీపీడీసీఎల్ )లకు రూ.43,048 కోట్లు చెల్లించాయి. ఐదేళ్లకు సంబంధించి ఇంకా రూ.13,866 కోట్లు చెల్లించాల్సి ఉంది.
2020-21 (సెప్టెంబరు) మధ్య కాలంలో మొత్తం బిల్లులు రూ.30,883 కోట్లు కాగా.. డిస్కంలు రూ.33,054 కోట్లు చెల్లించాయి. గతంలో చెల్లించాల్సిన రూ.13,866 కోట్లు ప్రస్తుతం రూ.11,695 కోట్లకు తగ్గాయి.
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని రైతులు, వినియోగదారులు, విద్యుత్తురంగ ఉద్యోగులు, సిబ్బందికి ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు. తీవ్ర బొగ్గు కొరత ఉన్నప్పటికీ వినియోగదారులకు తక్కువ అంతరాయాలతో మరియు కొంత మేర లోడ్ రిలీఫ్ చర్యలు తో వినియోగదారులకు విద్యుత్తును నిరంతరాయంగా అందించేందుకు కృషి చేస్తున్న ఏపి ట్రాన్స్ కో సియండి మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి, డిస్కంల సీఎండీలు హెచ్.హరనాథరావు, జె.పద్మాజనార్దన్ రెడ్డి, కె.సంతోషరావు, ఇతర అధికారులు, సిబ్బందికి మంత్రి అభినందనలు తెలియజేశారు.

ఈ పరిస్థితుల్లో విద్యుత్తు సంస్థలకు అండగా నిలుస్తున్న విద్యుత్ వినియోగదారులకు, మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

 

 

 

 

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *